సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన చివరి లీగ్ మ్యాచ్ గుజరాత్ ఫార్చూన్ జాయింట్స్ ఓటమిపాలయ్యింది. జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో కేవలం 3 పాయింట్ల తేడాతో ఆ జట్టు ఓటమిని చవిచూసింది. చివరివరకు నువ్వా నేనా అన్నట్లుగా ఉత్కంఠ మధ్య  సాగిన ఈ మ్యాచ్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇరు జట్లూ చిరవరకు ఓటమిని అంగీకరించకుండా చూపించిన పోరాటపటిమ అభిమానులను కట్టిపడేసింది. 

పింక్ పాంథర్స్ జట్టు రైడింగ్ లో 9, ట్యాకిల్స్ లో 13  ఇలా మొత్తం 22  పాయింట్లు సాధించింది. కానీ గుజరాత్ రైడింగ్ లో 8, ట్యాకిల్స్ లో 9, ఎక్స్ ట్రాల ద్వారా మరో 2 మొత్తం 19 పాయింట్లు మాత్రమే సాధించగలిగింది. దీంతో 3 పాయింట్ల తేడాతో గుజరాత్ ఓటమిపాలయ్యింది. 

జైపూర్ ఆటగాళ్లలో  దీపక్ నివాస్ 7 పాయింట్లతో ఆకట్టుకున్నాడు. అలాగే వికాస్ 3, సందీప్ 3, పవన్ 2, నీలేశ్ 2, నితిన్ 2, అమిత్ 2 పాయింట్లతో పరవాలేదనిపించారు. గుజరాత్ ఆటగాళ్లలో పంకజ్ 6, సచిన్ 3, రోహిత్ 3, సునిల్ 2, మోరే 2 పాయింట్లు సాధించారు. మొత్తానికి  గుజరాత్ ఆటగాళ్లు పాయింట్లు సాధించడంలో కాస్త వెనుకబడటంతో జైపూర్ పింక్ పాంథర్స్ 19-22 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.