బీజింగ్/న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాపించకుండా అడ్డుకునేందుకు ప్రపంచ దేశాలన్నీ చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. వైరస్ వ్యాప్తినైతే అడ్డుకోగలుగుతున్నాయి. కానీ ఆర్థిక వ్యవస్థల్లో ఉన్న పళంగా వచ్చిన మార్పులకు విరుగుడు, పరిష్కార మార్గాలు కనుగొనలేకపోతున్నాయి. 

ప్రస్తుతం 2008 నాటి ఆర్థిక సంక్షోమం పరిస్థితులు కనిపిస్తున్నాయి. వాణిజ్య కార్యకలాపాలు అనూహ్యంగా తగ్గిపోతున్నాయి. ఆర్థికంగా బలంగా ఉన్న దేశాల్లో కార్యకలాపాలు నెమ్మదించాయి. ఉన్నట్టుండి ఆర్థిక కార్యకలాపాలు, రంగాల వారీగా మార్కెట్లు కుప్పకూలడం, అంతర్జాతీయంగా పలుదేశాల ఆర్థిక వ్యవస్థలు ఒక్కసారిగా ఒత్తిడికి గురవ్వడం వంటి నాటి మహా ఆర్థిక సంక్షోభం పరిస్థితులను గుర్తుకు తెస్తోంది. 

ఈ పరిస్థితులు నాడు 2008లో వర్ధమాన దేశాలు భారీ షాక్‌లను ఎదుర్కొన్నాయి. గ్రోత్ అందుకోవాల్సిన కీలక తరుణంలో వ్యాపార లావాదేవీలు నెమ్మదించడంపై ఆందోళన చెందుతున్నాయి. ఈ పరిస్థితులు మరెంత కాలం ఉంటాయోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

also read తెలంగాణకు గుడ్ న్యూస్... అమెజాన్ భారీ పెట్టుబడులు...

చైనాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాల సంఖ్య ‘సార్స్’ వైరస్ బాధితుల సంఖ్యను మించి పోయింది. తీవ్రమైన ఈ పరిస్థితుల నేపథ్యంలో డ్రాగన్ త్వరగా కోలుకుంటుందని అంచనా వేయొద్దని వాణిజ్య నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ల అభివ్రుద్ధి కోసం వేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి. 

చైనా సెంట్రల్ పీపుల్స్ బ్యాంకుతో కలిసి ప్రభుత్వ రంగ బ్యాంకులు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య లభ్యతను పెంచేందుకు ప్రయత్నించాయి. ఆర్థిక వ్యవస్థ త్వరితగతిన కోలుకునేందుకు అన్ని చర్యలు చేపట్టాయి. కీలకమైన వాణిజ్యం, డిమాండ్, సఫ్లయి దెబ్బతినడంతో చైనా ఎప్పుడు కోలుకుంటుందన్న విషయం సందేహస్పదంగానే మారింది. 

భారత్ నుంచి చైనాకు పత్తి ఎగుమతులపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఉత్తర భారతంలోని పంజాబ్, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాల్లో దాదాపు 77 శాతం ముడి పత్తి మార్కెట్లకు చేరింది. చైనాకు ఎగుమతి చేయడం విపత్కరంగా మారింది.

చైనాలో ఎమర్జెన్సీ అమలులో ఉన్నందున సెలవులు కొనసాగుతున్నాయి. దీంతో ఎగుమతులు వాయిదా పడుతున్నాయని భారత పారిశ్రామిక వర్గాలు వాపోతున్నాయి. చైనాకు పంపాల్సిన 2.5 లక్షల బేళ్ల పత్తి ఫిష్మెంట్లు వాయిదా పడ్డాయి. వ్యాపారులు చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. చైనాలో మార్కెట్లు మూత పడటంతో ఈ పరిస్థితులు అనివార్యం అయ్యాయి.

వైరస్ వ్యాప్తి చెందుతుందన్న ఆందోళనలతో చైనాలో ఫ్యాక్టరీలు మూతపడి పత్తికి ఉన్నట్టుండి డిమాండ్ పడిపోయింది. ప్రపంచంలో అత్యధికంగా పత్తి వినియోగిస్తున్న దేశాల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో పరిస్థితులు మెరుగు పడినా ఎగుమతులపై దీని ప్ఱభావం ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. 

కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించినా ఎగుమతులపై దీర్ఘ కాలంలో ప్రభావం ఉంటుందని వాణిజ్య సంస్థ ఇండియన్ కాటన్ అసోసియేషన్ లిమిటెడ్ అధ్యక్షుడు మహేష్ షర్దా ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ చివరికల్లా కనీసం చైనాకు ఐదు లక్షల పత్తి బేళ్లను ఎగుమతి చేశామని చెప్పారు. భారతీయ పత్తి పరిశ్రమకు చైనా నుంచి మంచి డిమాండ్ ఉందన్నారు. పాకిస్థాన్ లో ఉత్పత్తి తక్కువగా ఉండటం మనకు మంచి డిమాండ్ ఉన్నదని ఆయన వివరించారు. 

also read 400 పాయింట్లకు పైగా దూసుకుపోతున్న సెన్సెక్స్ ..లాభాల మధ్య నిఫ్టీ...

వాణిజ్యం, సరఫరా, డిమాండ్, ఎగుమతులు, దిగుమతుల రవాణా త్వరగా కోలుకునే అవకాశాలు లేవని వాణిజ్య నిపుణులు పేర్కొంటున్నారు. కొంతకాలం పాటు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందని తర్వాత పరిస్థితులు నెమ్మదిస్తాయంటున్నారు. అంతర్జాతీయ వాణిజ్యంలో చైనా కీలక భాగస్వామిగా ఉంది. 

కరోనా వైరస్ వల్ల చైనా తయారీ, సేవల, పర్యాటక రంగాలు తీవ్రంగా దెబ్బ తింటున్నాయి. దీంతో డిమాండ్, సరఫరా పతనమయ్యాయి. ఇటు చైనా, అటు ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం దెబ్బ తింటోంది. చైనా కేంద్రంగా పని చేస్తున్న పలు దిగ్గజ సంస్థలు కూడా తమ ఉత్పత్తిని నిలిపివేశాయి. 

వైరస్ వ్యాప్తి ఆందోళనలతో విమానయాన సేవలు, నౌకా సేవలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థలు పుంజుకోవాల్సిన సమయం లో ఈ పోకడలు ప్రతికూలంగా మారతాయని ఆందోళన చెందుతున్నాయి. చైనాలో కరోనా వైరస్ పరిణామాలు మరింత ప్రతికూలంగా మారతాయని చెబుతున్నారు.