Asianet News Telugu

నగ్న చిత్రాలతో వేధింపులు... విదేశాలకు అమ్మాయిల అమ్మకం: ఎపిపిఎస్సి సభ్యుడిపై మాజీ మంత్రి తీవ్ర ఆరోపణలు

ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులు నూతలపాటి సోనీవుడ్ పై మాజీ మంత్రి బండాారు సత్యనారాయణ మూర్తి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మతప్రచారం ముసుగులో అమ్మాయిలను విదేశాలకు అమ్మేస్తున్నాడని మాజీ మంత్రి ఆరోపించారు. 

ex minister bandaru satyanarayana murthy allegations on appsc member nuthalapati sonywood akp
Author
Visakhapatnam, First Published Jul 9, 2021, 4:49 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

తన ఆధ్వర్యంలో నడుస్తున్న సంస్థల్లో పనిచేసే వ్యక్తులు హిందూమతాన్ని కించపరుస్తున్నా, పనిగట్టుకొని పదేపదే ఆ మతాన్ని అవహేళనచేస్తున్నా ముఖ్యమంత్రి జగన్ ఎందుకు పట్టించుకోవడంలేదని టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణమూర్తి నిలదీశారు. హిందూదేశంలోని రాష్ట్రంలో ప్రధానమతంపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని నిరోధించడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యాడని  సత్యనారాయణమూర్తి ఆరోపించారు. 
 
''ముఖ్యమంత్రి ఏరికోరీ ఏపీపీఎస్సీ మెంబర్ గా నియమించిన నూతలపాటి సోనివుడ్ సీఐడీ డీజీ సునీల్ కుమార్ కు స్వయానా బావమరిది. అలాంటి వ్యక్తి హిందూమతాన్ని కించపర్చడమే కాదు ఆడబిడ్డలను వేధిస్తున్నాడు. అమ్మాయిల నగ్నచిత్రాలను విదేశాలకు పంపడంతో పాటు వారిని అక్రమరవాణా చేస్తున్న విషయం బయటపడినా సదరు వ్యక్తిపై చర్యలు తీసుకోవడానికి జగన్ ఎందుకు వెనుకాడుతున్నాడు'' అని మాజీ మంత్రి నిలదీశాడు.

''సోనివుడ్ ఆడబిడ్డలను వేధిస్తున్న వ్యవహారమే కాదు అతని ఆకృత్యాలను ఆధారాలతో సహా హైదరాబాద్ కు చెందిన ఒక సామాజిక సంస్థ బయటపెట్టిన విషయం ముఖ్యమంత్రికి తెలియదా? తాను చెప్పింది చేస్తారనే ఇలాంటి తప్పుడు వ్యక్తుల విషయంలో ముఖ్యమంత్రి చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నాడు'' అన్నారు. 

''తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో ఉన్న హజారత్ అసోసియేషన్ ఫర్ సోషల్ అవేర్ నెస్ సొసైటీ సంస్థ ముసుగులో సోనీవుడ్ హిందూమతాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నాడు. మత ప్రచారం ముసుగులో ఆడపిల్లల నగ్నచిత్రాలను విదేశీయులకు పంపిస్తూ, వారిని అంగట్లో వస్తువులుగా మార్చి వ్యాపారం చేస్తున్నాడు.హిందువులను, హిందూమతాన్ని కించపరుస్తూ, అభంశుభం తెలియని ఆడపిల్లల నగ్నచిత్రాలను విదేశాలకు పంపిస్తున్నవ్యక్తిపై చర్యలు తీసుకోవడం మానేసి, ఏపీపీఎస్సీ మెంబర్ గా నియమించడం ఈ ముఖ్యమంత్రికే చెల్లింది'' అని మండిపడ్డారు. 

read more వైఎస్సార్ పేరుతో దళితుల నిధులు స్వాహా...: జగన్ పై వర్ల రామయ్య ఆరోపణలు

''ఏపీపీఎస్సీ క్రైస్తవుల సంస్థ కాదు... అన్ని మతాలవారిని సమానంగా చూసేది. మరీముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పనలో కీలకపాత్ర పోషించేది. అలాంటి సంస్థలో మతపిచ్చితో పేట్రేగిపోతున్న సోనివుడ్ ను నియమించడం ఏమిటి? సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ తాను చెప్పిందల్లా వింటున్నాడనే సీఎం సోనీవుడ్ దారుణాలను ఉపేక్షిస్తున్నాడు'' అని పేర్కొన్నారు. 

''భారతదేశంలోకి మెడిసిన్, మంచి చదువులు, నాగరికత అనేవి క్రైస్తవ మిషనరీల వల్లే వచ్చాయని చెప్పడంతో పాటు దేశంలో రామాయణ, భారతాలు ఉండకూడదని బహిరంగంగానే మాట్లాడిన సోనీవుడ్ పై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు. ప్రభుత్వానికి చెందిన వ్యవస్థలో అతికీలకంగా ఉన్న వ్యక్తి పనిగట్టుకొని హిందూమతంపై దుష్ప్రచారం చేస్తుంటే అతన్ని అరెస్ట్ చేయడానికి డీజీపీ ఎందుకు వెనుకాడుతున్నారు'' అని మాజీ మంత్రి నిలదీశారు. 

''మతప్రచారం ముసుగులో ఆడబిడ్డల నగ్నచిత్రాలను వెబ్ సైట్లలో పెడుతున్న సోని వుడ్ పై తక్షణమే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. సోనీవుడ్ ఆధ్వర్యంలో తునిలో నడుస్తున్న మతపరమైన సంస్థను కూడా ప్రభుత్వం వెంటనే మూయించాలి. ముఖ్యమంత్రి ఈ వ్యవహారంపై మూడురోజుల్లో చర్యలు తీసుకోవాలి. సోనీవుడ్ పై క్రిమినల్ కేసులు నమోదుచేసి వెంటనేఅతనిపై చర్యలు తీసుకోవాలి. సీఎం ఈ సోనీవుడ్ బాగోతంపై స్పందించకుంటే  హిందూ సంస్థలతో కలిసి  ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అంతేకాదు సోనీవుడ్ వ్యవహారాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళతాం'' అని మాజీ మంత్రి బండారు తీవ్రస్వరంతో హెచ్చరించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios