Asianet News TeluguAsianet News Telugu

భారత సామాజిక విప్లవ పితామహుడు మహాత్మా జ్యోతిబా ఫూలే

భారతదేశంలో బ్రిటీష్ పాలనకు మద్దతు ఇచ్చిన వారిలో కూడా కొందరు.. భారతీయ ప్రజల ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛ కోసం పరోక్షంగా బలాన్ని అందించారు.

First Published Aug 14, 2022, 3:53 PM IST | Last Updated Aug 14, 2022, 3:53 PM IST

భారతదేశంలో బ్రిటీష్ పాలనకు మద్దతు ఇచ్చిన వారిలో కూడా కొందరు.. భారతీయ ప్రజల ఆత్మవిశ్వాసానికి, స్వేచ్ఛ కోసం పరోక్షంగా బలాన్ని అందించారు. వారిలో మరచిపోలేని పేరు మహాత్మా జ్యోతిబా ఫూలే.భారత సామాజిక విప్లవ పితామహుడిగా పేరొందిన మహాత్మా జ్యోతిబా ఫూలే.. వెనుకబడిన వర్గాల హక్కుల కోసం కృషి చేసిన తొలితరం వారిలో ఒకరు. జ్యోతిబా ఫూలే, ఆయన భార్య సావిత్రీబాయి ఇద్దరూ మహిళా విద్యా రంగంలో మార్గదర్శకులు. జ్యోతిబా పూలేతో తనకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ.. తన మార్గదర్శకులు అని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కూడా చెప్పేవారు.  జ్యోతిబా ఫూలే 1827లో మహారాష్ట్రలోని వెనుకబడిన మాలి సామాజికవర్గానికి చెందిన దంపతులకు జన్మించారు. 

జ్యోతిబా స్కాట్ మిషన్ పాఠశాలలో పాశ్చాత్య విద్యను పొందారు. ఆయన 13 సంవత్సరాల వయస్సులో సావిత్రిని వివాహం చేసుకున్నారు. అయితే  తన బ్రాహ్మణ స్నేహితుని వివాహానికి హాజరైన సమయంలో.. జ్యోతిబాను అవమానించి వేధించారు. ఇది కుల వ్యవస్థతో జరుగుతున్న అన్యాయాల గురించి జ్యోతిబాకు తెలిసేలా చేసింది. క్రిస్టియన్ మిషనరీలు నిర్వహిస్తున్న బాలికల పాఠశాలను జ్యోతిబా సందర్శించడం అతని ప్రపంచాన్ని మరింతగా తెరిచింది. సమానత్వంపై అమెరికన్ రచయిత థామస్ పైన్ రాసిన Rights of Man చదవండం.. ఆయనలో ఆలోచనలను పెంచింది. 

నిరక్షరాస్యులైన తన భార్య సావిత్రికి జ్యోతిబా చదవడం, రాయడం నేర్పించారు. తర్వాత ఈ దంపతులు మహిళా విద్య కోసం కృషి చేశారు. పూణేలోని విష్రాంబాగ్ వాడాలో మొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. ఈ క్రమంలోనే వారు సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. స్త్రీలకు విద్యను నిషేధించే మను నియమావళిని ఉల్లంఘించినందుకు ఫూలే తండ్రి.. ఫూలేను, ఆయన భార్యను  సావిత్రిని ఇల్లు విడిచి వెళ్ళమని కోరారు. ఫూలే ముస్లిం స్నేహితులు అతనికి ఆశ్రయం ఇచ్చారు. అయితే ఆ తర్వాత కూడా జ్యోతిబా ఫూలే దంపతులు వారి మిషన్‌ను కొనసాగించార. అంటరానితనాన్ని నిర్మూలించాలని సత్యశోధక్ సమాజ్‌ను స్థాపించారు. బాల్య వివాహాన్ని బహిరంగంగా వ్యతిరేకించారు. వితంతు పునర్వివాహాన్ని సమర్థించారు. కుటుంబాలు విడిచిపెట్టిన ఆడపిల్లల కోసం వారు అనాథాశ్రమాలను ప్రారంభించారు. 

చాలా మంది వెనుకబడిన కులాల నాయకుల మాదిరిగానే.. ఫూలే కూడా తన పుస్తకం గులాంగిరిలో బ్రిటిష్ ప్రభుత్వం, క్రిస్టియన్ మిషనరీలు హిందూ కుల వ్యవస్థకు సభ్యత్వం తీసుకోనందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఫూలే మహమ్మద్ ప్రవక్తపై ఒక పుస్తకాన్ని కూడా రాశారు. వెనుకబడిన కులాలకు ఆదర్శంగా నిలుస్తూ, ఫూలే కొన్ని వ్యాపారాలను నడిపారు. 1876 నుంచి ఏడేళ్లపాటు పూణే మున్సిపల్ కమీషనర్‌గా ఉన్నారు. ఆయన 1890లో బొంబాయిలో 63 ఏళ్ళ వయసులో మరణించారు. 19వ శతాబ్దం చివరిలో మహారాష్ట్రలో బుబోనిక్ ప్లేగు మహమ్మారి  విజృంభించింది. సావిత్రీబాయి, ఆమె దత్తపుత్రుడు యశ్వంత్ బాధితుల కోసం క్లినిక్‌ను ప్రారంభించారు. ఈ క్రమంలోనే సావిత్రీబాయి తన 66వ ఏట.. 1897 మార్చి 10న వ్యాధి బారిన పడి మరణించారు.