ఒంగోలు: ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకరాంబాబుకు కరోనా పాజిటివ్ సోకింది. కరోనా లక్షణాలు కన్పించడంతో గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా వెంకటరాంబాబు దంపతులు పరీక్షించుకొన్నారు.  దీంతో వీరిద్దరికి కరోనా నిర్ధారణ అయింది.  ఎమ్మెల్యే అన్నా రాంబాబు కుటుంబసభ్యులకు కూడ పరీక్షలు నిర్వహించారు.

అయితే  మిగిలిన వారందరికీ కరోనా పరీక్షల్లో నెగిటివ్ గా నిర్ధారణ అయింది. నెల రోజుల క్రితం అన్నా రాంబాబు మనమడికి కరోనా  సోకింది. ఆయనకు ఒంగోలులో చికిత్స చేయించారు. అయితే మనమడి పుట్టినరోజు వేడుకలతో పాటు ఇతర కార్యక్రమాల్లో కూడ ఎమ్మెల్యే అన్నా రాంబాబు హాజరయ్యారు. ఎమ్మెల్యే అన్నా రాంబాబును కలిసిన కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రజా ప్రతినిధులకు కరోనా సోకింది. 

ఏపీలో ఇప్పటికే డిప్యూటీ సీఎం అంజద్ బాషాతో పాటు పలువురు ఎమ్మెల్యేలకు కరోనా సోకింది. విజయనగరం జిల్లా ఎస్.కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసులు, గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య, నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, గుంటూరు జిల్లా తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ కరోనా బారినపడ్డారు. ఏపీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతికి కరోనా సోకింది.  కరోనా నుండి రోశయ్య కోలుకొన్నారు. శివకుమార్ క్వారంటైన్ కే పరిమితమయ్యారు.