నిన్నమొన్నటి వరకు ప్రయాణికులను ఆకర్షించేందుకు పోటాపోటీగా ఆఫర్లు ప్రకటిస్తూ వచ్చిన దేశీయ విమానయాన సంస్థలు.. రానున్న పండగల సీజన్‌లో టికెట్ల ధరలను భారీగా పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. విమాన ఇంధన (ఎటిఎఫ్‌) ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉండటంతోపాటు దీనిపై ఐదు శాతం కస్టమ్స్‌ సుంకాలను విధించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. విమానయాన కంపెనీల్లో దడ పుట్టిస్తోంది. దీంతో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు టికెట్‌ ధరల పెంపు ఒక్కటే పరిష్కారమని విమానయాన సంస్థలు భావిస్తున్నాయి.
 
దేశీయ విమానయాన కంపెనీల్లో గత కొన్ని నెలలుగా నిర్వహణ వ్యయం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. చైనా, అమెరికా మధ్య వాణిజ్య యుద్ధానికి తోడు డాలర్ బలోపేతం.. తదనుగుణంగా రూపాయి పతనం, ఎటిఎఫ్‌ ధరల దూకుడు విమానయాన కంపెనీలకు చుక్కలు చూపుతున్నాయి.

విమానయాన రంగంలో పోటీ పెరిగిపోవటంతో ప్రయాణికులను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా డిస్కౌంట్‌ ఆఫర్లను ప్రకటిస్తూ రావటంతో భారం మరింత తడిసిమోపడయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇదే సమయంలో ప్రభుత్వ రంగంలోని ఎయిర్‌ ఇండియా, ప్రైవేట్‌ విమానయాన సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారిపోవటంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. 

దీనికి తోడు మరికొన్ని విమానయాన సంస్థలు జెట్ ఎయిర్ వేస్ బాటలోకి పయనించే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే త్వరలో రానున్న పండగల సీజన్‌లో టికెట్‌ ధరలను పెంచటం ద్వారా కొద్దిగా గాడిలో పడాలని విమానయాన సంస్థలు భావిస్తున్నాయని పరిశ్రమ నిపుణులంటున్నారు.
 
దేశీయంగా విమానయాన రంగానికి సరిపఃడా ఇంధన నిల్వలు ఉన్నాయని, అయితే వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఏటీఎఫ్‌పై విధిస్తున్న పన్నులు ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు చుక్కలు చూపిస్తున్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం విమాన ఇంధన ధరలు నాలుగేళ్ల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.

ఇదే సమయంలో విమాన సంస్థలు జెట్‌ ఫ్యూయల్‌ను నేరుగా దిగుమతి చేసుకునే వెసులుబాటు లేకపోవటం కూడా దెబ్బతీస్తోందని అంటున్నారు. అయితే భారత్‌లో విమాన ఇంధనంలో మిగులు ఉండటమే కాక ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌, ఎంఆర్‌పిఎల్‌ ఎగుమతి కూడా చేస్తున్నాయి.
 
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో ఎటిఎఫ్‌ ధరలు కూడా పెరుగుతూ వస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం ఏటీఎఫ్‌పై 5 శాతం కస్టమ్స్‌ సుంకాలను విధించాలని నిర్ణయం తీసుకోవటం విమాన కంపెనీలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. అలా సుంకం పెంచితే విమానయాన కంపెనీలపై నెలకు అదనంగా రూ.25 కోట్ల వరకు భారం పడుతుందన్నారు. ధరలను పెంచడంతోనే ఈ భారాన్ని తప్పించుకోవచ్చునని అంటున్నారు. 
 
ఇంధన ధరల పెరుగుదల దేశీయ విమాన కంపెనీలను దెబ్బ తీస్తున్నా, విదేశీ విమాన సంస్థలకు మాత్రం లబ్ధి చేకూర్చే అవకాశాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా దేశం నుంచి విదేశాలకు ప్రయాణిస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, ఈ సమయంలో ధరలను పెంచుకుంటే వెళితే పరిస్థితి దారుణంగా మారనుందని స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ అంటున్నారు. 

దేశీయ సంస్థలతో పోల్చితే విదేశీ సంస్థలు తక్కువ ధరలకే టికెట్లను ఆఫర్‌ చేయటం ద్వారా వాటాను పెంచుకునే అవకాశం లభిస్తుంది. ఇదే జరిగితే దేశీయ విమానయాన సంస్థలు కోలుకోవటానికి చాలా సమయం పడుతుందని స్పైస్‌జెట్‌ చైర్మన్‌ అజయ్‌ సింగ్‌ వ్యాఖ్యానించారు.