Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక బతుకమ్మ.. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి పట్టుగొమ్మ.. పండుగ పరిణామక్రమం

తెలంగాణ అస్తిత్వానికి నిలుటద్దం బతుకమ్మ. తంగేడు, గునుగు పూలతో పేర్చి తొమ్మిది రోజులు అన్ని వర్గాల మహిళలు సంబురంగా చేసుకునే ఈ పండుగ తెలంగాణకు ఒక విశిష్టత. ఈ అస్తిత్వమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ కీలక పాత్ర పోషించడానికి కారణమైంది. అన్ని వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగస్వామ్యం కావడానికి బతుకమ్మ పండుగ దోహదపడింది. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వానికి బతుకమ్మ భూమికగా నిలిచింది.
 

bathukamma festival is an indetity of telangana.. which caters as state peoples cultural heritage
Author
First Published Sep 20, 2022, 6:25 PM IST

హైదరాబాద్: తెలంగాణ అస్తిత్వానికి బతుకమ్మ ప్రతీక. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఈ గౌరమ్మ పండుగ సాంస్కృతిక ప్రాతిపదికగా నిలిచింది. ప్రపంచంలో ఎక్కడ బతుకమ్మ కనిపించినా అది తెలంగాణ సంస్కృతిలో భాగమే. ఎందుకంటే బతుకమ్మ పండుగ పుట్టింది.. పరిణమించింది తెలంగాణ నేలలోనే. తెలంగాణ చరిత్రలో.. తెలంగాణ ప్రజల జీవితాల్లో బతుకమ్మ ఒక అంతర్భాగం. అందుకే బతుకమ్మను తలుచుకుంటున్నామంటే.. తెలంగాణ చరిత్రను, అది అందించిన వారసత్వాన్ని కొనసాగిస్తున్నట్టు అర్థం.

నైజాం నుంచి విముక్తి పొందిన హైదరాబాద్ సంస్థానం ఆ తర్వాత ఆంధ్రలో విలీనం అయిన సంగతి తెలిసిందే. ఆంధ్ర నుంచీ తెలంగాణ అస్తిత్వానికి జరిగిన పోరాటానికి చరిత్రలో ప్రముఖ స్థానం ఉన్నది. అస్తిత్వం కోసం జరిగిన పోరాటాల్లో ఇది ప్రధానమైనది. నిధులు, నియామకాలు, నీళ్లు వంటి ఆర్థిక కారణాలతోపాటు రాజకీయం, సంస్కృతి, ఇతర అనేక రంగాల్లోని అస్తిత్వం తెలంగాణ ప్రజలను పోరాటానికి మేల్కొలిపాయి. ఈ ఉద్యమంలో సాంస్కృతిక ఉద్యమ కేంద్రంగా బతుకమ్మ గణనీయమైన పాత్ర పోషించింది. సబ్బండ వర్ణాలను ఏకం చేయడంలో సఫలమైంది. ముఖ్యంగా అన్ని వర్ణాల మహిళలను ఏకతాటి మీదకు తేగలిగింది. బతుకమ్మ ఆట.. ఒక ఆందోళన రూపాన్ని సంతరించుకుంది. అందుకే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బతుకమ్మను అధికారిక పండుగగా గుర్తించారు.

ఈ అమావాస్య రోజున బతుకమ్మ పండుగ సంబురాలు రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్నాయి. ఎంగిలి పూల బతుకమ్మతో మొదలై.. తొమ్మిది రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. సద్దుల బతుకమ్మ నాడు ఊరి ఆడపడచులంతా తమ తమ వీధుల్లో బతుకమ్మ ఆడుకుని నీటిలో నిమజ్జనం చేయడానికి బతుకమ్మను ఎత్తుకుని వెళ్లుతారు. అక్కడే కాసేపు బతుకమ్మ ఆడుకుని ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అనంతరం సద్దుల నైవేధ్యాన్ని పంచుకుంటారు. తంగేడు, గునుగు పూలు బతుకమ్మ పేర్చడంలో ప్రముఖంగా ఉంటాయి.

