నల్గొండ: నల్గొండ జిల్లాలో శుక్రవారం నాడు దారుణం చోటు చేసుకొంది. కన్న కూతురిని తల్లిదండ్రులు, సోదరుడు కలిసి చంపేందుకు ప్రయత్నించారు. బండరాయితో  కవితపై మోదారు. తీవ్రంగా గాయపడిన బాధితురాలిని స్థానికులు నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని వెలగలగూడెంలో కవిత అనే యువతి తల్లిదండ్రులతో కలిసి ఉంటుంది. ఆమె వయస్సు 32.  ఆమె పీజీ కూడ పూర్తి చేసింది.

కవిత వివాహం చేయాలని తల్లిదండ్రులను కోరింది. అయితే వివాహం చేస్తే ఆమెకు కట్నం ఇవ్వాల్సి వస్తోందనే విషయమై కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. కవిత కుటుంబానికి ఏడు ఎకరాల భూమి ఉంది

అయితే తన వివాహం కోసం కట్నం ఇవ్వకుండా తన పేరున భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని కవిత డిమాండ్ చేసింది. అయితే ఈ విషయమై కుటుంబసభ్యులకు ఆమెకు మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో శుక్రవారం నాడు ఉదయం కవితను తల్లిదండ్రులు, సోదరుడు బండరాయితో తీవ్రంగా కొట్టారు. దీంతో ఆమె కేకలు వేసింది. స్థానికులు ఈ విషయాన్ని గమనించారు. బండరాయితో తలపై మోదడంతో కవిత తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆమెను నల్గొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

నల్గొండ ప్రభుత్వాసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. కవిత తల్లిదండ్రులు, సోదరుడు పరారీలో ఉన్నారు.