Asianet News TeluguAsianet News Telugu

Year roundup 2019:విపక్షాల విమర్శలకు జగన్ చెక్, విప్లవాత్మక మార్పులు

ఏపీ రాష్ట్రంలో విద్య రంగంలో ఏపీ సీఎం కీలకమైన నిర్ణయాలు తీసుకొన్నారు. విప్లవాత్మక మార్పులకు జగన్ నిర్ణయాలు తీసుకొన్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా కూడ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు. 

year roundup 2019:AP launches Rs 12,000-cr scheme to introduce English medium in govt schools
Author
Amaravathi, First Published Dec 29, 2019, 2:08 PM IST

అమరావతి: ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యారంగంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ విప్లవాత్మకమార్పులకు శ్రీకారం చుట్టారు. సర్కారు బడుల రూపురేఖలను సమూలంగా మార్చే కార్యక్రమానికి నడుంభిగించారు.ప్రభుత్వ విద్యా విధానంలో మెరుగైనా ఫలితాలను తీసుకువచ్చేందుకు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. #

also readyear roundup 2019: జగన్‌కు జై కొట్టిన ఏపీ, ఎదురీదుతున్న బాబు...

 కార్పోరేట్ స్కూళ్లలో భారీగా ఫీజులు చెల్లించగలిగే వారికే పరిమితమైన ఇంగ్లీష్ మీడియం చదువులను ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్ధులకు కూడా చేరువ చేయాలనే సంకల్పాన్ని సాకారంలోకి తెచ్చారు. ఇంగ్లీస్ మీడియం స్కూళ్లపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశారు.  

also read: Year roundup 2019:తెలంగాణలో కమలానికి కలిసొచ్చిన కాలం

 ఫీజుల నియంత్రణ, ప్రమాణాల పర్యవేక్షణకు రిటైర్డ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో కమీషన్ ఏర్పాటు చేశారు. జగనన్న అమ్మ ఒడి కార్యక్రమం ద్వారా పేద విద్యార్ధులను చదివించే తల్లుల ఖాతాలకే రూ.15వేల ఆర్థిక చేయూతను అందించనున్నట్టుగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకొంది.

        మనబడి నాడు-నేడుతో మారనున్న రూపురేఖలు

''మనబడి నాడు-నేడు"" కార్యక్రమం ద్వారా విద్యారంగంలో కీలక మార్పులకు తొలి అడుగు పడింది.  సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలల స్వరూపమే పూర్తిగా మారిపోనుంది. 

నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు చేరువ చేసేందుకు వైఎస్‌ జగన్‌ సర్కార్‌ మూడు విడతల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని అమలు చేసేందుకు నడుంభిగించింది. 

also read:Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు

నేడు ప్రభుత్వ పాఠశాలలు వున్న పరిస్థితిని మార్పు తరువాత అదే పాఠశాల పరిస్థితిని కళ్ళకు కట్టేలా ఫోటోలు తీసి మరీ ప్రజల ముందు ప్రదర్శిస్తామంటూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ప్రకటించడం ద్వారా ఈ కార్యక్రమంపై తమ చిత్తశుద్దిని చాటుకున్నారు. 

ఒంగోలులో ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి చేతుల మీదిగా బాలల దినోత్సవం అయిన నవంబర్ 14వ తేదీన ''నాడు-నేడు'' కార్యక్రమాన్ని ప్రారంభించారు. మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాల లేమి అనే మాట వినిపించ కూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రణాళికను సిద్దం చేసింది. 

రాష్ట్రంలో పంచాయతీరాజ్, మున్సిపల్‌, పాఠశాల విద్య, గిరిజన సంక్షేమం, బిసి సంక్షేమం, సాంఘిక సంక్షేమం, జువైనల్ సంక్షేమశాఖల ఆధ్వర్యంలో మొత్తం 44,512 పాఠశాలలు నడుస్తున్నాయి. 

వీటిల్లో 33,797 ప్రాథమిక, 4,215 ప్రాథమికోన్నత, 6510 ఉన్నత పాఠశాలలు వున్నాయి. తొలిదశలో రాష్ట్రంలోని 15,715 పాఠశాలలను ఎంపిక చేసింది. ఇందులో 9795  ప్రాథమిక, 3110 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2810 ఉన్నత పాఠశాలలు వున్నాయి. 

