న్యూఢిల్లీ: దేశీయ పారిశ్రామికోత్పత్తి (ఐఐపీ) ప్రమాదంలో పడింది. ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న తీవ్ర మందగమన పరిస్థితులు నెలకొన్నాయని సంకేతాలిస్తూ ఐఐపీ వరుసగా మూడో నెలా ప్రతికూల గణాంకాలను నమోదు చేసింది. ఆగస్టులో -1.4 శాతంగా ఉన్న ఐఐపీ గణాంకాలు సెప్టెంబర్‌లో -4.3 శాతానికి దిగజారాయి.

అక్టోబర్ ఐఐపీ -3.8.. విద్యుత్, గనులు, తయారీని వీడని నిస్తేజం
తాజాగా అక్టోబర్‌లోనూ -3.8 శాతంగా ఉన్నట్లు జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) తెలియజేసింది. తయారీ రంగం, గనులు, విద్యుదుత్పత్తి రంగాలను ఇంకా నిస్తేజం వీడలేదని ఎన్‌ఎస్‌వో విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 

2018 అక్టోబర్ నెలలో 8.4 శాతం గ్రోత్
నిరుడు అక్టోబర్‌లో 8.4 శాతం వృద్ధిని అందుకున్న ఐఐపీ.. ఈ ఏడాది జూలైలో 4.9 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఆ తర్వాత ఐఐపీ ఒక్కసారిగా మైనస్‌లోకి పడిపోయింది. ఇక ఈ ఏప్రిల్-అక్టోబర్ మధ్య ఐఐపీ వృద్ధి దాదాపు 0.5 శాతంతో అలాగే ఉన్నది. గతేడాది ఇదే సమయంలో మాత్రం 5.7 శాతం పురోగతి కనిపించింది.

also read ఫోర్బ్స్ అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో నిర్మలా సీతారామన్

నిరాశాజనకంగా తయారీ రంగం
ఐఐపీలో కీలకమైన తయారీ రంగం పరిస్థితి నిరాశాజనకంగా ఉన్నది. దీంతో ఈ అక్టోబర్‌లో -2.1 శాతానికి పరిమితమైంది. గతేడాది అక్టోబర్‌లో 8.2 శాతం వృద్ధితో కాసింత మెప్పించింది. గనుల రంగంలో -8 శాతానికి ఉత్పాదక రేటు దిగజారింది. నిరుడు 7.3 శాతం వృద్ధిని చూపగా, సెప్టెంబర్‌లో -8.5 శాతంగా ఉండటం గమనార్హం.

భారీగా పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి
విద్యుదుత్పత్తి ఏకంగా -12.2 శాతానికి క్షీణించింది. నిరుడు అక్టోబర్‌లో 10.8 శాతం పెరిగినట్లు ఎన్‌ఎస్‌వో పేర్కొన్నది. మరోవైపు క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తి 21.9 శాతం క్షీణించింది. నిరుడు 16.9 శాతం వృద్ధిరేటును అందుకోవడం విశేషం. కన్జ్యూమర్ డ్యూరబుల్స్ -18 శాతం, కన్జ్యూమర్ నాన్-డ్యూరబుల్స్ -1.1 శాతం పనితీరును కనబరిచాయి. 

18 విభాగాల్లో నెగెటివ్ గ్రోథ్ రికార్డు
ప్రైమరీ గూడ్స్ -6 శాతం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్/కన్‌స్ట్రక్షన్ గూడ్స్‌లో -9.2 శాతం పని తీరు కనిపిస్తుండగా, ఇంటర్మీడియెట్ గూడ్స్‌లో 22.2 శాతం వృద్ధి నమోదైంది. మొత్తం 23 పరిశ్రమ విభాగాల్లో 18 ప్రతికూల వృద్ధిని ప్రదర్శిస్తున్నాయి. 

కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తిలోనూ ప్రతికూలమేకంప్యూటర్, ఎలక్ట్రానిక్, ఆప్టికల్ ఉత్పత్తుల తయారీ రంగంలో అత్యధికంగా -31.3 శాతం ప్రతికూల వృద్ధి కనిపిస్తున్నది. ఆ తర్వాత వాహనాలు, ట్రైలర్లు, సెమీ-ట్రైలర్ల తయారీ రంగంలో -27.9 శాతం ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రసాయనాలు, దాని అనుబంధ ఉత్పత్తుల తయారీ రంగం అత్యధికంగా 31.8 శాతం వృద్ధిని చూపిస్తున్నది. బేసిక్ మెటల్స్‌లోనూ 9.4 శాతం వృద్ధి కనిపిస్తున్నట్లు ఎన్‌ఎస్‌వో తెలిపింది. 

రుణాత్మకం అంటేనే ఆర్థిక మాంద్యం అంటున్న విశ్లేషకులు
ఐఐపీ వరుసగా మూడో నెల రుణాత్మక గణాంకాలకే పరిమితం కావడం ఆర్థిక మాంద్యానికి నిదర్శనమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ద్రవ్యోల్బణం పెరుగుతుండటం, మార్కెట్‌లో వినిమయ సామర్థ్యం పతనం కావడం ఆర్థిక వ్యవస్థను మాంద్యంలోకి నెడుతున్నాయని విశ్లేషిస్తున్నారు. డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ క్షీణత, అంతర్జాతీయ మార్కెట్‌లో స్తబ్ధత కారణంగా పడిపోతున్న దేశీయ ఎగుమతులు కూడా మాంద్యానికి దారితీస్తున్నాయని అంటున్నారు.

భగ్గుమన్న ఆహారపదార్థాల ధరలు
కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన ఆహార పదార్థాలు మళ్లీ భగ్గుమన్నాయి. కూరగాయలు, పప్పు దినుసులు, ప్రొటీన్‌ ఆధారిత ఉత్పత్తులు మరింత ప్రియం కావడంతో గత నెలకు రిటైల్‌ ద్రవ్యోల్బణ సూచీ ఏకంగా మూడేండ్ల గరిష్ఠ స్థాయి 5.54 శాతానికి ఎగబాకింది. 

also read రిసెషన్ ఎఫెక్ట్ : కుదుపుల మధ్య డైమండ్స్, జెమ్స్ జ్యువెలరీ ఇండస్ట్రీ

2016 జూలైలో నమోదైన 6.07 శాతం తర్వాత ఇదే గరిష్ఠ స్థాయి కావడం విశేషం. అక్టోబర్‌లో 4.62 శాతంగా నమోదైన ధరల సూచీ, ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన 2.33 శాతంతో పోలిస్తే ఇంచుమించు రెండు రెట్లు కంటే అధికంగా పెరిగింది. 

ఆహార పదార్థాల ధరల సూచీ ఏకంగా 10.01 శాతానికి ఎగబాకింది. అక్టోబర్‌లో 7.89 శాతంగా ఉండగా, క్రితం ఏడాది -2.61 శాతంగా నమోదైంది. అక్టోబర్‌లో 26.10 శాతంగా ఉన్న కూరగాయాల ధరల సూచీ గత నెలకుగాను ఏకంగా 35.99 శాతానికి ఎగబాకింది. 

కోడిగుడ్లు, మాంసం.. చేపల ధరలు కూడా పైపైకే..
చిరుధాన్యాలు, కోడిగుడ్ల ధరలు 3.71 శాతం చొప్పున అధికమయ్యాయి. వీటితోపాటు మాంసం, చేపల ధరలు కూడా 9.38 శాతం చొప్పున అధికమైంది. అదే కోడిగుడ్ల ధరల సూచీ 6.2 శాతంగా నమోదైంది. పప్పు దినుసులు, ఇందుకు సంబంధించిన ఇతర ఉత్పత్తుల సూచీ 13.94 శాతానికి చేరుకున్నది. కానీ, ఇదే సమయంలో చమురు, లైట్‌ విభాగ ధరల సూచీ మాత్రం 1.93 శాతానికి తగ్గడం విశేషం. 

నూతన సంవత్సరంలో ఆహార ధాన్యాల ధరలు కాస్ట్‌లీయే
రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరుగుతున్నదన్న అంచనాతోనే రిజర్వు బ్యాంక్‌ గత పరపతి సమీక్షలో వడ్డీరేట్లను యథాతథంగా ఉంచినది తెలిసిందే. మరోవైపు నూతన సంవత్సరం తొలినాళ్లలో ఆహారానికి సంబంధించిన ఉత్పత్తులు మరింత ప్రియమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇక్రా ప్రిన్సిపల్‌ ఆర్థికవేత్త అదితి నాయర్‌ తెలిపారు. ప్రస్తుత నెలలో ద్రవ్యోల్బణం 5.8 శాతం నుంచి 6 శాతం మధ్యలో నమోదవనున్నదని ఐక్రా అంచనావేస్తున్నది.