Asianet News TeluguAsianet News Telugu

చేతులెత్తేసిన బీఎస్ఎన్ఎల్: 1.76 లక్షల మందికి జూన్ వేతనాలివ్వలేం


ప్రభుత్వ రంగ సంస్థ ‘బీఎస్ఎన్ఎల్’ను దెబ్బ తీసేందుకు వ్యూహాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయా? అన్న సందేహాలు ఉన్నాయి. 2016-17లో రూ.1,684 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించిన బీఎస్ఎన్ఎల్ హఠాత్తుగా వేల కోట్ల నిర్వహణ నష్టాల్లో కూరుకుపోవడమే ఒకింత ఆశ్చర్యంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా ప్రభుత్వం ఆదుకోకుంటే జూన్ నెల సిబ్బందికి వేతనాలు చెల్లించలేమని బీఎస్ఎన్ఎల్ చేతులెత్తేసింది. 

BSNL begs again, says no funds to pay June salary to 1.76 lakh employees
Author
New Delhi, First Published Jun 25, 2019, 10:17 AM IST

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మరోసారి ఉద్యోగులకు షాక్‌ ఇచ్చింది. ఆర్థిక సంక్షోభం వల్ల జీతాలు చెల్లించలేమంటూ మరోసారి చేతులెత్తేసింది.  మూడు దశాబ్దాల క్రితం వరకు ఇంటింటికి ఫోన్ సౌకర్యం కల్పించి ప్రస్తుతం నష్టాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ రంగ సంస్థల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఒకటి. 

కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తమకు ద్రవ్యసహాయం చేయకుంటే సిబ్బంది జూన్‌ నెల జీతాల చెల్లింపు కష్టమేనంటోంది. చెల్లించాల్సిన బాకీలు సుమారు రూ.13 వేల కోట్ల ఉన్నాయని, ఈ క్రమంలో సిబ్బంది జీతాల కోసం దాదాపు 850 కోట్ల సేకరణ అసాధ్యం అంటున్నారు ఆ శాఖ అధికారులు. 

తమకువచ్చే ఆదాయానికి, ఖర్చులకు మధ్య అంతరం చాలా ఉందని ప్రభుత్వం ఆదుకోకుంటే ఇంకా దీనిని నడపడం కష్టమేనంటున్నారు సదరు సంస్థ బడ్జెట్‌, బ్యాంకింగ్‌ డివిజన్‌ సీనియర్‌ మేనేజర్‌ పూరన్‌చంద్ర. ఉన్న సమస్యలన్నీ ఏకరవు పెడుతూ టెలికం శాఖకు లేఖను కూడా పంపినట్లు తెలిపారు. ఇక ప్రభుత్వం తీసుకోబోయే సంస్కరణ చర్యలపైనే బీఎస్‌ఎన్‌ఎల్‌ భవితవ్యం ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.

ఇప్పటికే బీఎస్ఎన్ఎల్ రూ. 90 వేల కోట్ల నిర్వహణా నష్టంతో కొనసాగుతుంది. నిర్వహణా లోపం, ఉద్యోగులకు ఇచ్చే అధిక వేతనాలు, అనవసర విషయాలలో ప్రభుత్వ అధికారుల జోక్యం, టెలికాం రంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా ప్రణాళికలు లేకపోవటం వెరసి నష్టాల్లో కూరుకున్నది. 

ఈ సంస్థ ఆర్థిక సంవత్సరం 2018 కి సంబంధించి తన ఆదాయంలో 21 శాతాన్ని ఉద్యోగుల జీతాలు, ప్రయోజనాలకు ఖర్చు చేయగా.. ప్రైవేటు సంస్థ ఎయిర్‌టెల్‌ తన ఆదాయంలో కేవలం 3 శాతమే ఖర్చు చేసింది.  దేశంలో ఉన్న ఫోన్‌ వినియోగదారుల్లో కేవలం 10 శాతం మాత్రమే బీఎస్ఎన్ఎల్ చందాదారులుగా ఉన్నారు.

మిగతా వారంతా ప్రైవేట్ టెలికాం వినియోగదారులే. ప్రధాని మోదీ అధ్యక్షతన దీనిపై ఒక సమీక్షా సమావేశం జరిగినా కచ్చితమైన పరిష్కార మార్గాలు మాత్రం చూపలేదు. మొబైల్‌ నెట్‌వర్కింగ్‌ పరిధి 5G కి అప్‌గ్రేడ్‌ అవుతున్న ఈ తరుణంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఇలాగే కొనసాగితే దాని మనుగడ కష్టమే అని టాటా సంస్థ అనుబంధ సంస్థ వీఎస్‌ఎన్‌ఎల్‌ మాజీ ఛైర్మన్‌ బి.కె సింఘాల్‌ అంటున్నారు.

వేల కోట్లు బకాయిలతో బాధపడుతున్న టెలికాం సంస్థ ఇటీవల సిబ్బందికి జీతాలు చెల్లించలేని పరిస్థితుల్లో చిక్కుకుంది. ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికం సంస్థ  తన చరిత్రలో తొలిసారిగా సుమారు 1.76 లక్షల మంది ఉద్యోగులకు ఫిబ్రవరి వేతనాలను చెల్లించలేకపోయింది. భారీ నష్టాలను నమోదు చేస్తున్న ప్రభుత్వరంగ సంస్థల్లో టాప్‌లో ఉన్న బీఎస్ఎన్ఎల్‌ రూ.13,000 కోట్ల రుణ సంక్షోభంలో  పడి పోయింది. డిసెంబర్ 2018 నాటికి నిర్వహణ నష్టాలు రూ.90,000 కోట్లకు పైగా  మాటేనని సమాచారం. 

ఇదిలా ఉంటే ప్రభుత్వరంగంలోని బీఎస్ఎన్‌ఎల్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆ సంస్థ ఇంజనీర్స్‌, అకౌంటెంట్‌ ప్రొఫెషనల్స్‌తో కూడిన అసోసియేషన్‌ కోరింది. సంస్థకు తక్కువ స్థాయిలో అప్పులు ఉన్నాయని, మార్కెట్‌ వాటా కూడా క్రమంగా పెరుగుతోందని తెలిపింది. 

నగదు కొరతతో సంస్థ కార్యకలాపాలు, సర్వీసుల నిర్వహణపై ప్రతికూల ప్రభావం పడుతోందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని బీఎ్‌సఎన్‌ఎల్‌కు బడ్జెట్‌ పరంగా మద్దతు ఇవ్వాలని అఖిల భారత గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్స్‌ అండ్‌ టెలికాం ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐజీఈటీఓఏ) ఈ నెల 18న ప్రధానికి లేఖ రాసింది. ఇందులో సంస్థ పరిస్థితులను వివరించింది. 

‘ప్రభుత్వం నుంచి కనీస ఆర్థిక మద్దతు లభిస్తే ప్రస్తుతమున్న నగదు కొరత సమస్య తీరుతుందన్న విశ్వాసం ఉంది. దీని వల్ల బీఎ్‌సఎన్‌ఎల్‌ మళ్లీ లాభాలు ఆర్జించే కంపెనీగా మారుతుంది’ అని అఖిల భారత గ్రాడ్యుయేట్‌ ఇంజనీర్స్‌ అండ్‌ టెలికాం ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ (ఏఐజీఈటీఓఏ) లేఖలో పేర్కొన్నారు. 

బీఎస్ఎన్‌ఎల్‌ ఉద్యోగులకు పనితీరు ఆధారిత విధానాన్ని అమలు చేయాలని, దీని వల్ల మంచి పనితీరు కనబరిచే వారికి ప్రతిఫలం అందడానికి అవకాశం ఉంటుందని, పనితీరు సరిగ్గా లేని వారి జవాబుదారీ తనం పెరుగుతుందని అసోసియేషన్‌ తెలిపింది. ప్రైవేటు రంగంలోని టెలికాం సంస్థల నుంచి పోటీ ఎదురుకావడం వల్ల బీఎస్ఎన్ఎల్‌తోపాటు ఎంటీఎన్‌ఎల్‌కు చాలా కాలం పాటు నష్టాలు వచ్చాయి. 

ఎంటీఎన్‌ఎల్‌ ఢిల్లీ, ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తుంటే..బీఎస్ఎన్ఎల్ 20 టెలికాం సర్కిళ్లలో సేవలు అందిస్తోంది. ఎంటీఎన్‌ఎల్‌ నష్టాలబాటలోనే సాగుతూ పునరుజ్జీవానికి ఎలాంటి సంకేతాలు చూప డం లేదు. కానీ బీఎస్ఎన్ఎల్ 2014-15లో రూ.672 కోట్లు, 2015-16లో రూ.3,885 కోట్లు, 2016-17లో రూ.1,684 కోట్ల నిర్వహణ లాభాన్ని ప్రకటించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios