హైదరాబాద్ కూకట్‌పల్లిలో సంచలనం సృష్టించిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సతీశ్ బాబు హత్య కేసులో రోజు రోజుకి కొత్త కొత్త కోణాలు బయటపడుతున్నాయి. తన స్నేహితురాలు ప్రియాంకతో సతీశ్ క్లోజ్‌గా ఉండటాన్ని చూసి తట్టుకోలేకనే హేమంత్ అతనిని చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు.

అయితే సతీష్ కుటుంబసభ్యులు మాత్రం ఇందుకు ఆర్ధిక కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. హత్య చేసిన రోజు హేమంత్ ఇంటికి సతీశ్ వెళ్లాడని.. అక్కడ ఇద్దరూ మద్యం సేవించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

అలాగే హత్యకు ముందు రోజు ప్రియాంకను సతీశ్ హాష్టల్ వద్ద దించిన సీసీటీవీ ఫుటేజ్‌ను ఖాకీలు సేకరించారు. అయితే హాస్టల్ నుంచి సతీశ్ ఎక్కడికి వెళ్లాడనేది మిస్టరీగా మారింది. ఈ నెల 27న రాత్రి సతీశ్ నిర్వహిస్తున్న ఐటీ కంపెనీలోనే ఆయనను హేమంత్ దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు తన భర్త కనిపించడం లేదని సతీశ్ భార్య.. ఆ మరుసటి రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడానికి స్టేషన్‌కు వచ్చారు. అదే సమయంలో ఆమెతో పాటు నిందితుడు హేమంత్, మరి కొంతమంది స్నేహితులు కూడా వచ్చినట్లు తెలుస్తోంది.

అయితే 29వ తేదీ పోలీసులు సతీశ్ మృతదేహాన్ని కనుగొన్న తర్వాత హేమంత్  ఫోన్ స్విచ్ఛాప్ చేసి పరారయ్యాడు. అంతకుముందు రోజంతా సతీశ్ భార్య, మిగిలిన స్నేహితులతోనే అతను వుండి.. ఏమీ తెలియనట్లు నటించాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సతీశ్‌ను హేమంత్ ఒక్కడే హత్య చేశాడా లేక అతనికి ఇంకెవరైనా సాయం చేశారా అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. 

టెక్కీ సతీష్ హత్య కేసులో ట్విస్ట్: అక్రమ సంబంధమే కారణం

కేపీహెచ్‌బీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ దారుణహత్య