శ్రీకాకుళం: రాత్రి కుటుంబ సభ్యులతో పాటు ఇంట్లో నిద్రించిన 16 ఏళ్ల అమ్మాయి తెల్లారేసరికి రైల్వే ట్రాక్ పై శవమై తేలింది. ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తురు మండలం ధర్మవరం జరిగింది. 

శనివారం రాత్రి తల్లిదండ్రులతో, తమ్ముడితో రాత్రి ముచ్చట పెట్టి నిద్రపోయింది. శనివారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఇంటి పక్కన ఉన్న బాత్రూంకు వెళ్లింది. తిరిగి రాలేదు. దాంతో రాత్రిపూటనే కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించారు. 

తెల్లారేసరికి పెట్టిభద్ర వద్ద రైల్వే ట్రాక్ మీద శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. వజ్రపుకొత్తూరు మండలం బాతుపురం గ్రామానికి చెందిన ఇరోతు ఈశ్వరరావు, పార్వతి దంపతులు కూలి పనులు చేసుకుంటూ ధర్మవరంలో జీవిస్తున్నారు. వారికి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్న కూతురు, పదో తరగతి చదువుతున్నారు. 

పదహారేళ్ల వయస్సు గల కూతురు శనివారంనాడు రాత్రి మాయమై తెల్లారే సరికి శవంగా మారింది. మృతురాలి తలపై, కాళ్లూ చేతులపై గాయాలున్నాయి. మృతదేహం పడి ఉన్న స్థలానికి కొద్ది దూరంలో గల తుప్పల్లో చేతి గాజుముక్కలు, చెప్పులు కనిపించాయి. 

బాలిక ఫోన్ పరిశీలించగా శనివారం రాత్రి మణికంఠ అనే యువకుడి నుంచి హాయ్... బాగున్నావా... గుడ్ నైట్ అనే మెసేజ్ వచ్చినట్లు తెలిసింది. బాలిక మృతికి అతనే కారణమై ఉంటాడని అనుమానించి గ్రామస్థులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. మణికంఠ కాశీబుగ్గలో మృతురాలు చదువుతున్న కాలేజీలోనే సీనయర్ ఇంటర్ చదువుతున్నాడు. 

రైలు పట్టాల పక్కన చెప్పులు, సమీపంలోని తుప్పల వద్ద పెనుగులాడిన ఛాయలు, చేతిగాజుల ముక్కలు కనిపించాయి. దీంతో బాలికపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. అత్యాచారం, హత్య అభియోగాల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.