రాఖీ కట్టడానికి వచ్చాను...లేరా తమ్ముడూ..: ఓ సోదరి కన్నీటి వీడ్కోలు
సిరిసిల్ల : అక్కా తమ్ముళ్లు అనురాగాలు, అన్న చెల్లెల్ల ఆప్యాయతల పండగే రక్షాబంధన్. ఒకే తల్లి కడుపున బిడ్డలు ప్రేమానురాగాలతో జరుపుకునే ఈ పండక్కి ముందురోజు ఓ కుటుంబంలో విషాదం నెలకొంది.
సిరిసిల్ల : అక్కా తమ్ముళ్లు అనురాగాలు, అన్న చెల్లెల్ల ఆప్యాయతల పండగే రక్షాబంధన్. ఒకే తల్లి కడుపున బిడ్డలు ప్రేమానురాగాలతో జరుపుకునే ఈ పండక్కి ముందురోజు ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. వ్యవసాయ పనుల కోసం పొలానికి వెళ్ళిన రైతు ప్రమాదవశాత్తు బావిలోపడి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో అతడికి రాఖీ కట్టేందుకు వచ్చిన సోదరి 'రాఖీ కట్టడానికి వచ్చాను... లేరా తమ్ముడూ' అంటూ గుండె పగిలేలా ఏడవడం అందరిచేత కన్నీరు పెట్టిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన అన్నమనేని నర్సింలు(37) కౌలు రైతు. గత బుధవారం కౌలుకు తీసుకున్న పొలంలో నీళ్లు పారించడానికి వెళ్లాడు. ఒంటరిగా వున్న అతడు వ్యవసాయ బావి వద్ద నడుచుకుంటూ వెళుతుండగా ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడు. ఈ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో నర్సింలు నీటమునిగి మృతిచెందాడు. రాత్రి అయినా అతడు ఇంటికిరాకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు చుట్టుపక్కలంతా వెతికారు. ఉదయం పొలంవద్దకు వెళ్లిచూడగా బావిలో మృతదేహం కనిపించింది. అయితే అప్పటికే రాఖీ కట్టేందకు పుట్టింటికి వచ్చిన సోదరి రాజవ్వ సోదరుడి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించింది.