ముంబై: దేశీయ, అంతర్జాతీయ స్టాక్‌ మార్కెట్లలో సీన్‌ రిపీటైంది. ఈ నెల తొమ్మిదో, 12వ తేదీల్లో  జరిగిన పరిణామమే సోమవారమూ జరిగింది. మాయదారి కరోనా మళ్లీ ముంచింది. మదుపరుల భయాల మధ్య దేశీయ ఈక్విటీ మార్కెట్లలో నష్టపుటేరులు పారాయి. 

కరోనా మహమ్మారి దెబ్బకు మరోసారి షేర్‌ బజార్‌.. బేజారైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ మరో దఫా ఆకస్మిక వడ్డీరేట్ల కోత కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను గాయపరిచింది. పైగా ఆసియా, ఐరోపా అంతర్జాతీయ మార్కెట్లన్నీ నష్టాల్లోనే కదలాడుతుండటం పరిస్థితుల్ని మరింతగా దిగజార్చింది.

దీంతో శుక్రవారం భీకర నష్టాల నుంచి తేరుకుని లాభాలను అందుకున్న సూచీలు.. సోమవారం తిరిగి అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. సోమవారం ఉదయం మొదలైన అర గంటలోనే సెన్సెక్స్‌ 1,851 పాయింట్లు, నిఫ్టీ 524.85 పాయింట్లు పడిపోయాయి. 

సమయం గడుస్తున్నకొద్దీ ఈ నష్టాలు మరింత పెరిగాయి. చివరకు బాంబే స్టాక్‌ ఎక్సేంజ్‌ (బీఎస్‌ఈ) సూచీ సెన్సెక్స్‌ 2,713.41 పాయింట్లు లేదా 7.96 శాతం పతనమై 31,390.07 వద్ద స్థిరపడగా, 30 నెలల కనిష్ఠాన్ని తాకింది. 

also read కరోనా వైరస్ వల్ల ఏ రంగానికి నష్టమో తెలుసా ?

నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) సూచీ నిఫ్టీ 757.80 పాయింట్లు లేదా 7.61 శాతం క్షీణించి 9,200 మార్కుకు దిగువన 9,197.40 వద్ద నిలిచి, మూడేళ్ల దిగువకు చేరింది. అంతేగాక భారత స్టాక్‌ మార్కెట్ల చరిత్రలోనే ఇది రెండో అతిపెద్ద పతనంగా నమోదైంది.

గత గురువారం సెన్సెక్స్‌ 2,919.26 పాయింట్లు, నిఫ్టీ 868.25 పాయింట్లు కోల్పోయిన సంగతి తెలిసిందే. మరుసటి రోజు శుక్రవారం కూడా తీవ్ర ఒడిదుడుకుల మధ్య ఓ దశలో సెన్సెక్స్‌ 3,213 పాయింట్లు, నిఫ్టీ 966 పాయింట్ల మేర నష్టపోయాయి. దీంతో 12 ఏళ్ల తర్వాత ట్రేడింగ్‌ను 45 నిమిషాలు నిలిపివేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 

ట్రేడింగ్ తిరిగి ఆరంభమైన తర్వాత సూచీలు కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ రెండు రోజుల సెలవుల తర్వాత తిరిగి సోమవారం మొదలైన మార్కెట్లు.. మళ్లీ నష్టాల పాటే పాడాయి. 

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వచ్చే నెల ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లను తగ్గించనుందన్న అంచనాలు మార్కెట్లలో వినిపించినప్పటికీ కరోనా భయాల మధ్య ఈ ఊహాగానాలు నిలబడలేకపోయాయి.

స్టాక్‌ మార్కెట్ల భీకర నష్టాల మధ్య మదుపరుల సంపద సోమవారం రూ.7.62 లక్షల కోట్లు కరిగిపోయింది. బీఎస్‌ఈలోని సంస్థల మార్కెట్‌ విలువ ఈ ఒక్కరోజే రూ.7,62,290.23 కోట్లు హరించుకుపోయి రూ.1,21,63, 952.59 కోట్లకు పడిపోయింది. మార్చి 9, 12 తేదీల్లో వాటిల్లిన నష్టాలతో కలిపితే ఈ మూడు రోజుల్లో మదుపరుల సంపద ఏకంగా రూ.25 లక్షల కోట్లకుపైగా ఆవిరైపోవడం గమనార్హం.

సెన్సెక్స్‌ 7,500 పాయింట్లు కోల్పోయింది మరి. మరోవైపు భారత అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీకి కరోనా దెబ్బ గట్టిగానే తగులుతున్నది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ మార్కెట్‌ విలువ మరో రూ.58,091.87 కోట్లు పడిపోయింది. 