ఆయా పంచాయతీల పరిధిలో అధికంగా విద్యార్ధులు వున్న పాఠశాలలను నాడు-నేడు కార్యక్రమంలోని మొదటి దశలో ఎంపిక చేశారు. వీటితో పాటు శిధిలావస్థలో వున్న పాఠశాలలు, నూతనంగా నిర్మించాల్సిన పాఠశాలలు, అసంపూర్తిగా వున్న పాఠశాలలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. అదే విధంగా ఉన్నత పాఠశాలల్లో 250 మంది కన్నా ఎక్కువ మంది విద్యార్ధులు వున్న పాఠశాలలకు కూడా మొదటిదశలో అవకాశం కల్పించారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో...
1. రన్నింగ్ వాటర్‌ తో కూడిన టాయిలెట్లు
2. విద్యుదీకరణతో పాటు ఫ్యాన్లు, లైట్లు
3. మంచినీరు
4. విద్యార్ధులు, పాఠశాల సిబ్బందికి అవసరమైన ఫర్నీచర్
5. మొత్తం పాఠశాలకు పెయింటింగ్‌
6. మేజర్‌, మైనర్‌ మరమ్మతులు
7. గ్రీన్ చాక్ బోర్డ్ లు,
8. అదనపు తరగతి గదులు
9. ప్రహరీ గోడ నిర్మాణం... వంటి తొమ్మిది రకాల వసతులను ''మనబడి నాడు-నేడు'' కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్నారు. 418 మండలాల్లో సర్వశిక్షాభియాన్, 263 మండలాల్లో ఎపి ఎడ్యుకేషన్‌ వెల్ఫేర్‌ అండ్‌ ఇన్ర్ఫాస్ట్రక్చర్‌ డెవలప్ మెంట్ కార్పోరేషన్‌,  49 మండలాల్లో గిరిజన సంక్షేమశాఖ ద్వారా మొదటిదశలో ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన చేపట్టనున్నారు. 

వేసవి సెలవుల తరువాత బడులు తెరవగానే యూనిఫారంలు, వాటి కుట్టుకూలి డబ్బులు, షూలు కొనుగోలు చేసేందుకు నగదు, ఉచితంగా పాఠ్య పుస్తకాలను సకాలంలో అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 

దీనితో పాటు విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు వుండేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇప్పటికే విద్యాశాఖా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విద్యార్ధులు, ఉపాధ్యాయుల నిష్పత్తిని సక్రమంగా వుండేలా చూడటం వల్ల విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలను సాధించాలని ప్రభుత్వం భావిస్తోంది. 
            
* పేద విద్యార్థుల ఇంగ్లీష్ మీడియం కల సాకారం*

ఉన్నత వర్గాలకుపెద్దపెద్ద ఫీజులు వసూలు చేసే కార్పోరేట్ స్కూళ్లకే పరిమితం అయిన ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను పేద విద్యార్ధులకు చేరువ చేసేందుకు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లీష్ మీడియం విద్యను బోధించేలా విద్యాశాఖను ఆదేశించారు. 

వచ్చే విద్యాసంవత్సరం నుంచి  ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను అమలులోకి తీసుకువచ్చారు. తరువాత ప్రతి ఏటా ఒక తరగతి చొప్పున ఇంగ్లీష్ మాధ్యమంను వర్తింప చేయనున్నారు. దీనితో పాటు మాతృభాషను కూడా ఒక సబ్జెక్ట్ గా తప్పని సరిగా చదవాలని నిబంధనను తీసుకువచ్చారు. 

ఇంగ్లీష్ మాధ్యమంలోనే చదవాల్సిన ప్రోఫెషనల్ కోర్సులతో పాటు ట్రిపుల్ ఐటిల వంటి సంస్థల్లోనూ ఇంగ్లీష్ మాధ్యమంను అనురించాల్సిన పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమంలో చదువుకున్న విద్యార్ధులు ఇబ్బందుల పాలవుతున్నారు. 

కార్పోరేట్ విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో చదువుకున్న విద్యార్ధులతో పోటీ పడలేని పరిస్థితుల్లో... అందివచ్చిన అనేక అవకాశాలను పేద విద్యార్ధులు కోల్పోతున్నారని సామాజికవేత్తలు అనేక సందర్భాల్లో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. 

