Asianet News TeluguAsianet News Telugu

క్రైమ్ రౌండప్: సతీశ్ కేసులో వీడిన మిస్టరీ, ఎంజీఎమ్‌ కిడ్నాప్ కథ సుఖాంతం

హైదరాబాద్‌లో సంచలనం కలిగించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో స్నేహితుడు హేమంతే నిందితుడని తేలింది. తన అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడనే అక్కసుతో హేమంత్.. సతీశ్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కిడ్నాప్‌కు గురైన 7 ఏళ్ల బాలుడు యశ్వంత్‌ ఆచూకినీ పోలీసులు కనుగొన్నారు. ఇంకా మరిన్ని క్రైమ్ వార్తలు మీకోసం

this week crime roundup
Author
Hyderabad, First Published Sep 8, 2019, 1:06 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీష్ హత్య కేసులో వీడిన మిస్టరీ

హైదరాబాద్‌ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ హత్య కేసులో మిస్టరీ వీడింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉండటంతో పాటు ఆర్ధిక కారణాలతో అతని మిత్రుడు హేమంతే.. సతీశ్‌ను హతమార్చినట్లు  పోలీసులు ధ్రువీకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని మీడియా ముందు ప్రవేశపెట్టి.. హత్య జరిగిన తీరును వెల్లడించారు. 

ప్రకాశం జిల్లా మార్టురుకు చెందిన మైలా సతీశ్ బాబు నగరానికి వచ్చి అమీర్‌పేటలో క్యాపిటల్ ఇన్ఫో సొల్యూషన్స్ పేరుతో ఐటీ శిక్షణా కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు. భార్య ప్రశాంతి, కుమార్తెతో కలిసి మూసాపేటలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భీమవరానికి చెందిన పాత మిత్రుడు హేమంత్‌.. సతీశ్‌ను కలిసి ఏదైనా ఉద్యోగం చూడమని చెప్పాడు. దీంతో తన సంస్థలో చేర్చుకోవడంతో పాటు... కేపీహెచ్‌బీ కాలనీలో ఏర్పాటు చేసిన మరో కన్సల్టెన్సీకి హేమంత్‌ను హెడ్గా నియమించాడు. 

ఇదే సమయంలో సతీశ్ బాబు దగ్గర ట్రైనింగ్ తీసుకున్న ప్రియాంకకు అక్కడే ఉద్యోగం ఇచ్చాడు. ఈ క్రమంలో ప్రియాంక, హేమంత్‌ల మధ్య సాన్నిహిత్యం పెరిగి... వివాహేతర సంబంధానికి దారి తీసింది. దీంతో అతను ఆఫీసుకు దగ్గరలోనే అద్దె ఇల్లు తీసుకుని ప్రియాంకతో కలిసి ఉంటున్నాడు. ఈ విషయం సతీశ్‌కు తెలియడంతో ఇద్దరినీ మందలించాడు. అయినప్పటికీ హేమంత్ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో... సతీశ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

హేమంత్‌ వేతనంలో కోత పెట్టడంతో పాటు ప్రియాంకను తిరిగి హాస్టల్‌కు వెళ్లేలా చేశాడు. దీంతో సతీశ్‌పై హేమంత్ కక్ష పెంచుకున్నాడు.. సతీశ్‌ను అంతమొందించాలని ప్లాన్ వేసి.. ఆగస్టు 28న అమలు చేశాడు. మాట్లాడుకుందామని పిలిచి రాత్రి ఆఫీసు నుంచి ప్రియాంకను హాస్టల్‌ వద్ద దించాడు. అనంతరం నాలుగు బీర్లను కొనుగోలు చేసి ఇంటికి వెళ్లాడు. 

ఇద్దరు కలిసి మద్యం తాగి... జీతం, ప్రియాంక విషయాలపై సతీశ్‌తో వాగ్వాదానికి దిగాడు. అనంతరం ఇనుప సుత్తితో సతీశ్ తలపై కొట్టడంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ వెంటనే నోరు, ముక్కు మూసి సతీశ్‌ను హత్య చేశాడు హేమంత్. కేసులో తాను దొరక్కుండా ఉండేందుకు గాను.. కారులో తీసుకెళ్లి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించాడు. 

అది సాధ్యంకాకపోవడంతో అక్కడే వదిలేశాడు. 29న ఉదయం బయటికి వెళ్లి ఎలక్ట్రిక్ కట్టర్‌ను కొనుగోలు చేశాడు. మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి బయటపడేయ్యాలని నిర్ణయించుకున్నాడు. మెడ, మోకాలి భాగాలను కట్ చేశాడు. 

అయితే సతీశ్ కనిపించడం లేదనే వార్త బయటకు తెలియడం.. స్నేహితుల నుంచి ఫోన్లు రావడంతో కంగారుపడి ఇంటికి తాళం వేసి సతీశ్ భార్యను పరామర్శించడానికి వెళ్లాడు. తన భర్త కనిపించడం లేదని సతీశ్ భార్య ప్రశాంతి ఈనెల 29న మధ్యాహ్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే సతీశ్ బాబు కాల్‌డేటా సేకరిస్తే తాను దొరికిపోతానని గ్రహించిన హేమంత్ ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పోలీసుల దృష్టి అతని మీదకు వెళ్లింది.

ప్రియాంకను సైతం అదుపులోకి తీసుకుని ఆమె సాయంతో హేమంత్ ఇంటికి వెళ్లి తాళం పగులగొట్టి చూడగా సతీశ్ బాబు మృతదేహం కనిపించింది. దీంతో హేమంత్ కోసం పోలీసులు వేట సాగించారు. సెప్టెంబర్ 5వ తేది అతనిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 

వరకట్న వేధింపులకు వివాహిత ఆత్మహత్య

కడపలో వరకట్న వేధింపులకు ఓ యువతి బలైంది. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం.. వెంకటరెడ్డి పల్లె గ్రామానికి చెందిన డలాయి బాబుల్, సుబ్బమ్మల రెండో కుమార్తె హారతి నెల్లూరులో బీటెక్ చదివింది. ఈ క్రమంలో గ్రూప్స్‌కు సన్నద్ధమవుతున్న ఆమె.. మూడు నెలల క్రితం హైదరాబాద్‌కు శిక్షణ నిమిత్తం వెళ్లింది. 

అక్కడ హారతి వుంటున్న గది పక్కనే కడక వడ్డెర కాలనీకి చెందిన రామరాజు టైలర్‌గా పనిచేసేవాడు. వీరిద్దరి మధ్య పరిచయం ప్రేమగా మారింది. కానీ ఇద్దరి కులాలు వేరు కావడంతో పెద్దలు ఒప్పుకోలేదు. దీంతో ఇంట్లో వాళ్లని కాదని ప్రేమ వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత ఇద్దరు కడపకు వచ్చి కాపురం పెట్టారు. 

కొద్దిరోజుల తర్వాత నుంచి హారితికి అత్తింటి నుంచి వేధింపులు మొదలయ్యాయి. వరకట్నం తీసుకురావాలని వేధించడంతో పాటు తక్కువ కులం నుంచి వచ్చావని ఆమను సూటిపోటి పోటి మాటలు అనేవారు. భర్త సైతం కొట్టడం మొదలుపెట్టడంతో హారతి తట్టుకోలేకపోయింది. దీంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి తనను తీసుకెళ్లాలని చెప్పి నెల్లూరుకు వెళ్లిపోయింది. 

అయితే గ్రామసచివాలయ పరీక్షలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలన్నీ కడపలోనే ఉండిపోయాయి. భర్త రామరాజుకు ఫోన్ చేసి తన పత్రాలు, ఆధార్ కార్డ్ కావాలని అడిగింది. దీంతో అతను కడపకు వచ్చి తీసుకెళ్లమని చెప్పడంతో.. హారతి అత్తారింటికి వెళ్లింది. ఇదే అదనుగా భావించిన రామరాజు ఆమెను గృహ నిర్బంధంలో ఉంచాడు. 

శుక్రవారం అర్ధరాత్రి రామరాజు..హారతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరేసుకుని చనిపోయింది.. వచ్చి తీసుకెళ్లమని చెప్పాడు. దీంతో శనివారం బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు హారతి మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. 

ఇదే సమయంలో ఆమె నైటీ వెనుక వైపు సూసైడ్ నోట్ దొరికింది. అత్తమామలు, భర్త వేధింపులు తాళలేక తాను బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు రాసి వుంది. దీంతో రామరాజు, అతని తల్లిదండ్రులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ఆత్మహత్యకు ప్రేరేపించారనే కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

అక్రమ సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను చంపించిన భార్య

తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంతో ప్రియుడితో భర్తను దారుణంగా చంపించిందో భార్య. మెదక్ జిల్లా పుల్కల్ మండలం ముదిమానిక్యం గ్రామానికి చెందిన బేగరి దివాకర్ 15 ఏళ్ల క్రితం ఉపాధి కోసం కుటుంబసభ్యులతో కలిసి పటాన్ చెరు చైతన్యనగర్ కాలనీకి వచ్చి ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే సమయంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం శేరిగూడెం గ్రామానికి చెందిన మైలారం జంగయ్యతో దివాకర్‌కు పరిచయం ఏర్పడింది. 

ఇది స్నేహంగా మారడంతో జంగయ్య చిన్న చిన్న అవసరాల కోసం దివాకర్ ఇంటికి వస్తూ పోతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో దివాకర్ భార్య సురేఖతో జంగయ్యకు సాన్నిహిత్యం ఏర్పడి అక్రమ సంబంధానికి దారి తీసింది. తమ బంధంపై తన భర్తకు అనుమానం కలిగిందని సురేఖ.. జంగయ్యతో చెప్పింది. దీంతో దివాకర్ హత్యకు జంగయ్య పథకం వేశాడు. తన మిత్రులు ఆకుల పరమేశ్, ప్రకాశ్‌లను సంప్రదించి రెండు లక్షల సుపారీకి ఒప్పందం కుదుర్చుకుని.. ముందుగా 1.30 లక్షలు ఇచ్చాడు. 

పథకంలో భాగంగా ఆగస్టు 26న పరమేశ్, ప్రకాశ్‌లు దివాకర్‌కు మద్యం తాగించి.. పెద్దకంజర్ల గ్రామ శివారులో బండరాయితో దివాకర్ తలపై కొట్టి హత్య చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులు జంగయ్య, పరమేశ్, ప్రకాశ్, దివాకర్ భార్య సురేఖను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. 


ఎంజీఎంలో కిడ్నాపైనా బాలుడి ఆచూకీ లభ్యం

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కిడ్నాపైనా బాలుడి ఆచూకీ లభించింది. బాలుడిని విక్రయించేందుకే అతనిని అరెస్ట్ చేశారని పోలీసులు తెలిపారు. గత నెల 31న ఖిలా వరంగల్‌కు చెందిన జ్యోతి తన కుమారుడు యశ్వంత్‌ జ్వరంతో బాధపడుతుండటంతో ఎంజీఎంకు తీసుకొచ్చింది. ఓపీ విభాగంలో బల్లపై చిన్నారిని పడుకోబెట్టి.. వైద్యలు వద్దకు వెళ్లి వచ్చే సరికి.. యశ్వంత్ కనిపించలేదు. 

దీంతో జ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఓ మహిళ బాలుడిని తీసుకుని పరిగెత్తడాన్ని గుర్తించి ఆ ఫోటోలను మీడియాకు విడుదల చేశారు. దీనికి తోడు మీడియాలో సైతం కథనాలు ప్రసారం కావడంతో కిడ్నాపర్లు బాలుడిని వరంగల్ హెడ్ పోస్టాఫీసు దగ్గర వదిలి పారిపోయారు. 

బంధువుల సాయంతో బాలుడి ఆచూకీని తెలుసుకున్న పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితురాలిని సీకెఎం ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసే సునీతగా గుర్తించారు. ఆమె చిన్నారి యశ్వంత్‌ను రూ.2.50 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. 

ప్రియాంక కోసమే చంపాడు: టెక్కీ సతీష్ హత్యపై డీసీపీ

తన ప్రేయసితో చనువుగా సతీష్: అందుకే హేమంత్ చంపేశాడు

హేమంత్ ఒక్కడి పని కాదు: టెక్కీ సతీష్ భార్య ప్రశాంతి

టెక్కీ సతీష్ హత్య: పోలీసుల అదుపులో హేమంత్, కారణమదేనా?

టెక్కీ సతీశ్ హత్య: వీడని చిక్కుముడులు, మరిన్ని ట్విస్టులు

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య

అదృశ్యమైన వరంగల్ బాలుడి ఆచూకీ లభ్యం

Follow Us:
Download App:
  • android
  • ios