చాలా కాలం తర్వాత తెలుగు తేజం, భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పివి సింధు అద్భుత ప్రదర్శన కనబర్చింది. జకార్తా వేదికగా జరుగుతున్న ఇండోనేషియా ఓపెన్ లో ఆమె వరుస విజయాలతో ఫైనల్ కు చేరింది. సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి చెన్‌ యూఫీని మట్టికరిపించిన సింధు ఫైనల్ కు అర్హత సాధించింది. ఇలా మొదటిసారి ఇండోనేషియా ఫైనల్ కు చేరి ట్రోఫీకి మరో అడుగు దూరంలో నిలిచింది. 

క్వార్టర్ ఫైనల్లో ఒకుహరా ను సునాయాసంగా ఓడించి సింధు సెమీఫైనల్ కు చేరింది. అయితే సెమీఫైనల్లో మాత్రం చైనాకు చెందిన రెండో సీడ్ క్రీడాకారిణి చెన్ యూఫీతో కాస్త కష్టంగానే అయినా విజయాన్ని అందుకుంది. మొదటి రౌండ్లో సింధు కాస్త తడబడ్డా రెండో రౌండ్లో మాత్రం పైచేయి  సాధించింది. అయితే నిర్ణయాత్మక మూడో రౌండ్లో సింధు విజృంభించి ఫైనల్లో అడుగుపెట్టింది. 

మొదటి రౌండ్లో సింధు 18-14 పాయింట్ల తేడాతో వెనుకబడింది. అయితే ఆ తర్వాత పుంజుకున్న సింధు వరుసగా రెండో రౌండ్ ను 21-19 తో ఆధిక్యాన్ని సాధించింది. ఆ తర్వాత నిర్ణయాత్మక మూడో రౌండ్లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన సింధు 21-10  పాయింట్ల తేడాతో చెన్ యూఫీని మట్టికరిపించింది. దీంతో కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. 

ఫైనల్లో సింధు జపాన్ క్రీడాకారిణి అకానే యమగూచితో తలపడనుంది. రెండో సీడ్ క్రీడాకారిణికి ఓడించి మంచి ఆత్మవిశ్వాసంతో ఫైనల్ కు చేరిన సింధు ఇండోనేషియా టైటిలే లక్ష్యంగా పోరాడనుంది. యమగూచిపై ఫైనల్లో విజయం సాధిస్తే 2019 లో సింధు అందుకున్న మొదటి అంతర్జాతీయ ట్రోఫీ ఇదే అవుతుంది.