బీఎస్‌ఈలో 8.28 శాతం నష్టపోయి రూ.1,015.25 వద్ద రిలయన్స్ షేర్‌ విలువ స్థిరపడింది. ఒకానొక దశలో 9.15 శాతం మేర దిగజారింది. ప్రస్తుతం సంస్థ మార్కెట్‌ విలువ రూ.6,43,594.13  కోట్లుగా ఉన్నది.

కరోనా వైరస్‌ దెబ్బ స్టాక్‌ మార్కెట్లను పట్టిపీడిస్తున్నది. ఈ వైరస్‌ సెగకు సోమవారం బీఎస్‌ఈలో లిైస్టెన అన్ని షేర్లు పతనాన్ని నమోదు చేసుకున్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ ఏకంగా 17.50 శాతం క్షీణించి టాప్‌ లూజర్‌గా నిలిచింది. 

టాటా స్టీల్‌ 11.02 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌ 10.38 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్‌ 9.96 శాతం, ఐటీసీ 9.28 శాతం, ఇన్ఫోసిస్‌ 9.24 శాతం, ఓఎన్‌జీసీ 8.73 శాతం, మహీంద్రా అండ్‌ మహీంద్రా 8.67 శాతం, హెచ్‌సీఎల్‌ టెక్‌ 8.48 శాతం, రిలయన్స్‌ 8.28 శాతం, ఎన్‌టీపీసీ 8.19 శాతం, ఎల్‌అండ్‌టీ 7.99 శాతం చొప్పున పతనం చెందాయి. 

వీటితోపాటు ఎస్బీఐ 7.84 శాతం, టెక్‌ మహీంద్రా 7.81 శాతం, బజాజ్‌ ఫైనాన్స్‌ 7.09 శాతం, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ 6.80 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 6.73 శాతం, టైటాన్‌ 6.73 శాతం, ఏషియన్‌ పెయింట్స్‌ 6.38 శాతం, మారుతి 6.04 శాతం, టీసీఎస్‌ 6.04 శాతం, భారతీ ఎయిర్‌టెల్‌ 5.98 శాతం, కొటక్‌ బ్యాంక్‌ 5.88 శాతం వరకు మార్కెట్‌ వాటాను కోల్పోయాయి. 

కరోనా ధాటికి ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు కుప్ప కూలుతున్నాయి. సోమవారం భీకర నష్టాలతో అమెరికా వాల్‌స్ట్రీట్‌ విరామం తీసుకున్నది. వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా ఎయిర్‌లైన్స్‌ నుంచి రెస్టారెంట్లదాకా మూసివేయడంతో మదుపరులు అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్నారు. 

also read యెస్ బ్యాంక్ ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్‌బి‌ఐ

ఫెడ్‌ రిజర్వ్‌ వడ్డీరేట్ల కోత కూడా మదుపర్లను భయపెట్టింది. ప్రధాన ఐరోపా మార్కెట్లు 8 శాతం వరకు పడిపోయాయి. ఇక ఆసియా మార్కెట్లూ భారీ నష్టాలకు లోనయ్యాయి. 

చైనా 3.40 శాతం, హాంకాంగ్‌ 4.03 శాతం, దక్షిణ కొరియా 3.19 శాతం, జపాన్‌ 2.46 శాతం నష్టపోయాయి. బ్రెంట్‌ క్రూడ్ ఆయిల్‌ ఫ్యూచర్‌ బ్యారెల్‌ ధర 7.53% క్షీణించి 31.30 డాలర్లకు పరిమితమైంది.

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల కోత కూడా సోమవారం స్టాక్‌ మార్కెట్ల ఉసురు తీసింది. దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్‌ ప్రభావం భారీగా కనిపిస్తుండటంతో అప్రమత్తమైన ఫెడ్‌ రిజర్వ్‌.. మరోసారి వడ్డీరేట్లను తగ్గించింది. 

కోతపెట్టి రెండు వారాలైన కాకముందే మళ్లీ వడ్డీరేట్లను తగ్గించడం.. అదికూడా దాదాపు శూన్య స్థాయికి తీసుకురావడం కరోనాతో వాటిల్లబోయే నష్టాలను మదుపరుల ముందుంచింది. 

ఆదివారం 0-0.25 శాతానికి ప్రామాణిక రుణ రేటును కుదిస్తూ ఫెడ్‌ నిర్ణయం తీసుకున్నది. 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం నాటి స్థాయికి వడ్డీరేట్లు వెళ్లిపోయాయి. ఈ పరిణామం అమెరికా ఆర్థిక పరిస్థితిని లియపరుస్తుండటంతో మదుపరులలో ఒక్కసారిగా ఆందోళనలు చెలరేగాయి.