టార్గెట్ అమరావతి ... ఏపీ రాజధాని పనుల పున:ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్, ఎప్పటినుండంటే...
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రాజధాని అమరావతి నిర్మాణపనులు త్వరలోనే ప్రారంభంకాానున్నారు.గత ఐదేళ్లుగా ఆగిన పనులు ఎప్పటినుండి తిరిగి ప్రారంభమవుతాయో మంత్రి నారాయణ ప్రకటించారు.
Amarabvati : ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పున:ప్రారంభానికి చంద్రబాబు ప్రభుత్వం ముహూర్తం ఖరారు చేసింది. గత ఐదేళ్లుగా నిలిచిపోయిన పనులకు డిసెంబర్ ఫస్ట్ నుండి ప్రారంభించనున్నట్లు మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఇందుకోసం కూటమి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందని మంత్రి తెలిపారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో క్రెడాయ్ సౌత్ కాన్ 2024 కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి వచ్చిన బిల్డర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణరంగ అభివృద్దితో పాటు రాజధాని అమరావతి నిర్మాణంగ గురించికూడా మంత్రి ఆసక్తికర కామెంట్స్ చేసారు.
రాజధాని అమరావతి నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి తెలిపారు. వచ్చే నాలుగేళ్ళలో శరవేగంగా నిర్మాణపనులు జరుగుతాయి... ఈ ప్రభుత్వంలోని అమరావతి పూర్తిస్థాయిలో రూపుదిద్దుకుంటుందని అన్నారు. అమరావతి నిర్మాణానికి రూ.60వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నట్లు నారాయణ తెలిపారు. భవిష్యత్ లో ప్రపంచంలోనే ఉత్తమ నగరంగా అమరావతి నిలుస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేసారు.
కేవలం అమరావతి ప్రాంతాన్నే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఏకకాలంలో 26 జిల్లాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి వుందన్నారు. అమరావతి నిర్మాణం పూర్తయితే రాష్ట్ర ప్రజలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి... ప్రభుత్వానికి పాలన సులభతరం అవుతుందన్నారు నారాయణ.
ఇక అమరావతి నిర్మాణంలో బిల్డర్ల పాత్ర కూడా చాలా వుంటుందని మంత్రి నారాయ తెలిపారు. రాజధాని ప్రాంతంతో నిర్మాణరంగం కొంతపుంతలు తొక్కుతుందని అన్నారు. ప్రభుత్వం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లకు అండగా వుంటుంది... వారు అన్ని అనుమతులు సులభంగా పొందేలా ప్రత్యేక సాఫ్ట్ వేర్ తీసుకువస్తామని ప్రకటించారు. మున్సిపల్ శాఖతో అన్ని శాఖలను అనుసంధానం చేసేలా ఈ సాఫ్ట్ వేర్ వుంటుందన్నారు. సింగిల్ విండో అనుమతులపై ప్రభుత్వం సానుకూలంగా వుందన్నారు. లే అవుట్ లు,భవన నిర్మాణాల అనుమతులను సరళతరం చేసేందుకు ప్రభుత్వం కృషిచేస్తోందని అన్నారు. కాబట్టి నిబంధనలు ఉల్లంగించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బిల్డర్లు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి నారాయణ కోరారు.
ఇక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని మొదటి ప్రాధాన్యతగా తీసుకున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ లో రాజధాని నిర్మాణానికి భారీగా నిధులు కేటాయించింది. 15000 కోట్ల రూపాయలను అమరావతి నిర్మాణంకోసం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి అందించనున్నట్లు కేంద్రం పార్లమెంట్ సాక్షిగా ప్రకటించింది. దీన్నిబట్టే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమవుతుంది.
గత వైసిపి ప్రభుత్వం గత ఐదేళ్లు అమరావతిని అస్సలు పట్టించుకోలేదు. మూడు రాజధానుల పేరిట విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా మార్చేందుకు ప్రయత్నించారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ అమరావతి నిర్మాణాన్ని పూర్తిగా విస్మరించారు. కానీ ప్రజలు వైఎస్ జగన్ పాలనను తిరస్కరించి తిరిగి చంద్రబాబుకు పట్టం గట్టారు. అధికారంలోకి రాగానే జగన్ మూడు రాజధానుల నిర్ణయాన్ని పక్కనబెట్టి తిరిగి అమరావతి నిర్మాణంపై దృష్టిపెట్టారు చంద్రబాబు. అందులో భాగంగానే త్వరలో నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు.