Asianet News TeluguAsianet News Telugu

తిమ్మిని బమ్మిని చేసిన ట్రేసవుట్.. భాగ్యనగర సైబర్ పోలీస్ స్పెషాలిటీ

సైబర్ నేరాలను అరికట్టేందుకు సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాటు చేసిన సైబర్‌ ప్రయోగశాలలు సత్ఫలితాలిస్తున్నాయి. దేశంలోనే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వీటిల్లో అందుబాటులోకి తేవడంతో సైబర్‌,  కార్పొరేట్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు వీలవుతోంది.  

Cyber crimes trace out by Hyderabad Cyber Police research
Author
Hyderabad, First Published Aug 5, 2019, 3:10 PM IST

సైబర్, కార్పొరేట్ నేరాల్లో పత్రాలను సమూలంగా మార్చేసి.. అసలు పత్రాలను మాయం చేసినా పోలీసులు, దర్యాప్తు సంస్థలు బయట పెట్టేస్తున్నారు. బ్యాంకుల్లో ఆన్‌లైన్‌ ద్వారా ఖాతాలు నిర్వహించే విద్యావంతులు.. నిరక్ష్యరాస్యులు కూడా సైబర్‌ నేరాల బారీన పడుతున్నారు. వీరిలో కొందరినైనా రక్షించేందుకు, నిందితులను అరెస్ట్‌ చేసేందుకు హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఏర్పాటుచేసిన ‘సైబర్‌ క్రైమ్‌ ప్రయోగశాలలు’ సత్ఫలితాలు ఇస్తున్నాయి‌. 

బ్యాంకు ఖాతాల్లోంచి నగదు స్వాహా.. ఫోన్లతో వేధించి సిమ్‌ కార్డులను ధ్వంసం చేయడం.. కార్పొరేట్‌ రహస్యాలను ప్రత్యర్థి కంపెనీలకు ఇచ్చి హార్డ్‌డిస్క్‌లను చెరిపేయడం వంటి నేరాల్లో నిందితులను పట్టుకునేందుకు అందుబాటులో ఉన్న మూడు సైబర్‌ ప్రయోగశాలలు వేగంగా పనిచేస్తున్నాయి. 

ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాలతో పోలిస్తే సైబర్‌ ల్యాబ్స్‌కన్నా ఆధునిక సమాచార పరిజ్ఞానం వీటి సొంతం. దేశంలోనే సైబర్‌ నేరాలు నమోదవుతున్న నగరాల్లో హైదరాబాద్‌ తొలి ఐదు స్థానాల్లో ఉండడంతో పోలీస్‌ ఉన్నతాధికారులు వీటికి అడ్డుకట్ట వేసేందుకు సైబర్‌ ల్యాబ్స్‌ను ఏర్పాటు చేశారు.

హైదరాబాద్‌లో నాలుగేళ్లుగా సైబర్‌ నేరాలు క్రమంగా పెరుగుతున్నాయి. నైజీరియన్‌ మోసాలతో జనం రూ.లక్షల్లో నష్టపోతున్నారు. జార్ఖండ్‌ మాయగాళ్ల వలలో పడి డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వివరాలు చెప్పి రూ.వేలల్లో పోగొట్టుకుంటున్న అమాయకులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త సైబర్‌ ప్రయోగశాలలకు పోలీస్‌ ఉన్నతాధికారులు శ్రీకారం చుట్టారు. 

అత్యాధునిక సమాచార పరిజ్ఞానంతో కూడిన వీటిని ఏర్పాటుకు రూ.20 కోట్లు వ్యయం చేశారు. సోషల్ మీడియా వేదికల నుంచి కంపెనీలు, కార్పొరేట్‌ నేరాలు, సంచలన నేరాల పరిశోధనలను ప్రయోగశాలల్లో సులభంగా చేయనున్నారు.

దేశంలోనే సైబర్‌ నేరాలు  ఢిల్లీ, ముంబైల్లో ఎక్కువగా నమోదవుతున్నాయి. నేరస్థులను గుర్తించేందుకు ఈ రెండు నగరాల్లో క్రైమ్‌ బ్రాంచ్‌కు బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీ, ముంబైలలో నేర పరిశోధన విభాగంలో విధులు నిర్వహిస్తున్న సీనియర్‌, జూనియర్‌ స్థాయి అధికారులను ఎంపిక చేసి వారికి ఐటీ పరిజ్ఞానంలో శిక్షణ ఇప్పించారు. దీనిపై పట్టు ఉన్న పోలీస్‌ అధికారులనూ ఈ విభాగంలో నియమించారు. 

ఫేస్‌బుక్‌ ద్వారా వేధింపులు, నైజీరియన్ల పెళ్లిళ్ల మోసాలు, బీమా పాలసీలకు బోనస్‌లు, క్రెడిట్‌, డెబిట్‌కార్డుల నంబర్ల తస్కరణ వంటి అంతర్జాల ఆధారిత నేరాలను వీరు కేవలం గంటల్లోనే గుర్తిస్తున్నారు. మోసగాళ్ల సిమ్‌కార్డుల నంబర్ల ద్వారా వేగంగా వారు ఉన్న ప్రాంతాలను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను పంపుతున్నారు. 

