హోం గ్రౌండ్...సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన జరిగిన  మ్యాచ్ లో పుణేరీ పల్టాన్స్ అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ సీజన్లో వరుస విజయాలతో దూసుకుపోతూ పాయింట్స్ పట్టికలో టాప్ లో నిలిచిన బెంగళూరు బుల్స్ ని పూణే మట్టికరిపించింది. ఇలా శివ్ చత్రపతి స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన చివరి మ్యాచ్ లో పూణే విజేతగా నిలిచింది. కేవలం 4 పాయింట్ల తేడాతో బుల్స్ ఓటమిని చవిచూసింది. 

పుణేరీ పల్టాన్ డిఫెండర్స్ ఈ మ్యాచ్ లో అదరగొట్టారు. రైడింగ్  బెంగళూరు 30పాయింట్లలో ఆధిక్యాన్ని ప్రదర్శించగా పూణే 19  పాయింట్లకే  పరిమితమయ్యింది. ఇలా రైడింగ్  లో వెనుకబడ్డా  ట్యాకిల్స్ లో ఆతిథ్య జట్టు తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఈ విషయంలో  బుల్స్ టీం 6 పాయింట్లు మాత్రమే సాధించగా పల్టాన్స్ 17 పాయింట్లు  సాధించింది.  ఇక  పుణే ఆలౌట్ల ద్వారా 4, ఎక్స్‌ట్రాల రూపంలో 3 ఇలా మొత్తం 42పాయింట్లు సాధించగా  బుల్స్ ఆలౌట్ల ద్వారా 2 ఎక్స్‌ట్రాల రూపంలో 1తో మొత్తం 38 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో నాలుగు పాయింట్ల తేడాతో స్థానిక జట్టు విజయం సాధించింది. 

పూణే ఆటగాళ్లలో పంకజ్ 17 పాయింట్లతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అలాగే సాగర్ 7, సుర్జీత్ 6, హదీ 2, దర్శన్ 2 పాయింట్లతో జట్టు  విజయంలో  తమ వంతు పాత్ర పోషించారు. బెంగళూరు ఆటగాళ్లలో రోహిత్ 14, పవన్ 12 పాయింట్లతో రాణించినా ఫలితం లేకుండా పోయింది.