Asianet News TeluguAsianet News Telugu

IPL 2024 : హార్దిక్ పాండ్యా దెబ్బ‌కు ముంబై ఇండియ‌న్స్ ప్లేఆఫ్ ఆశ‌లు గ‌ల్లంతు..

MI vs KKR : ఐపీఎల్ 2024 51వ మ్యాచ్ లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ త‌ల‌ప‌డ్డాయి. ముంబైని కోల్ క‌తా చిత్తుగా ఓడించింది. దీంతో ముంబై జ‌ట్లు 8వ ఓట‌మిని చ‌విచూసింది. 
 

MI vs KKR: Hardik Pandya's blow destroys Mumbai Indians' playoff hopes, IPL 2024 RMA
Author
First Published May 4, 2024, 3:46 PM IST

Mumbai Indians : ఐపీఎల్ 2024 51వ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, ముంబై ఇండియన్స్ తలపడ్డాయి. ఇందులో శ్రేయాస్ అయ్యర్ నేతృత్వంలోని కేకేఆర్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు 169 పరుగులకు ఆలౌటైంది. కెకెఆర్ తరఫున వెంకటేష్ అయ్యర్ 70 పరుగులతో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. 170 ప‌రుగుల‌ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబై ఇండియన్స్ బ్యాట్స్‌మెన్ ఓవర్లు మొత్తం ఆడకుండానే 145 పరుగులకే కుప్పకూలారు. ముంబై తరఫున సూర్యకుమార్ యాదవ్  హాఫ్ సెంచరీ చేసినా అది విజయానికి సరిపోలేదు. సూర్య‌ 56 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఈ సీజన్‌లో కేకేఆర్‌కి ఇది 7వ విజయం కాగా, ముంబై జట్టు 11 మ్యాచ్‌ల్లో 8వ మ్యాచ్‌లో ఓడిపోయింది.

కేకేఆర్ బౌలింగ్‌తో ముంబై తడబడింది..

కోల్‌కతా బౌలర్లు అద్భుతంగా రాణించి 170 పరుగుల ఛేదనకు దిగిన ముంబైని కేకేఆర్ బౌలింగ్ తో క‌ట్ట‌డి చేసింది. రూ. 24.75 కోట్ల విలువైన ఐపీఎల్‌లో అత్యంత ఖరీదైన ఆటగాడు మిచెల్ స్టార్క్ అద్భుతంగా బౌలింగ్ చేసి నలుగురు బ్యాట్స్‌మెన్‌లను పెవిలియ‌న్ కు పంపి కేకేఆర్ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. 3.5 ఓవర్లలో 33 పరుగులు ఇచ్చాడు. ఇషాన్ కిషన్ (13 పరుగులు), టిమ్ డేవిడ్ (24 పరుగులు), పీయూష్ చావ్లా (0 పరుగులు), గెరాల్డ్ కోయెట్జీ (8 పరుగులు)లను స్టార్క్ వికెట్ల‌ను తీసుకున్నాడు. స్టార్క్‌తో పాటు వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ తలో 2 వికెట్లు తీశారు.

సూర్యకుమార్ హాఫ్ సెంచ‌రీ వృథా.. 

కేకేఆర్ ఇచ్చిన 170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ముంబైకి మంచి ఆరంభం ల‌భించ‌లేదు. సూర్యకుమార్ యాదవ్ మినహా మిగతా టాప్ ఆర్డర్ జట్టు పూర్తిగా ఫ్లాప్ అయింది. ముంబై స్కోరు 71 ప‌రుగుల‌ వద్ద 6 వికెట్లు పడిపోయాయి. రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా వంటి డెడ్లీ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌లో కూర్చున్నారు. సూర్యకుమార్ యాదవ్ ఒకవైపు కచ్చితంగా క్రీజులో నిలిచినా అత‌ని ఇన్నింగ్స్ ముంబైకి విజ‌యాన్ని అందించ‌లేదు. సూర్య తన వ్యక్తిగత స్కోరు 56 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అతడికి తోడు టిమ్ డేవిడ్ 24 పరుగులు చేశాడు. మిగతా బ్యాట్స్‌మెన్‌లు పూర్తిగా ఫ్లాప్‌ అయ్యారు. ముంబై జట్టు 18.5 ఓవర్లలో 145 పరుగులకు ఆలౌటైంది.

వెంకటేష్ అయ్యర్ అద్భుత ఇన్నింగ్స్.. 

తొలుత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌ జట్టు ఒక్కసారిగా తడబడగా.. 57 పరుగులకే 6 మంది బ్యాట్స్‌మెన్‌లు పెవిలియన్‌కు చేరుకున్నారు. వెంకటేష్ అయ్యర్ క్రీజులో కొనసాగుతూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా బ్యాటింగ్‌కు వచ్చిన మనీష్ పాండేతో కలిసి ఏడో వికెట్‌కు అర్ధసెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టును గౌరవప్రదమైన స్కోరుకు తీసుకెళ్లాడు. 52 బంతులు ఎదుర్కొన్న వెంకటేష్ 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 70 పరుగులు చేయగా, మనీష్ పాండే 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 పరుగులు చేశాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌తో సహా జట్టులోని మిగతా బ్యాట్స్‌మెన్లు ఫ్లాప్ అయ్యారు.

ప్లేఆఫ్ కే చేరువ‌గా కేకేఆర్

ఈ మ్యాచ్ విజయంతో కేకేఆర్ 14 పాయింట్లు సాధించింది. 10 మ్యాచ్‌ల్లో కేకేఆర్‌ జట్టుకు ఇది 7వ విజయం. ప్లేఆఫ్ రేసులో ప్రవేశించేందుకు జట్టు ఇప్పటికే ముందుంది. ఇక్కడి నుంచి ప్లేఆఫ్‌కు కేకేఆర్ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని ముంబై ఇండియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించే దశలో ఉంది. ముంబై 11 మ్యాచ్‌లు ఆడగా 8 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. మిగిలిన మూడు మ్యాచ్‌లు గెలిచినా.. 12 పాయింట్లతో ప్లేఆఫ్‌లోకి ప్రవేశించడం అసాధ్యం. దీంతో ముంబై అభిమానుల్లో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ ఇచ్చి ముంబై ఫ్రాంఛైజీ త‌ప్పు చేసింద‌ని పేర్కొంటున్నారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios