న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రంగాలకు ఊతమిచ్చేందుకు మరిన్ని ఉద్దీపన చర్యలు చేపడతామని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ హామీ ఇచ్చారు. రాష్ట్రలకు చెల్లించాల్సిన జీఎస్టీ నష్టపరిహారం పెండింగ్‌లో ఉన్నదన్న విషయం కేంద్రానికి తెలుసన్నారు. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ ఏ దశలో ఉందనే విషయమై తాను మాట్లాడలేనని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. 

బకాయి చెల్లింపుల విషయమై రాష్ట్రలకు ఇచ్చిన మాటను కేంద్రం గౌరవిస్తుందని నిర్మలా సీతారామన్ అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులపై శుక్రవారం ఆమె సీనియర్‌ అధికారులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. వృద్ధిరేటుకు ఊతమిచ్చేందుకు అవసరమైతే ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని ఆమె చెప్పారు. 

‘ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుందని మీరు భావిస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా.. ‘అంచనాలతో కూడిన వ్యవహారాల జోలికి నేను వెళ్లదల్చుకోలేదు. ఆర్థిక వ్యవస్థను పరిశీలిస్తున్నా. అవసరమైనచోట జోక్యం చేసుకొంటున్నా. పారిశ్రామికరంగంలో సమస్యలు పెరిగినప్పుడు వాటిని పరిష్కరించేందుకు కృషిచేస్తున్నా’ అని నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 

also read  ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్

ఓవైపు దేశ ఆర్థికాభివృద్ధిరేటు గణనీయంగా క్షీణించడం, మరోవైపు ద్రవ్యోల్బణం పెరుగడం (స్టాగ్‌ఫ్లేషన్‌)పై ప్రతిస్పందించేందుకు నిర్మలా సీతారామన్ నిరాకరించారు. ‘స్టాగ్‌ఫ్లేషన్‌పై నేను వ్యాఖ్యానించదల్చుకోలేదు. ఈ వృత్తాంతం గురించి నేనూ విన్నాను’ అని ముక్తసరిగా చెప్పారు.

ప్రస్తుతం 5, 12, 18, 24 శాతంగా ఉన్న జీఎస్టీ రేట్లను పెంచడం ద్వారా రాష్ట్రలకు ఇవ్వాల్సిన జీఎస్టీ పరిహారాన్ని పూడ్చుకొనేందుకు కేంద్రం కసరత్తు చేస్తున్నట్టు వినిపిస్తున్న వదంతులపై నిర్మలా సీతారామన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ రేట్ల పెంపు విషయమై అసలు తాము చర్చించనేలేదని, ఈ వదంతులు తన కార్యాలయంలో తప్ప అన్నిచోట్లా వినిపిస్తున్నాయని తెలిపారు. 

అయితే జీఎస్టీ రేట్లను పెంచే ఆలోచన లేదని మాత్రం నిర్మలా సీతారామన్ చెప్పలేదు. ఉల్లి ధరల పెరుగుదలపై ప్రస్తుతం మంత్రుల గ్రూపు (జీవోఎం) ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నదని తెలిపారు. దిగుమతులతో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉల్లి ధరలు తగ్గాయని, కొత్త పంట మార్కెట్లోకి వస్తే వీటి ధరలు మరింత తగ్గుతాయని చెప్పారు.

దేశంలో మందగమన పరిస్థితులు నెలకొని ఉండడంతో పాటు.. ధరలు (ద్రవ్యోల్బణం) అంతకంతకు పెరుగుతున్న వేళ పలువురు ఆర్థికవేత్తలు ఎకానమీపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులను విశ్లేషించి చూస్తే దేశ ఆర్థిక వ్యవస్థ క్రమంగా ప్రమాదకరమైన ''స్టాగ్‌ఫ్లేషన్‌'' దశలోకి జారుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయని ఆర్థికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్థిక వ్యవస్థ పరిస్థితిని మెరుగుపరిచేందుకు మాత్రం తాము కృషి చేస్తున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు. గత ఆర్థిక సంవత్సర (2018-19) ప్రథమార్థంలో దేశంలోకి 31 బిలియన్‌ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రాగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రథమార్థంలో అవి 35 బిలియన్‌ డాలర్లకు పెరుగడమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనమని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు. 

విదేశీయులు తమ పెట్టుబడులకు భారత్‌ను ముఖ్యమైన గమ్యస్థానంగా పరిగణిస్తుండటం శుభసూచకమని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహా దారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచేందుకు అనుసరించనున్న మార్గం, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ప్రభుత్వం అందిస్తున్న చేయూత గురించి వివరించారు. 

దేశ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు వస్తు వినిమయం పెంపుదలపై దృష్టి సారించామని, ఆరేండ్ల కనిష్ఠ స్థాయికి దిగజారిన స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటును పట్టాలెక్కించేందుకు గత ఐదు నెలల్లో ప్రభుత్వం అనేక చర్యలను చేపట్టిందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు. 

కంపెనీల లాభాలను పెంచేందుకు కార్పొరేట్‌ పన్ను రేట్లను తగ్గించడం, ప్రభుత్వరంగ బ్యాంకులకు పెట్టుబడులు సమకూర్చడం, రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు రుణాలు అందజేయడం లాంటివి ఈ చర్యల్లో ఉన్నాయని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ అన్నారు.

రిటైల్‌ రుణవితరణలో తోడ్పాటునందించేందుకు బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలతోపాటు హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు రూ.4.47 లక్షల కోట్లు మంజూరు చేశామని, పాక్షిక రుణ హామీ (పార్షియల్‌ క్రెడిట్‌ గ్యారంటీ) పథకం కింద మొత్తం రూ.7,657 కోట్ల విలువైన ప్రతిపాదనలను ఆమోదించామని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు. 

బడ్జెట్‌లో ప్రకటించిన రూ.3.38 లక్షలకోట్ల పెట్టుబడుల వ్యయంలో ప్రభుత్వం ఇప్పటికే 66 శాతం నిధులను ఖర్చుచేసిందని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు. గత నెల 27వ తేదీ వరకు మొత్తం రూ.70 వేలకోట్ల విలువైన 8 లక్షలకుపైగా రెపో-లింక్డ్‌ రుణాలను మంజూరు చేశామని తెలిపారు. 

also read  డేంజర్ బెల్స్: ప్రమాదంలో పారిశ్రామికోత్పత్తి.. మూడేళ్ల గరిష్ఠానికి ద్రవ్యోల్బణం

ప్రభుత్వరంగ బ్యాంకులకు రూ.50,314 కోట్ల పెట్టుబడులు సమకూర్చామని, మార్కెట్లో ద్రవ్యలభ్యతను పెంచేందుకు ప్రభుత్వం గత రెండు నెలల్లో 32 సీపీఎస్‌ఈలకు 60 శాతానికిపైగా బకాయిలను తీర్చిందని, బ్యాంకులు.. కార్పొరేట్‌ సంస్థలకు రూ.2.2 లక్షలకోట్లు, మధ్య, చిన్నతరహా పరిశ్రమలకు రూ.72,985 కోట్ల మేరకు బ్యాంకులు రుణాలిచ్చాయని కృష్ణమూర్తి వివరించారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20)లోని తొలి ఎనిమిదిన్నర నెలల్లో ఆదాయం పన్ను చెల్లింపుదారులకు ఐటీ విభాగం రూ.1.57 లక్షలకోట్లు రిఫండ్‌ చేసిందని, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో చేసిన రిఫండ్‌ (రూ.1.23 లక్షలకోట్లు) కంటే ఇది రూ.34 వేలకోట్లు ఎక్కువని కేంద్ర రెవెన్యూ కార్యదర్శి అజయ్‌ భూషణ్‌ పాండే వెల్లడించారు.

పన్ను రిఫండ్లు సంఖ్యపరంగా 17 శాతం మేరకు పెరిగి 2.16 కోట్లకు చేరాయని, సొమ్ముపరంగా చూస్తే ఇది 27.2 శాతం ఎక్కువని కేంద్ర ప్రధాన ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్‌ తెలిపారు.ఇంటిగ్రేటెడ్‌ జీఎస్టీ రిఫండ్‌ కింద గత ఆర్థిక సంవత్సరం మొత్తంమీద రూ.56,057 కోట్లు చెల్లించగా.. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.38,988 కోట్లు విడుదల చేసినట్టు ఆయన చెప్పారు.