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులకు ఆంగ్లంపై పట్టు లేకపోవడం వల్ల వారి భవిష్యత్తుకు జరుగుతున్న నష్టంపై నిపుణుల ఆవేదనను ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి పరిగణలోకి తీసుకున్నారు. 

ప్రపంచమే గ్లోబల్ విలేజ్ గా మారుతున్న నేటి పరిస్థితుల్లో సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్పడం ద్వారా పేద విద్యార్ధులు సైతం ప్రపంచస్థాయి అవకాశాలకు పోటీ పడాలనే సంకల్పంతో సాహసోపేతమైన ఇంగ్లీష్ మీడియం మాధ్యమ బోధనకు ముందడుగు వేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలతో పాటు ఆర్థికంగా వెనుకబాటుతనంతో వున్న అన్ని వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

నాణ్యమైన మధ్యాహ్న భోజనం

విద్యార్థులకు బలవర్దక పోషకాహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. భోజనం మెనులో మార్పులు తీసుకువచ్చింది. గతంలో ఉన్న మెనూ ప్రకారం వారంలోని 6 రోజుల్లో 3 రోజులు గుడ్డు ఉండేది. కానీ ఇప్పుడు 5 రోజులు గుడ్డు ఉండేలా మార్పులు చేశారు. 

ఎన్ జీ ఓ ల ద్వారా నాణ్యమైన ఆహారాన్ని పాఠశాలలకు అందిస్తున్నారు. ప్రత్యేకంగా సెంట్రలైజ్డ్ కుకింగ్ షెడ్ లను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో వంట మనుషులుగా ఉన్న వారిని కుకింగ్ కం హెల్పర్లు గా పరిగణించి గతం లో వారికి ఇచ్చిన రూ. వెయ్యి వేతనాన్ని రూ. 3 వేలకు పెంచారు.  దీనివల్ల రాష్ట్రంలో 85,143 మందికి లబ్ది చేకూరింది.
    
వైఎస్ఆర్ కంటి వెలుగు 
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు ఉచితంగా కంటి వైద్యపరీక్షలు చేయించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమంలో తొలి రెండు దశల్లో రాష్ట్రంలోని పాఠశాల విద్యార్ధులకు కంటి పరీక్షలు నిర్వహిస్తున్నారు.

 అక్టోబర్ 10వ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థిని, విద్యార్థుల కంటి పరీక్షలు నిర్వహించడం, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, ఆ తరువాత మందులతో పాటు కళ్ళజోళ్ళను కూడా అందించేందుకు చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో మొత్తం 65,17,576 మందికి స్క్రీనింగ్ టెస్టులు పూర్తి చేసి వారిలో అవసరమైన వారికి అద్దాలు అందచేయనున్నారు. 
    
''అమ్మ ఒడి''తో పిల్లలను బడులకు పంపే తల్లులకు ఆర్థిక చేయూత

ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ ఒక్క చిన్నారి విద్యకు దూరం కాకూడదనే ఉన్నత ఆశయంతో ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి అమ్మ ఒడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 తమ పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి ఖాతాలో ఏడాదికి రూ.15 వేలను జమ చేస్తానని ఆయన చేసిన ప్రకటన రాష్ట్రంలోని అనేక లక్షల మంది తల్లిదండ్రుల్లో కొండంత బరోసాను కల్పించింది. 

జగనన్న అమ్మ ఒడి పథకాన్ని 2020 జనవరి 9న ప్రారంభించనన్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన సర్వే కూడా పూర్తి చేశారు.  1నుంచి 10 తరగతి, ఇంటర్ చదువుతున్న 35 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలను గుర్తించారు. బడ్జెట్ లో ఇప్పటికే దాదాపు రూ.6 వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం కేటాయించారు. 
        
జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనలకు రూ.5700 కోట్లు

అర్హులైన విద్యార్థులందరికీ ఫీజు రియాంబర్స్ మెంట్ అందించేలా విద్యాదీవెన పథకాన్ని రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, ఈబిసి, మైనార్టీ, దివ్యాంగులకు పథకాన్ని వర్తింప చేస్తారు. 

ఈ సారి బీటెక్, బీఫార్మసీ, ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంబిఎ, ఎంసిఎ, బిఇడి కోర్సులకు పూర్తి స్థాయిలో రీయాంబర్స్ మెంట్ అందచేస్తారు. వసతి దీవెన పథకం ద్వారా అర్హులైన విద్యార్ధులందరికీ వసతి, భోజన సదుపాయాల కోసం నగదు చెల్లిస్తారు. 

ఐటిఐ విద్యార్థులకు రూ.10వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు చదువుతున్న విద్యార్థులకు ఏటా రూ.20వేల చొప్పున ఇస్తారు.     జగనన్న విద్యాదీవెన ద్వారా ఏటా రూ.3400 కోట్లు, వసతి దీవెన కింద ఏటా రూ.2300 కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా ఈ రెండు పథకాల కోసం ఏటా రూ.5700 కోట్లు ఖర్చు చేయనుంది. 

పదో తరగతిలో బిట్  పేపర్ రద్దు

విద్యారంగంలో ప్రమాణాలను పెంచేందుకు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. 10 వ తరగతి పరీక్షల్లో ప్రశ్నపత్రం మార్పునకు చర్యలు తీసుకుంది. గతంలో ఉన్న విధంగా కాకుండా బిట్ పేపర్ ను ప్రశ్నపత్రం లో కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. బిట్ పేపర్ రద్దు నిర్ణయంతో పదోతరగతి పరీక్షల్లో కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టింది. 

విద్యా ప్రమాణాల పెంపునకు చర్యలు
రాష్ట్రంలో ప్రైవేటు విద్యావ్యాపారానికి ప్రభుత్వం ఫీజు నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటుతో ముక్కుతాడు వేసింది. కనీస ప్రమాణాలు లేకుండానే ఇష్టారాజ్యంగా ఫీజులను దండుకుంటున్న ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి చెక్ పెట్టింది. 

ఇందుకోసం జస్టీస్‌ఈశ్వరయ్య చైర్మన్ గా ఎపి ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ను ఏర్పాటు చేసింది. సివిల్ కోర్ట్ అధికారాలతో ఈ కమిషన్‌ నిబంధనలను పాటించని విద్యాసంస్థలను పిలిచి విచారించే అధికారాలను కట్టబెట్టింది.

 రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణ అధికారం విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే పాఠశాలలు మినహా తక్కిన అన్ని సంస్థలు ఈ కమిషన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. 

ప్రైవేటు విద్యా సంస్థల్లోని టీచర్ల సర్వీసు కండిషన్లు, వారికి ఇస్తున్న వేతనాలు, ఇతర అంశాలను కూడా కమిషన్‌ పరిశీలిస్తుంది. ఫీజుల నిర్ణయానికి సంబంధించి స్వతంత్ర ప్రతిపత్తిగల అక్రిడిటేషన్‌ ఏజెన్సీని ఏర్పాటు చేస్తుంది. 

నిబంధనలు అసలు పాటించని సంస్థల గుర్తింపును రద్దు చేసే అధికారం కూడా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో అత్యున్నత ప్రమాణాల సాధనకు కమిషన్‌ చర్యలు చేపడుతుంది. ప్రవేశాలు, బోధన, పరీక్షలు, పరిశోధన, బోధనా సిబ్బంది అర్హతలు, మౌలిక సదుపాయాలు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల మేరకు ఆయా సంస్థల నిర్వహణ ఉందా? లేదా అన్న అంశాలను పరిశీలిస్తుంది. 

జూనియర్, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్‌ కాలేజీలతో పాటు అన్ని ప్రైవేటు యూనివర్సిటీలు (రాష్ట్ర చట్టాలకు లోబడి ఏర్పాటైనవి) కూడా ఈ కమిషన్‌ పరిధిలోకి తీసుకువచ్చారు. 

ఆయా సంస్థలపై చర్యలకు కమిషన్‌కు అధికారం ఉంటుంది. విద్యార్థులకు సమస్యలు తలెత్తకుండా ఆయా సంస్థల మూతకు చర్యలు తీసుకొనే అధికారం, నిబంధనలు పాటించని ఉన్నత విద్యా సంస్థలకు పెనాల్టీల విధింపు అధికారం కల్పించారు. నిబందనలు ఉల్లంఘించే సంస్థల గుర్తింపు రద్దుకు వర్సిటీలను ఆదేశించే అధికారం కట్టబెట్టారు.

Follow Us:
Download App:
  • android
  • ios