వెండి పట్టీలు.. పాదాల అందాన్ని పెంచుతాయి. అందుకే చాలామంది మహిళలు వీటిని ఇష్టంగా ధరిస్తారు. ధర కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి రకరకాల డిజైన్లలో పట్టీలు కొనుగోలు చేస్తుంటారు. ఇవి అందానికే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది అంటున్నారు నిపుణులు. ఎలాగో చూద్దాం. 

భారతీయ సంప్రదాయంలో బంగారాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అందుకే బంగారాన్ని కాళ్లకు ధరించడానికి ఎవరూ ఇష్టపడరు. కాళ్లకు వెండితో తయారుచేసిన పట్టీలను ధరించడం మంచిదని చెప్తారు పెద్దలు. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు.. దీని వెనక చాలా ఆధ్యాత్మిక, శాస్త్రీయ, ఆయుర్వేద కారణాలున్నాయట. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

వెండి పట్టీలు పెట్టుకోవడం వెనక కారణాలు

సంతోషకరమైన వైవాహిక జీవితం

భారతీయ మహిళలు ధరించే ప్రతి ఆభరణానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కాళ్లకు ధరించే ఆభరణాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. ఇవి అందాన్ని పెంచడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. 

సాధారణంగా మహిళలు అందంగా కనిపించడానికి వెండి పట్టీలు ధరిస్తారు. వయసుతో సంబంధం లేకుండా అందరు మహిళలు వీటిని పెట్టుకుంటారు. వివాహితలు వెండి పట్టీలు ధరిస్తే సంతోషంగా ఉంటారని నమ్ముతారు. అంతేకాదు వీటిని ధరించడం అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు. ఇవి ధరించడం వల్ల ఇంట్లో సంతోషం, శ్రేయస్సు వస్తుందని పండితులు చెబుతున్నారు.

మానసిక ప్రశాంతత

పురాణాల ప్రకారం వెండి సానుకూల శక్తి, చల్లదనం, ప్రశాంతత, పవిత్రతకు చిహ్నం. వెండి పట్టీలు ధరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. చెడు శక్తులు దూరమవుతాయి. గజ్జెల శబ్ధం పరిసరాలను శుద్ధి చేసి మనసుకు ప్రశాంతతనిస్తుంది.

పీరియడ్ సమస్యల నుంచి ఉపశమనం

శాస్త్రీయంగా చెప్పాలంటే.. వెండి పట్టీలు కాళ్లకు ధరించడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. వీటివల్ల పాదాల్లోని కొన్ని పాయింట్స్ పై ఒత్తిడి పడుతుంది. దానివల్ల వాపు, పాదాల నొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. అంతేకాదు పట్టీలను పెట్టుకోవడం వల్ల మహిళల్లో పీరియడ్ సమస్యలు, హార్మోన్ల అసమతుల్యత వంటి వాటినుంచి ఉపశమనం దక్కుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి..

ఆయుర్వేద నిపుణుల ప్రకారం… వెండి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. వెండి పట్టీలు.. శరీరాన్ని అనేక రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతాయి. ఈ లోహం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది.

ఆభరణం మాత్రమే కాదు..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వెండి ఆభరణాలు చంద్రుడు, శుక్రుడితో సంబంధం కలిగి ఉంటాయి. చంద్రుడు మనసుకు ప్రశాంతతనిస్తాడు. శుక్రుడు ప్రేమ, అందం, కళలు, వైవాహిక సుఖానికి కారణం. వెండి గొలుసులు ధరించడం వల్ల ఈ గ్రహాలు బలపడతాయి. అవి వైవాహిక జీవితంలో మాధుర్యం, శ్రేయస్సును తీసుకువస్తాయి. 

వెండి గొలుసులు కేవలం ఆభరణాలే కాదు.. అవి భారతీయ సంస్కృతిలో లోతైన సంప్రదాయంలో భాగం. దీని వెనుక మత విశ్వాసాలు, శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అవి మహిళల అందాన్ని పెంచడమే కాకుండా, ఆరోగ్యం, అదృష్టాన్ని కూడా తీసుకువస్తాయి.