ఢిల్లీలో కార్పొరేట్‌ నేరాలు, మోసాలకు సంబంధించిన కేసుల్లో నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక ప్రయోగశాల ఉంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లలో హార్డ్‌డిస్క్‌లు, సిమ్‌కార్డుల్లోని డేటాను విశ్లేషించగల ప్రత్యేక పరిజ్ఞానం ఈ ప్రయోగశాలల సొంతం.

నేరం చేసిన ఆధారాలున్నా.. నిందితుల గుర్తింపు మరో సవాల్‌. ఫేస్‌బుక్‌ ద్వారా వేధింపులు, బెదిరింపులకు పాల్పడుతున్న నిందితులను గంటల్లో గుర్తించడమంటే కష్టం. కొందరు ఫేస్‌బుక్‌ ఖాతాలను తమపేర్లతో కాకుండా మారుపేర్లు, ఫోటోలతో నిర్వహిస్తున్నారు. దీంతోపాటు తప్పుడు మెయిల్‌ఖాతాలను కూడా జత చేస్తున్నారు. 

ఫలానా సమయంలో ఫేస్‌బుక్‌ను ఎక్కడ వినియోగించారో తెలుసుకుని నేరుగా అక్కడి వెళ్లి ఎన్ని మారుపేర్లు వినియోగించినా సరే నిందితుడిని పట్టుకోవచ్చు. సైబర్‌ నేరస్థులు వినియోగిస్తున్న ఫోన్‌ నంబర్లు, వారి కాల్‌డేటా రికార్డులు వేగంగా తెలుసుకునే పరిజ్ఞానం ఈ ప్రయోగశాలలో ఉంది. ఒకే ఒకసారి నేరస్థులు ఫోన్‌లో మాట్లాడితే చాలు... దాని ఆధారంగా వారు దేశంలో ఎక్కడున్నా గుర్తించి ఆయా ప్రాంతాల్లో పోలీసులను అప్రమత్తం చేసి వారిని అదుపులోకి తీసుకోనున్నారు.

సైబర్ నేరాల్లో ఆధారాలు చాలా కీలకం. సంఘటనా స్థలాల్లో ఎన్ని సాక్ష్యాలను సేకరించ గలుగుతారో.. నిందితులను అంతే వేగంగా గుర్తించేందుకు వీలవుతుంది. సైబర్‌ నేరాలతో పాటు హత్యలు, దొంగతనాలు, ఇతర నేరాలకు సంబంధించిన కేసుల పరిశోధనకు అవసరమైన సమాచార సాంకేతిక పరిజ్ఞాన పరికరాలు ఈ ప్రయోగశాలలో ఉన్నాయి. 

హత్య, దొంగతనం వంటి నేరాల్లో నిందితులను గుర్తించేందుకు త్రీడీ-ఇమేజింగ్‌ కెమెరా, చేతులు, కాళ్లకు తొడుగులు ధరించి బంగారు ఆభరణాలు దొంగతనాలు చేసే దొంగలను గుర్తించేందుకు మరో కెమెరా, హత్యలు చేసి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేసినా.. చిన్నవెంట్రుక ముక్క.. రక్తపు బొట్టు లభించినా పరిశోధించే కెమెరాలు ఆధారాల బృంద ప్రయోగశాలలో ఉన్నాయి. వీటిని ఏ సమయంలో ఎలా ఉపయోగించాలన్న అంశాలపై క్లూస్‌టీం బృందాల్లో సభ్యులకు శిక్షణ ఇప్పించారు.

తెలివైన నేరస్థులు పోలీసులకు దొరక్కుండా ఆధారాలన్నీ నాశనం చేస్తున్నారు. కాగితాలపై ఉన్న లావాదేవీలు తెలియకుండా చేసేందుకు ముక్కలు చేసి చెత్తలో వేసి వేగంగా నీళ్లు కొట్టేస్తున్నారు. హార్డ్‌డిస్క్‌లు, సిమ్‌కార్డులు, బ్యాంకు ఖాతాల్లో నగదు బదిలీలతో పాటు కొందరు నేరగాళ్లు దస్తావేజులను నకిలీవి రూపొందించి వారికి అనుకూలంగా మార్చుకుంటున్నారు. వీటన్నింటి గుట్టును రికవరీ ప్రయోగశాల ఛేదించనుంది.

హార్డ్‌డిస్క్‌లు, సిమ్‌ కార్డులను ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా విశ్లేషిస్తే.. అందులోని వివరాలన్నీ పోలీసులకు తెలిసిపోతాయి. హార్డ్‌డిస్క్‌లలో సమాచారాన్ని చదివేందుకు పోలీసులు రైట్‌బ్లాక్‌ అనే పరికరాన్ని వినియోగించనున్నారు. 

అత్యాధునిక ఇన్ఫ్రారెడ్‌ స్పెక్ట్రమ్‌ ద్వారా దస్తావేజుల అసలు స్వరూపంతోపాటు నకిలీ కరెన్సీని కూడా గుర్తించే వీలుంది. ఈ దస్తావేజులను ఎప్పుడు కొనుగోలు చేశారు? ఎవరు రాశారు? పాత తేదీల్లో దస్తావేజులు ఉన్నా అప్పడు రాసిన వారు వినియోగించిన సిరా ఆధారంగా కొత్తగా దస్తావేజులు సృష్టించిన వారి బండారం బయటపడుతుంది.

Follow Us:
Download App:
  • android
  • ios