టీం ఇండియా యువ క్రికెటర్ రిషబ్ పంత్.... టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డు బద్దలు కొట్టాడు. వికెట్ కీపింగ్ లో ధోనీ వారసుడిగా పేరు తెచ్చుకుంటున్న పంత్.... అప్పుడే ధోనీ రికార్డుని బ్రేక్ చేయడం విశేషం. 

టీ20ల్లో భారత్ తరఫున ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు బాదిన వికెట్‌కీపర్‌గా ధోనీ పేరిట ఉన్న రికార్డును అతడు అధిగమించాడు. నిన్న వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 65 పరుగులు సాధించి ఈ ఘనత సాధించాడు. 2017లో ఇంగ్లాండ్‌పై ధోనీ చేసిన 56 పరుగులే భారత వికెట్‌ కీపర్‌ అత్యుత్తమ స్కోరుగా గతంలో ఉండేది.

వెస్టిండీస్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో నిరాశ పరిచిన పంత్ ఆఖరి టీ20లో అదరగొట్టాడు. 42 బంతుల్లో అజేయంగా 65 పరుగులు సాధించాడు. నిన్న జరిగిన మ్యాచ్‌లో తొలుత వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 146 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 27 పరుగులకే ఓపెనర్లను కోల్పోయింది. కోహ్లీ (59), పంత్ కలిసి మూడో వికెట్‌కు 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. దీంతో టీమిండియా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 సిరీస్‌ను భారత్‌ 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసింది. గురువారం నుంచి వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.