అమరావతి: తెలుగుదేశం పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బీజేపీలో చేర్చుకోవడంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. బీజేపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడటం అనైతికమంటూ మండిపడ్డారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన కళా వెంకట్రావు రాజ్యసభలో మెజారిటీ కోసమే బీజేపీ అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. బీజేపీలో చేరిన తెలుగుదేశం ఎంపీలది విలీనం కాదని, ఫిరాయింపేనని చెప్పుకొచ్చారు. 

మరోవైపు ప్రజావేదిక స్వాధీనంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజావేదికను స్వాధీనం చేసుకుని మాజీసీఎం చంద్రబాబు సామాన్లు విసిరేయడం అప్రజాస్వామికమన్నారు. ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారని కనీసం స్పందించకుండా ఆయన లేనప్పుడు స్వాధీనం చేసుకున్నారని విరుచుకుపడ్డారు. 

టీడీపీ కార్యకర్తలపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దాడులకు పాల్పుడుతున్నారని ఆరోపించారు. వైసీపీ దాడులను తాము తిప్పి కొట్టగలమని అయితే శాంతిభద్రతలను కాపాడాలనే ఉద్దేశంతో భరిస్తున్నామన్నారు. వైసీపీ దాడులపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని కళా వెంకట్రావు తెలిపారు.