జగన్ కి పూర్తిగా పిచ్చెక్కింది: అచ్చెన్నాయుడు | Atchennaidu Slams YS Jagan | Asianet News Telugu
బహిరంగ మార్కెట్ లో మిర్చికి డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు నష్టపోతారనే ఉద్దేశ్యంతో మిర్చికి ఇప్పటివరకూ కనీస మద్దతు ధర ప్రకటించలేదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ.. శ్రీలంక, చైనా, మలేషియా తదితర దేశాలకు మన మిర్చి ఎగుమతి అయ్యేదని, అయితే ఆయా దేశాలు సొంతంగా మిర్చి పంట సాగు చేసుకోవడం వల్ల మిర్చి ఎగుమతులు చాలా తగ్గిపోవడం వల్ల మిర్చి రేటు తగ్గిందన్నారు. కానీ, ప్రస్తుతం చైనాలో మిర్చి పంట సరిగాలేకపోవడం వల్ల మళ్లీ ఆదేశం మన మిర్చి పంటపై ఆధారపడే పరిస్థితులు ఏర్పడ్డాయని, ఫలితంగా మిర్చి ధరలు భారీగా పెరిగే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మిర్చికి కనీస మద్దతు ధర ప్రకటించినట్లైతే రైతులు పెద్ద ఎత్తున నష్టపోయే అవకాశం ఉన్నందున, ప్రభుత్వం ఇప్పటి వరకూ మిర్చి పంటకు కనీస మద్దతు ధర ప్రకటించలేదని మంత్రి తెలిపారు. లాభదాయకత ను దృష్టిలో పెట్టుకుని రైతులు కొంతమంది పత్తి, మొక్కజొన్న, కందులు తదితర ప్రత్యామ్నాయ పంటలు వైపు మారటం వల్ల ఈ ఏడాది దాదాపు 2 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు తగ్గిందన్నారు. ఈ సందర్భంగా మాజీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పించారు.