Asianet News TeluguAsianet News Telugu

నిను వీడని నీడ: టాటా మోటార్స్‌ను వెంటాడుతున్న జాగ్వార్ నష్టాలు

  • చైనా, భారతదేశాల్లో విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో జూన్ నెలతో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ నష్టం రూ.3,679 కోట్లకు చేరుకున్నది.
  • ఒకనాడు టాటా మోటార్స్‌ను కాపాడిన దాని అనుబంధ జాగ్వార్ అండ్ లాండ్ రోవర్ నష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. 
Tata Motors posts Q1 net loss of Rs 3,679 cr on lower sales in China, India
Author
New Delhi, First Published Jul 26, 2019, 10:24 AM IST

న్యూఢిల్లీ: దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటర్స్ నష్టాలపరంపర కొనసాగుతోది. జూన్ నెలతో ముగిసిన తొలి త్రైమాసికంలో సంస్థ రూ.3,679.66 కోట్ల నష్టం చవిచూసింది. భారతదేశంతోపాటు చైనా అమ్మకాలు అంతకంతకు పడిపోవడం లాభాలపై ప్రతికూల ప్రభావం చూపింది.

2018తో పోలిస్తే ఈ ఏడాది ఇదే సమయంలో నమోదైన రూ.1,862.57 కోట్ల నష్టంతో పోలిస్తే రెండింతలు అధికమైంది. గత త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా రూ.66,701.05 కోట్ల నుంచి రూ.61,466.99 కోట్లకు పడిపోయిందని సంస్థ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో పేర్కొంది.

ఏప్రిల్ నుంచి జూన్ చివరినాటికి కంపెనీ 1,36,705 యూనిట్ల వాహనాలను విక్రయించింది. చివరి ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో అమ్మిన వాహనాలతో పోలిస్తే 22.7 శాతం తగ్గాయి. 

బ్రిటన్‌కు చెందిన విలాసవంతమైన కార్ల సంస్థ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్‌ఆర్) నష్టాలు టాటా మోటార్స్ సంస్థపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపాయి. గత త్రైమాసికంలోనూ జేఎల్‌ఆర్ 395 మిలియన్ పౌండ్ల నష్టం వచ్చినట్లు ప్రకటించింది.

క్రితం ఏడాది ఇదే సమయంలో నమోదైన 264 మిలియన్ పౌండ్ల నష్టంతో పోలిస్తే ఇది 50 శాతం అధికం. ప్రపంచవ్యాప్తంగా జేఎల్‌ఆర్ అమ్మకాలు 11.6 శాతం పడిపోయి 1,28,615 యూనిట్లకు జారుకున్నాయి. 

ఈ సందర్భంగా టాటా మోటర్స్ సీఈవో, ఎండీ గ్యుంటేర్ బుచెక్ మాట్లాడుతూ కస్టమర్లల్లో నెలకొన్న బలహీన సెంటిమెంట్ కారణంగా ఆటోమొబైల్ మార్కెట్ మందగమన స్థితిలో కొనసాగుతున్నదని, నిధుల లభ్యత తగ్గుముఖం పట్టడం ప్రతికూల ప్రభావం చూపాయన్నారు. 

గత కొన్నేళ్లుగా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్న సంస్థ వీటి నుంచి గట్టెక్కామని టాటా మోటార్స్ సీఈఓ గ్యుంటేర్ బుచెక్ చెప్పారు. ఎన్‌బీఎఫ్‌సీల ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో తీసుకున్న కీలక నిర్ణయాలతో వచ్చే పండుగ సీజన్ నుంచి తిరిగి కొలుకునే అవకాశాలున్నాయని చెప్పారు. 

మార్కెటింగ్ కోసం అధికంగా నిధులు వెచ్చించడం, అమ్మకాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో వీటిని పెంచుకోవడానికి రాయితీలు ఇవ్వడం కూడా లాభాలపై ప్రభావం చూపాయని టాటా గ్రూపు సీఎఫ్‌వో బాలాజీ తెలిపారు.

టాటా మోటర్స్ రేటింగ్‌ను బీబీ నుంచి బీబీ-కి తగ్గిస్తున్నట్లు రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ ప్రకటించడంతో కంపెనీ షేరు భారీగా పడిపోయింది. నష్టాల్లో ప్రారంభమై ఏ దశలోనూ కోలుకోలేదు.

ఒక దశలో 5 శాతం వరకు నష్టపోయిన షేర్ ధర.. చివరకు 4.56% నష్టంతో రూ.144.35 వద్ద ముగిసింది. నిఫ్టీలోనూ 4.79% కోల్పోయి రూ.144 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌లో 20.65 లక్షల షేర్లు, నిఫ్టీలో 3 కోట్ల షేర్లు చేతులు మారాయి.

Follow Us:
Download App:
  • android
  • ios