తెలంగాణ పండు పుట్టుక గురించి చాలా రకాల వృత్తాంతాలు ప్రచారంలో ఉన్నాయి. సుమారు వేయి సంవత్సరాల క్రితం పాలకులు ఇప్పటి వేములవాడలో లింగం రూపంలో కొలువైన శివుడిని తంజావూరుకు తరలించినట్టు చరిత్ర చెబుతున్నది. ఇక్కడ దోచుకున్న సొమ్ముతోనే అక్కడ బృహదీశ్వరాలయాన్ని నిర్మించినట్టు భావిస్తుంటారు. వేములవాడలోని శివలింగాన్ని పార్వతి నుంచి వేరు చేసి తంజావూరుకు తరలించడం మూలంగా స్థానిక ప్రజలు కలత చెందారు. పార్వతికి మరో పేరైన బృహదమ్మ నుంచి శివుడిని వేరు చేశారని ఆ పాలకులకు తెలియజేయడానికి పూవులను పేర్చి బతుకమ్మను స్థానికులు నిర్వహించారని, అదే కాలక్రమంలో బతుకమ్మగా మారిందని పేర్కొంటారు. బృహదమ్మనే బతుకమ్మగా మారిందని చెబుతుంటారు.

మరో వృత్తాంతం నైజాముల పాలనా కాలానికి చెందినది. నైజాం పాలనలో ఇక్కడి ప్రజలు ముఖ్యంగా మహిళలు ఎంతో క్షోభ అనుభవించారని, మానసిక వేదనలతోనూ బలవన్మరణాలకు పాల్పడేవారని పేర్కొంటారు. తోటి ఆడపడచుల ఆత్మహత్యలకు చలించి ఇతర మహిళలు వారిని చూసుకుంటూ బతుకమ్మను పేర్చేవారని, బ్రతకవమ్మా అనే మాటనే బతుకమ్మగా స్థిరపడిందని చెబుతుంటారు.

సంతానం కోసం చేసే పండుగగా ఈ బతుకమ్మ పుట్టిందనే వాదనలూ ఉన్నాయి. కానీ, ఈ వాదనలను పెద్దగా విశ్వసించరు. అయితే, మహిళల ఆరోగ్యానికి అవసరమైన ఆహారపదార్థాలే ఈ తొమ్మిది రోజుల్లో నైవేధ్యంగా ఉండటం గమనార్హం.

ఇంకొందరి వాదనలు ఇందుకు భిన్నంగా.. ఈ పండుగ కొందరి ఆట విడుపు కోసం ఏర్పడిందని, తొలుత ఈ పండుగ తెలంగాణ గడీల్లో మాత్రమే ఉండేదని చెబుతుంటారు. ఉన్నత వర్ణాల వారే ఈ బతుకమ్మ ఆడుగా.. మిగతా కులాల మహిళలు దూరంగా ఉండేవారని, అందుకే చీరచెంగులు విరబోసుకునే వారు మాత్రమే ఈ ఆడుతారనే ఓ నిబంధన అనధికారికంగా అమల్లో ఉండేదని వాదిస్తుంటారు. నిమ్న వర్ణాల మహిళలు.. ఎక్కువగా శ్రమలో కాలం గడిపే వీరు చీర చెంగులు విరబోసేవారు కాదని పేర్కొంటారు.

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ముందు వరకూ చాలా గ్రామాల్లో ఇదే తీరు ఉండేది. కానీ, ఉద్యమ కాలానికి బతుకమ్మ పండుగ గుణాత్మక మార్పునకు లోనైంది. అంతకు ముందు ఉన్న అడ్డుగోడలు బద్ధలయ్యాయి. గౌరమ్మ అందరి ఇళ్లలో ప్రత్యక్షమైంది. ఎక్కువ, తక్కువ అనే తేడా లేకుండా అన్ని వర్గాల మహిళలను బతుకమ్మ ఏకం చేసింది. తెలంగాణ అస్తిత్వం కోసం వారంతా పోరుబట పట్టారు. సబ్బండ వర్ణాలు, వర్గాలు ఉద్యమంలో మమేకం కావడానికి ఈ పండుగ కూడా దోహదపడింది.

Follow Us:
Download App:
  • android
  • ios