వీడు మహా ముదురు... ఏకంగా జైల్లోనే దొంగతనం పాఠాలు
పెద్దపల్లి : జైల్లో పెడితే జీవితం విలువ తెలిసివస్తుందని నేరగాళ్లకు శిక్ష విధిస్తుంటారు.
పెద్దపల్లి : జైల్లో పెడితే జీవితం విలువ తెలిసివస్తుందని నేరగాళ్లకు శిక్ష విధిస్తుంటారు. కానీ ఇలా జైలుకు వెళ్లివచ్చిన తర్వాతే కొందరు ప్రొపెషన్ నేరగాళ్లుగా మారుతున్నారు. జైల్లో తోటి ఖైధీల నుండి నేరాలు చేయడం ఎలాగో నేర్చుకుంటూ వాటిని బయటకు వచ్చిన తర్వాత అమలుచేస్తున్నారు. ఇలా జైల్లో దొంగతనం పాఠాలు నేర్చి బయటకువచ్చిన తర్వాత వరుసగా చోరీలకు పాల్పడుతున్న ఓ కరుడుగట్టిన దొంగ పెద్దపల్లి పోలీసులకు పట్టుబడ్డాడు. రామగుండం పోలీస్ కమీషనర్ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ కు చెందిన పవన్ 2022 లో ఓ కేసులో జైలుకు వెళ్లాడు. ఆ సమయంలో అతడు మిగతా ఖైధీల ద్వారా సులువుగా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకున్నాడు. జైలునుండి విడుదలయ్యాక పగటిపూట తాళం వేసిన ఇళ్లను గుర్తించి రాత్రి దొంగతనాలకు పాల్పడేవాడని డిసిపి తెలిపారు. ఇటీవల వాహనాల తనిఖీ చేస్తున్న పోలీసులకు పవన్ చిక్కాడని... అతడివద్ద రూ.12 లక్షల నగదుతో పాటు 102 గ్రాముల బంగారం, 945 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు రామగుండం సిపి తెలిపారు.