కృష్ణా జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని చందర్లపాడు మండలం తోటరాముడుపాడు లో ఓ తండ్రి తన కన్న కూతురిని గొడ్డలితో దాడి చేసి చంపాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే... తోటరాములపాడు గ్రామానికి చెందిన చంద్రిక గత కొంత కాలంగా ఫోన్ లో ఎక్కువగా మాట్లాడుతుంది. దీంతో ఆమెపై తండ్రి కోటయ్యకు అనుమానం పెరిగింది. ఎవరినో ప్రేమిస్తూ ఆమె అతడితోనే ఫోన్ లో మాట్లాడుతోందని అనుమానిస్తూ వస్తున్నాడు. ఈ విషయం బైటపడితే తన పరువు పోతుందని బావించాడు. ఈ విషయంపై కూతురిని గట్టిగా హెచ్చరించాడు.

అయితే ఇవాళ చంద్రిక మళ్లీ ఫోన్ లో మాట్లాడడాన్ని కోటయ్య గమనించాడు. దీంతొ తీవ్ర ఆవేశానికి లోనైన అతడు కూతురిపై గొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన చంద్రిక అక్కడికక్కడే మృతి చెందింది.

ఈ హత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించిన పోలీసులు, ఈ హత్యకు పాల్పడిన యువతి తండ్రి కోటయ్యను అదుపులోకి తీసుకున్నారు.