Asianet News TeluguAsianet News Telugu

కరోనా ‘డేంజర్’ బెల్స్: 11 ఏళ్ల కనిష్ఠానికి జీడీపీ:7ఏళ్ల గరిష్ఠానికి ద్రవ్యలోటు..

కరోనా ప్రభావం పెరుగడానికి ముందే దేశంలో ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. గత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసికంలో వృద్ధిరేటు 3.1 శాతానికి మందగించడంతో స్థూల దేశీయోత్పత్తి 4.2 శాతానికి క్షీణించింది. ఫలితంగా జీడీపీ 11 ఏళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీంతో ఐదు శాతం వృద్ధిరేటు నమోదు కావచ్చునన్న ఆర్బీఐ అంచనాలు ఆమడ దూరంలో ఉన్నాయి. వ్యవసాయ, మైనింగ్‌ మినహా అన్ని కీలక రంగాల్లో వృద్ధిరేటు మందగించింది. 
 

What the deceleration in GDP growth rate tells us about state of the Indian economy
Author
Hyderabad, First Published May 30, 2020, 11:00 AM IST

న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా ప్రభావం పెరగడానికి ముందే బీటలు వారుతున్నది. ఓ వైపు మాంద్యం, మరో వైపు కరోనా కాటుతో ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్థం అవుతున్నది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు భారీగా క్షీణించి 11 ఏళ్ల కనిష్ఠస్థాయికి దిగజారింది. చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో దేశ ఆర్థిక వృద్ధిరేటు 3.1 శాతానికి మందగించింది. 

2018-19 ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు 5.7 శాతంగా నమోదైంది. ఆ ఏడాది మొత్తానికి 6.1 శాతంగా నమోదైన వృద్ధిరేటు 2019-20లో 4.2 శాతానికి దిగజారినట్టు జాతీయ గణాంకాల సంస్థ (ఎన్‌ఎస్‌వో) శుక్రవారం వెల్లడించింది. 2008-09లో నమోదైన 3.1 శాతం వృద్ధిరేటు తర్వాత ఇదే అత్యల్పమని స్పష్టం చేసింది. 

దేశంలో కరోనా ప్రభావం ముదరడానికి ముందే వృద్ధిరేటు ఇంత అథమ స్థాయికి దిగజారడం ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. దీన్ని బట్టి చూస్తే మున్ముందు జీడీపీ మరింత క్షీణించడం ఖాయమని స్పష్టమవుతున్నది. కరోనా వైరస్‌ వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన విషయం తెలిసిందే. 

అప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక కార్యకలాపాలు మందగించడంతో జనవరి-మార్చి త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థకు కూడా నష్టం వాటిల్లింది. దీంతో 2019-20లో 5 శాతం వృద్ధిరేటు నమోదు కావొచ్చన్న రిజర్వు బ్యాంకు అంచనాలు నెరవేరలేదు. 

ఏడాది క్రితం తయారీ రంగంలో 2.1 శాతంగా ఉన్న గ్రాస్‌ వాల్యూ యాడెడ్ (జీవీఏ‌) వృద్ధిరేటు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 1.4 శాతానికి తగ్గింది. నిర్మాణ రంగంలో వృద్ధిరేటు 6 శాతం నుంచి 2.2 శాతానికి, విద్యుత్‌, గ్యాస్‌, నీటి సరఫరా, ఇతర వినిమయ సేవల రంగాల్లో 5.5 శాతం నుంచి 4.5 శాతానికి క్షీణించింది. 

వాణిజ్యం, హోటళ్లు, రవాణా, కమ్యూనికేషన్లు, ప్రసార సేవల రంగాల్లో జీవీఏ 6.9 శాతం నుంచి 2.6 శాతానికి పతనం అయ్యాయి. ఆర్థిక, రియల్‌ ఎస్టేట్‌, వృత్తి సేవల రంగాల్లో వృద్ధిరేటు 8.7 శాతం నుంచి 2.4 శాతానికి, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, డిఫెన్స్‌, ఇతర సేవా రంగాల్లో 11.6 శాతం నుంచి 10.1 శాతానికి దిగజారింది. 

2018-19 చివరి త్రైమాసికంలో 1.6 శాతంగా ఉన్న వ్యవసాయరంగ వృద్ధిరేటు ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో 5.9 శాతానికి, మైనింగ్‌ రంగంలో 4.8 శాతం నుంచి 5.2 శాతానికి పెరిగింది. స్థిర ధరల ప్రకారం ఈ ఏడాది జనవరి-మార్చి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి 3.1 శాతం పెరిగి రూ.38.04 లక్షల కోట్లకు చేరవచ్చని ఎన్‌ఎస్‌వో పేర్కొన్నది.

also read కరోనా విజృంభణ: చైనాను దాటేసిన భారత్ మరణాలు

2018-19 చివరి త్రైమాసికంలో ఇది రూ.36.90 లక్షల కోట్లుగా ఉన్నది. 2019-20లో వాస్తవిక జీడీపీ రూ.145.66 లక్షల కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నామని, 2018-19లో ఇది రూ.139.81 లక్షల కోట్లుగా ఉన్నదని తెలిపింది.

ప్రస్తుత ధరల ప్రకారం 2018-19లో రూ.1,26,521గా ఉన్న తలసరి ఆదాయం 2019-20లో 6.1 శాతం వృద్ధిచెంది రూ.1,34,226కు చేరుకోవచ్చని ఎన్‌ఎస్‌వో అంచనా వేసింది.

మరోవైపు ద్రవ్యలోటు కలవరానికి గురిచేస్తున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీలో ద్రవ్యలోటు 4.6 శాతానికి దిగజారి ఏడేళ్ల గరిష్ఠ స్థాయికి చేరింది. 2012-13లో ద్రవ్యలోటు 4.9 శాతంగా నమోదైంది. ఇప్పటి వరకు ఇదే గరిష్ఠం. ద్రవ్యలోటు 3.8 శాతంగా ఉంటుందని ఫిబ్రవరిలో కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ (సీజీసీ) అంచనా వేసినా ప్రస్తుతం ఇది మరింత పెరిగింది.

మరోవైపు ఆదాయం లోటు 2.4 శాతం నుంచి 3.27 శాతానికి చేరుకున్నది.  లాక్‌డౌన్‌ వల్ల కేంద్ర ప్రభుత్వ రాబడులకు గండి పడింది. రూ.19.31 లక్షల కోట్ల పన్ను వసూళ్లు లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రానికి రూ.17.5 లక్షల కోట్లు మాత్రమే లభించాయి. 

కీలక రంగాలు పాతాళంలోకి పడిపోయాయి. కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్‌ నెలలో 8 కీలక రంగాల వృద్ధి 38.1 శాతానికి పడిపోయింది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో వృద్ధి 5.2 శాతంగా నమోదైందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

మార్చి నెలలో కూడా మైనస్‌ 9 శాతంగా నమోదైంది. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, స్టీల్‌, సిమెంట్‌, విద్యుత్‌ రంగాలు రెండంకెల ప్రతికూల వృద్ధిని నమోదు చేసుకున్నాయి. అలాగే గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి 0.6 శాతం వృద్ధిని సాధించాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios