న్యూఢిల్లీ: వచ్చే కొన్నేళ్లు టాటా మోటార్స్‌కు చాలా కీలకమని ఆ సంస్థ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. సంస్థ ట్రాన్స్ ఫర్మేషన్ (పరివర్తన)కిది సరైన సమయం అని తెలిపారు. భవిష్యత్‌ వాహన ప్రపంచం కోసం భాగస్వామ్యాలను ఏర్పాటు చేసుకోవడం; కొత్త పరిష్కారాలను అభివృద్ధి చేసుకుని పెట్టుబడులను క్రమబద్ధీకరించడం వంటి పనులు చేయాల్సి ఉందని టాటా మోటార్స్ కంపెనీ వార్షిక నివేదిక (2018-19)లో పేర్కొన్నారు. 

దేశ ప్రజలు విద్యుత్‌ వాహనాల(ఈవీ)కు మారాల్సిన ప్రతిపాదనను అమలు చేసే విషయమై కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్ పరిశ్రమ కలిసి ప్రణాళికలను రచించి ఒక బలమైన వ్యవస్థ అభివృద్ధి చేయాలని అన్నారు. అపుడే గిరాకీ పెరిగి, అనుకున్న లక్ష్యాలను అందుకోగలమని తెలిపారు. 

గత ఏడాది కాలంగా తమ జాగ్వార్‌ లాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) సవాళ్లను ఎదుర్కొంటోందని చంద్రశేఖరన్ తెలిపారు. అందులో వ్యయాలను తగ్గించుకునే చర్యలు చేపట్టామని తెలిపారు.

ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియో పెంచడానికి పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉంటూ, భాగస్వామ్యాల వైపు చూస్తున్నామన్నారు. వచ్చే కొన్నేళ్ల పాటు బలమైన కార్యకలాపాల సామర్థ్యంతో సరైన పెట్టుబడులతో భవిష్యత్‌ కోసం సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. 

విద్యుత్‌ వాహనాల విషయంలో ఇతర కంపెనీలతో కలిసి ముందు ఉండి నడుస్తామని.. ఈవీలు భారత్‌కు ఇది అత్యంత అవసరమని గట్టిగా విశ్వసిస్తున్నట్లు టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ స్పష్టం చేశారు. టాటా మోటార్స్‌లో దేశీయంగా  2017 జూలైలో ప్రారంభించిన పునరుద్ధరణ ప్రణాళికలో భాగంగా పలు చర్యలు చేపట్టాం అని చెప్పారు. ఆ చర్యలు కంపెనీ కార్యకలాపాల, ఆర్థిక పనితీరులో స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను’అని పేర్కొన్నారు.

‘ద్రవ్యకొరత, తక్కువ గిరాకీ, ఇతర సమస్యల వల్ల వాహన రంగం స్వల్ప నుంచి మధ్య కాలంలో కొన్ని సవాళ్లు ఎదుర్కోనుంది’అని టాటా మోటార్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తెలిపారు. ఇదిలా ఉంటే భారత్‌లో తన వ్యాపార కార్యకలాపాలను మరింత వేగంగా విస్తరించాలని జేఎల్‌ఆర్‌ ఇండియా భావిస్తోందని సంస్థ ఎండీ రోహిత్‌ సూరి చెప్పారు. గత పదేళ్లలో భారత్‌లో తాము నిర్మించుకున్న వ్యాపార పునాదులు ఇందుకు ఉపయోగపడతాయని చెప్పారు. 

ప్రస్తుతం భారత మార్కెట్లో 11 రకాల లగ్జరీ కార్లను జాగ్వార్ లాండ్ రోవర్ మార్కెటింగ్ చేస్తోంది. ఇందులో ఆరు కార్లను పుణెలో అసెంబుల్‌ చేస్తోంది. మార్కెట్‌ వృద్ధి రేటు బాగుంటే మరిన్ని మోడల్స్‌ను స్థానికంగా అసెంబుల్‌ చేసే విషయం పరిశీలిస్తామని సూరి చెప్పారు. ప్రస్తుతం భారత మార్కెట్‌లో అమ్ముడయ్యే ప్రతి నాలుగు లగ్జరీ కార్లలో ఒక కారు తమ కంపెనీదన్నారు.

2009-10లో కేవలం 200 కార్లు అమ్మిన తమ కంపెనీ ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఏటా 4,000 కార్ల వరకు అమ్మే స్థాయికి ఎదిగినట్టు చెప్పారు. సంఖ్యా పరంగా తగినన్ని అమ్మకాలు ఉంటే తప్ప, అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను స్థానికంగా అసెంబుల్‌ చేయడం గిట్టుబాటు కాదని జాగ్వార్ లాండ్ రోవర్ ఎండీ రోహిత్ సూరి వ్యాఖ్యానించారు.