Asianet News TeluguAsianet News Telugu

విలీనం ఏప్రిల్ 1నుంచే.. కరోనాతో బ్యాంకులకు మొండి బాకీల ముప్పు

ది ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) విలీన గడువు పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 

Mega bank consolidation on track; to take effect from April 1: FM Nirmala Sitharaman
Author
New Delhi, First Published Mar 27, 2020, 2:34 PM IST

న్యూఢిల్లీ: పది ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎ్‌సబీ) విలీన గడువు పొడిగించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇంతకుముందు ప్రకటించినట్లు వచ్చేనెల ఒకటో తేదీ నుంచే బ్యాంకుల విలీనం నిర్ణయం అమలులోకి వస్తుందని బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా ప్రకటించారు.

కరోనా వైరస్‌ మహమ్మారి నేపథ్యంలో ఈ గడువును మరింత పొడిగించాలన్న ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిని బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా తోసిపుచ్చారు. ‘విలీన ప్రక్రియ కసరత్తు కొనసాగుతోంది. కరోనా వైర్‌సతో కొన్ని సవాళ్లు ఉన్నా, వాటిని అధిగమిస్తాం’ అన్నారు. 

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఇదే విషయం స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని విలీనాల గడువును మరింత పొడిగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని అఖిల భారత బ్యాంకింగ్‌ అధికారుల సమాఖ్య (ఏఐబీఓసీ)  కోరింది. 

బ్యాంకు ఉద్యోగుల సంఘాల అభ్యర్థనల నేపథ్యంలో బ్యాంకింగ్‌ వ్యవహారాల శాఖ కార్యదర్శి దేబాశిష్‌ పాండా ఈ ప్రకటన చేయడం విశేషం. విలీనానికి సంబంధించిన అన్ని ప్రక్రియలు సమాంతరంగా సాగుతున్నాయ ని, ఈ అంశంలో ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తెలిపారు. 

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌, యునైటెడ్‌  బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విలీనం అవతుండగా కెనరా బ్యాంక్‌లో సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌లో అలహాబాద్‌ బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌లో ఆంధ్రా బ్యాంక్‌, కార్పొరేషన్‌ బ్యాంక్‌ విలీనమవుతున్న సంగతి తెలిసిందే. 

పది ప్రభుత్వ రంగ బ్యాంకులను నాలుగు బ్యాంకుల్లో విలీనం చేస్తూ ఈ నెల ప్రారంభంలో కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. దీనిపై మార్పేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. 

కరోనా వైరస్‌ ప్రభావంతో భారతీయ బ్యాంకులకు మరిన్ని కష్టాలు రావచ్చని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ ఫిచ్‌ హెచ్చరించింది. ఇప్పటికే మొండి బకాయిల సమస్య, మోసాలు-కుంభకోణాలతో వినియోగదారుల విశ్వాసాన్ని కోల్పోయిన దేశీయ బ్యాంకింగ్‌ రంగానికి కరోనా ఉధృతి కొత్త చిక్కుల్ని తెచ్చి పెడుతున్నదని ఫిచ్ అభిప్రాయపడింది.

also read:దటీజ్ ఆనంద్ మహీంద్రా.. అందుబాటులో చౌకగా వెంటిలేటర్!

గురువారం బ్యాంకులకు సంబంధించిన ఆపరేటింగ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్కోర్‌ను ‘బీబీప్లస్‌' నుంచి ‘బీబీ’ స్థాయికి ఫిచ్‌ కుదించింది. కరోనా కట్టడి కోసం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్‌డౌన్‌ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం, బ్యాంకింగ్‌ రంగానికి దానివల్ల కలిగే నష్టాలను బేరిజు వేసుకుని ఫిచ్‌ తమ రేటింగ్‌కు కోత పెట్టింది. 

లాక్‌డౌన్‌తో పారిశ్రామికోత్పత్తి, దేశీయ వినియోగ సామర్థ్యాలు కుంటుబడుతాయని ఫిచ్‌ పేర్కొన్నది. అంతిమంగా ఈ వ్యవస్థకు రుణాలిచ్చే బ్యాంకులే నష్టపోతాయన్నది. అయితే కరోనా వైరస్‌ ప్రభావం మిగతా ఆసియా దేశాల బ్యాంకులపై ఉన్నంతగా భారతీయ బ్యాంకులపై ఉండకపోవచ్చని అంచనా వేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios