హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఈ ఏడాది కలిసి వచ్చింది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటుకే పరిమితమైన బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ కంటే ఒక్క సీటు అదనంగా దక్కించుకొంది. దీంతో తెలంగాణ రాష్ట్రంపై కమలదళం కేంద్రీకరించింది.

Also read:Year roundup 2019:ప్రతిపక్షాలకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన కేసీఆర్

2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర పీఠాన్ని కైవసం చేసుకోవాలని భావిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ  స్థానాన్ని తాము దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది.

also read:Weekly roundup:దిశ నిందితుల మృతదేహాలు గాంధీలోనే, మరో పోరాటానికి పసుపు రైతులు

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్‌కు తమ పార్టీయే ప్రత్యామ్నాయమని బీజేపీ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతలు ఒంటి కాలిపై లేస్తున్నారు.

ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుండి నవంబర్ 29వ తేదీ వరకు ఆర్టీసీ కార్మికులు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు బీజేపీ నేతలు కూడ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చేలా చూడాలని బీజేపీ నేతలు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ను కోరారు.

ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో టీఆర్ఎస్ కు బీజేపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు. కేంద్ర మంత్రులతో ఈ విషయమై కూడ బీజేపీ నేతలు మాట్లాడారు. ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వానికి 33 శాతం వాటా ఉన్నందున ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసే విషయంలో కేంద్రం అనుమతి తీసుకోవాలని కూడ బీజేపీ నేతలు ఆర్టీసీ కార్మికులకు భరోసాను కల్పించారు.

ఈ ఏడాది అక్టోబర్ చివరి మాసంలో జరిగిన హుజూర్‌నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి ఆశించిన ఫలితం దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని టీఆర్ఎస్ దక్కించుకొంది. 

కానీ, బీజేపీ మెరుగైన ఓట్లను సాధించే అవకాశం ఉందని భావించారు. ఈ నియోజకవర్గంలో గణనీయమైన ఓట్లు ఉన్న సామాజిక వర్గానికి చెందిన అభ్యర్ధి కోట రామారావును అభ్యర్ధిగా బరిలోకి దింపింది. కానీ, ఆ పార్టీకి ఆశించిన ఫలితం దక్కలేదు.

గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ సీట్లు దక్కాయి. ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాలతో టీడీపీకి చెందిన కొందరు కీలక నేతలు తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలో చేరారు.

టీడీపీకి చెందిన ద్వితీయశ్రేణి క్యాడర్ కూడ బీజేపీలో చేరింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగింది. అయితే కొందరు నేతలు బీజేపీలో చేరిక తాత్కాలికంగా వాయిదా పడింది.

రాష్ట్రంలోని కాంగ్రెస్, టీడీపీతో పాటు అధికార టీఆర్ఎస్ కు చెందిన కొందరు కూడ బీజేపీలో చేరే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అయితే ఎన్నికలు ఇప్పట్లో లేనందున బీజేపీ తీర్థం పుచ్చుకొనే నేతలు కూడ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుండి విజయం సాధించిన జి. కిషన్ రెడ్డి మోడీ మంత్రివర్గంలో చోటు దక్కింది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పదవి దక్కింది. మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ పదవిని కట్టబెట్టింది బీజేపీ నాయకత్వం.

ఇక మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్న సిహెచ్ విద్యాసాగర్ రావుకు మరోసారి పదవిని పొడిగించలేదు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో విద్యాసాగర్ రావు తిరిగి క్రియాశీలకంగా పనిచేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం కూడ లేకపోలేదు. ఈ కారణంగానే విద్యాసాగర్ రావుకు గవర్నర్ పదవిని పొడిగించలేదనే ప్రచారం కూడ కమలదళంలో ఉంది. అయితే ఈ విషయమై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్టీల్లో చేరికల విషయమై బీజేపీ జాతీయ నేతలు రామ్ మాధవ్, మురళీధర్ రావులు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంపై మురళీధర్ రావు కేంద్రీకరించి పనిచేస్తున్నారు.

ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించడం రాజకీయంగా బీజేపీకి కలిసొచ్చింది. ఈ స్థానాలను కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా నష్టాన్ని కల్గించింది.

కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కొన్ని ఎంపీ స్థానాల్లో  సరిగా పనిచేయని కారణంగానే బీజేపీ ఆ స్థానాలను కైవసం చేసుకొందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. కాంగ్రెస్ పార్టీకి చెందిన క్యాడర్ బహిరంగంగానే కొన్ని చోట్ల బీజేపీ అభ్యర్ధులకు పనిచేశారని టీఆర్ఎస్ ఆరోపణలు చేసింది.

నిజామాబాద్, కరీంనగర్ ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ స్థానిక నాయకత్వం బీజేపీకి ప్రచారం నిర్వహించిందని టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించారు. అయితే ఈ పరిణామాలు రాజకీయంగా కాంగ్రెస్ కు నష్టం కల్గించింది. బీజేపీకి మాత్రం ఈ ఫలితాలు ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు జాతీయ నాయకత్వానికి కూడ భవిష్యత్తుపై ఆశలను సజీవంగా ఉంచాయి.