Asianet News TeluguAsianet News Telugu

Andhra Pradesh Assembly Elections 2024 : వైసిపి బలాలు, బలహీనతలు ఇవే... అసంతృప్తులు ఎక్కువే

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా ఓట్లు, సీట్లు సాధించింది వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసిపి.  మరి ఈసారి ఆ పార్టీ ఎలా వుంది? బలాలేమిటి? బలహీనతలేమిటి? తెలుసుకోండి. 

YSR Congress Party Strengths and Weaknesses AKP
Author
First Published Mar 30, 2024, 8:58 PM IST

అమరావతి : దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. అన్నిరాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని లోక్ సభ నియోజకవర్గాలకు ఎన్నికలు జరగనున్నాయి...  కానీ  ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం అసెంబ్లీ ఎన్నికలు కూడా లోక్ సభతో పాటే జరుగుతున్నాయి.  కాబట్టి మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల హడావిడి చాలా ఎక్కువగా వుంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో వున్న టిడిపి జనసేన, బిజెపిలతో జతకట్టింది. ఈ మూడు పార్టీలు కలిసి కూటమిని ఏర్పాటుచేసుకుని ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్నాయి. అయితే వైసిపి మాత్రం ఒంటరిగా పోటీ చేస్తోంది. గత ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి విజయం తమదేనన్న ధీమాతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వున్నారు.  ఈ క్రమంలో వైసిపి బలాలు, బలహీనతలు, ఎన్నికల వేళ ఎదుర్కొంటున్న సవాళ్లను ఓసారి పరిశీలిద్దాం. 

ఈ ఎన్నికల్లో వైసిపి బలాలు : 

1. 2019 అసెంబ్లీ ఎన్నికల ప్రభంజనం : గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసిపి అధ్బుత విజయాన్ని అందుకుంది. ఎవరూ ఊహించని విధంగా 151 అసెంబ్లీ, 22 లోక్ సభ సీట్లతో ప్రభంజనం సృష్టించింది. ఇంతటి అపూర్వ విజయాన్ని చూసిన వైసిపి లీడర్లు, క్యాడర్ కు ఈసారి కూడా ఇలాంటి విజయమే వరిస్తుందన్న నమ్మకంతో వున్నారు. వైసిపి నాయకత్వం మరో అడుగు ముందుకేసి 'వై నాట్ 175''వై నాట్ కుప్పం' అంటోంది. అంటే గత ఎన్నికలు ఇచ్చిన జోష్ ఇంకా వైసిపిని నడిపిస్తోందన్నమాట.  

2. అధికారం : వైసిపి అధికారంలో వుంది కాబట్టి పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలుంటాయి. ఎన్నికల ప్రచారంలోనే కాదు పోలింగ్ సమయంలోనూ అధికారులు, పోలీసులు సహజంగానే అధికారపార్టీని చూసిచూడనట్లు వ్యవహరిస్తుంటారు. కాబట్టి ఇది వైసిపికి ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి.    

3. వాలంటీర్లు : వైసిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన వాలంటీర్లు ప్రజలకు చాలా చేరువయ్యారు. కాబట్టి వారిని ఎన్నికల విధుల్లో ఉపయోగించకున్నా వేరే విధాలుగా వైసిపి అనుకూల ప్రచారం చేసే అవకాశాలున్నాయి.  

4. ప్రత్యక్ష నగదుబదిలీ, సంక్షేమ పథకాలు : వైసిపి అధికారంలోకి వచ్చాక ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో భారీగా డబ్బులు ఇస్తోంది. ఆసరా పెన్షన్లతో పాటు  అమ్మ ఒడి, విద్యాదీవెన, విద్యా కానుక, వసతి దీవెన, చేదోడు ఇలా అనేక సంక్షేమ పథకాల కింద ఆడబిడ్డల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తోంది జగన్ సర్కార్. కాబట్టి ఇలాంటి పథకాలు ఎన్నికల్లో జగన్ పార్టీకి ఓట్లు రాల్చే అవకాశం వుంది. 

5. మూడు రాజధానుల నిర్ణయం : ఈ నిర్ణయం కూడా తమకు కలిసివస్తుందని వైసిపి నాయకులు చెబుతున్నారు. రాజధానుల తరలింపుతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో లాభపడతామని... పోతే ఒక్క కోస్తాంద్రలో అదీ అమరావతి ప్రాంతంలోనే దెబ్బతింటామని వైసిపి నాయకులు చెబుతున్నారు. 

వైసిపి బలహీనతలు : 

1. ప్రతిపక్షాల కూటమి : ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష టిడిపి, జనసేన, బిజెపి కూటమి కట్టడం వైసిపికి పెద్దదెబ్బే అని చెప్పాలి. ప్రతిపక్షాల మధ్య ఎంత ఎక్కువగా ఓట్లచీలిక వుంటే అధికారపార్టీకి అంత లాభం... గత ఎన్నికల్లో అదే జరిగి వైసిపి ఊహకందని విజయాన్ని కైవసం చేసుకుంది. కానీ ఈ సారి ప్రతిపక్షాలు ఆ ఛాయిస్ ఇవ్వడంలేదు. 

2. అమరావతి ఉద్యమం  : మూడు రాజధానుల నిర్ణయం వైసిపికి మేలుచేస్తుందో లేదోగాని అమరావతి ఉద్యమం అయితే వైసిపికి దెబ్బే అని చెప్పాలి. గత నాలుగేళ్ళుగా అమరావతి నుండి రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఉద్యమిస్తున్న రైతులు, మహిళలను జగన్ సర్కార్ పట్టించుకోలేదు. కాబట్టి వాళ్లు వైసిపి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలున్నాయి.  

3. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు : వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు నకిలీ మద్యం అమ్మకాలు, ఇసుక అక్రమ రవాణా ద్వారా వేలకోట్లు సంపాదించారని... ఇందులో సీఎం జగన్ కు జె ట్యాక్స్ వెళుతుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలకు దక్కాల్సిన సహజ వనరులు వైసిపి నేతలు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. ఇలాంటి తీవ్ర ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా ప్రతిపక్షాలు సక్సెస్ అయ్యాయనే చెప్పాలి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆర్థిక నేరగాడిగా ప్రజలముందు నిలబెట్టారు. 

4. ప్రభుత్వ వ్యతిరేకత : ఏ ప్రభుత్వమైనా ఒక్కసారి పాలించగానే సహజంగానే దానిపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అలాంటి వ్యతిరేకత కూడా వైసిపి ప్రభుత్వంపై వుంది. దాన్ని వైఎస్ జగన్ ఎలా అధిగమిస్తారో చూడాలి. 

5. అభ్యర్థులు, సిట్టింగ్ ల మార్ఫు : ఇదే అత్యంత కీలకమైనది. గత ఎన్నికల్లో పోటీచేసివారు, గెలిచి సిట్టింగ్ లుగా వున్నవారిలో చాలామందిని మార్చేసి ఈ అసెంబ్లీ, లోక్ సభ పోటీలో నిలుపుతున్నారు వైఎస్ జగన్. దీంతో కొందరు నాయకులు ఇప్పటికే పార్టీని వీడగా మరికొందరు అసంతృప్తితో వున్నారు. అలాంటివారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తే వైసిపి దెబ్బే.  

వైసిపి అసంతృప్తులు : 

వైసిపిలో సీటుదక్కని చాలామంది అసంతృప్తులు ఇప్పటికే ఇతర పార్టీల్లో చేరిపోయారు. అందులో మంత్రులు, మాజీ మంత్రులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు,ఎంపీ, మాజీలు వున్నారు. ఎంపీలు వల్లభనేని బాలశౌరి, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాగుంట శ్రీనివాసులు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇటీవల వైసిపిని వీడారు. మరో ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎప్పుడో వైసిపి దూరమయ్యారు. 

ఇక  ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే నలుగురు అధికారపార్టీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి వైసిపి నిర్ణయాన్ని ధిక్కరించి టిడిపి అభ్యర్థికి ఓటేసారని ఆరోపణలున్నారు. అందువల్లే వారిని వైసిపి పార్టీనుండి సస్పెండ్ చేసింది.  

ఇక ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో సీటుదక్కని ఎమ్మెల్యేలు, మాజీలు చాలామందే వైసిపిని వీడారు. ఇందులో సీఎం జగన్ కు సన్నిహితంగా వుండే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా వున్నారు. అయితే ఆయన షర్మిలతో కలిసి కాంగ్రెస్ లో చేరిన కొన్నిరోజులకే మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. 

ఏకంగా జగన్ కేబినెట్ లో కార్మిక మంత్రిగా వుండగానే గుమ్మనూరు జయరాం వైసిపికి గుడ్ బై చెప్పాడు. పార్టీకి, మంత్రి పదవికి రాజీనామా చేసిమరి టిడిపిలో చేరి అక్కడినుండి పోటీచేస్తున్నారు. మాజీ మంత్రి పార్థసారధి, వైసిపి నేత యార్లగడ్డ వెంకట్రావు కూడా టిడిపిలో చేరిపోయారు.  ఎమ్మెల్యేలు ఎలీజా, ఆర్థూర్ వంటివారు వైసిపిపై అసంతృప్తితో టిడిపిలో చేరిపోయారు. 


 

Follow Us:
Download App:
  • android
  • ios