న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థ మీద కరోనా ప్రభా వంపై అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మరోసారి ఆందోళన వ్యక్తం చేసింది. ఉద్దీపన ప్యాకేజీ పేరుతో నరేంద్ర మోదీ సర్కార్‌ ప్రకటించిన రూ.21 లక్షల కోట్ల భారీ ప్యాకేజీపై ఐఎంఎఫ్‌ ప్రధాన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేశారు.

మోదీ సర్కార్ ప్రకటించిన ప్యాకేజీలో పేర్కొన్న నిధుల్లో, బడ్జెట్‌ ద్వారా ప్రభుత్వం చేసే ఖర్చు (ఆన్‌ బడ్జెట్‌) చాలా తక్కువని గీతా గోపీనాథ్‌ వ్యాఖ్యానించారు. ఈ ప్యాకేజీ జీడీపీలో 6.4 శాతం అని ప్రభుత్వం చెబుతున్నా అందులో 1.5 శాతం మాత్రమే బడ్జెట్‌ ద్వారా చేసే ఖర్చు అని అన్నారు. 

మిగలినదంతా బ్యాంకులు, ఎన్బీఎఫ్సీలు, గృహ ఫైనాన్స్‌ కంపెనీలకు (హెచ్‌ఎఫ్‌సీ) నిధుల సరఫరా పెంచే ద్రవ్యేతర చర్యలని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపీనాథ్‌ పేర్కొన్నారు. కరోనాతో తీవ్రంగా దెబ్బతిన్న నిరుపేదలు, చిన్న,మధ్య తరహా కంపెనీల (ఎంఎస్‌ఎంఈ)ను ఆదుకునేందుకు బడ్జెట్‌ కేటాయింపుల ద్వారా చేసే ఖర్చులు మరింతగా పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. 

also read అప్పటివరకు ఇంతే.. చైనా గూడ్స్‌ నిషేధంపై ప్రముఖుల అంచనా.. ...

అలా ఖర్చు చేసే ఆర్థిక స్థోమత భారత్‌కు ఉందని గీతా గోపీనాథ్‌ తెలిపారు. నిరుపేదలకు నేరుగా నగదు బదిలీ చేయాలన్న డిమాండ్‌ను ఆమె సమర్ధించారు. దీంతో వారి కనీస అవసరాల కొనుగోలు శక్తి పెరిగి, పడిపోయిన డిమాండ్‌ కొద్దిగానైనా కోలుకుంటుందన్నారు. ఆర్థిక వ్యవస్థపైనా ఈ ప్రభావం బహుముఖంగా ఉంటుందని చెప్పారు.

కరోనా మహమ్మారి కల్పించిన ప్రస్తుత సంక్షోభ సమయంలో పేదల్ని ఆదుకునేందుకు నగదు బదిలీ కంటే మంచి మార్గం లేదని ఐఎంఎఫ్ ప్రధాన ఆర్థిక వేత్త గీతా గోపీనాథ్‌ స్పష్టం చేశారు. లేకపోతే డిమాండ్‌ మరింత పడిపోయే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.

కరోనా మహమ్మారి ఇంకా అదుపులోకి రాకపోవడం, దిగజారిన ఆర్థిక పరిస్థితుల వల్లే భారత సార్వభౌమ పరపతి రేటింగ్‌ను కుదించాల్సి వచ్చిందని గోపీనాథ్‌ చెప్పారు.