Asianet News TeluguAsianet News Telugu

వెయిటర్‌గా పనిచేసి, రోజు కూలీకి కరువు పని చేసి... ఏషియన్ గేమ్స్‌లో పతకం తెచ్చిన రామ్ కథ వింటే..

నేషనల్ గేమ్స్‌తో జాతీయ రికార్డు బ్రేక్ చేసి, స్వర్ణం నెగ్గిన రామ్ బాబూ... ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో 35 కిలో మీటర్ల మిక్స్‌డ్ టీమ్ రేస్‌వాక్ ఈవెంట్‌లో  కాంస్యం...

From waiter to Asian Games Medalist, Race Walker Ram baboo inspiring  journey CRA
Author
First Published Oct 4, 2023, 12:51 PM IST

ఐపీఎల్ ఆడితే చాలు, ఒకే ఒక్క ఇన్నింగ్స్‌తో క్రికెటర్ల జీవితం ఓవర్‌నైట్‌లో మారిపోతుంది. అయితే అందరు క్రీడాకారుల పరిస్థితి అలా ఉండదు. ప్రపంచ వేదికల మీద భారత్‌కి పతకాలు తెచ్చిన ఎందరో క్రీడాకారులు, అథ్లెట్లు ఆకలితో ఇప్పటికీ పస్తులు ఉంటున్నారు. ఎందుకంటే క్రికెట్ పిచ్చి దేశంలో మిగిలిన క్రీడాకారులకు గుర్తింపు కాదు కదా, కనీస గౌరవం కూడా దక్కదు...


ఏషియన్ గేమ్స్ 2023 పోటీల్లో 35 కిలో మీటర్ల మిక్స్‌డ్ టీమ్ రేస్‌వాక్ ఈవెంట్‌లో మంజూ రాణితో కలిసి  కాంస్యం గెలిచిన రామ్ బాబూ కథ కూడా ఇలాంటిదే. 2022 అక్టోబర్‌లో జరిగిన నేషనల్ గేమ్స్‌లో 2:36:34 సెకన్లలో రేస్ వాక్‌ని ఫినిష్ చేసిన రామ్ బాబూ... నేషనల్ రికార్డు నెలకొల్పాడు. ఇంతకుముందు హర్యానాకి చెందిన జునెద్ ఖాన్ 2:40:16 సెకన్లలో పూర్తి చేయడమే నేషనల్ రికార్డుగా ఉండేది. 

నేషనల్ గేమ్స్‌తో జాతీయ రికార్డు బ్రేక్ చేసి, స్వర్ణం నెగ్గిన రామ్ బాబూ, ఎన్నో కష్టాలను అధిగమించి రేస్ వాక్‌ ట్రాక్‌లో అడుగుపెట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని బహురా గ్రామానికి చెందిన రామ్ బాబూ, 2018లో ఇంట్లో నుంచి బయటికి వచ్చేశాడు. లాంగ్ వాక్ రన్నర్ కావాలనే ఆశయంతో బయటికి వచ్చిన రామ్ బాబూ, బెనారస్‌కి వెళ్లాడు. అక్కడ బతుకు తెరువు కోసం ఓ హోటల్‌లో వెయిటర్‌గా ఉద్యోగానికి చేరాడు..

‘వెయిటర్‌గా పనిచేసేవాడికి అస్సలు గౌరవం ఉండదు.  ఏ బాబూ ఈ టేబుల్ క్లీన్ చెయ్, ఏయ్ ఇది తీసుకురా అని పిలుస్తారు. నాకు అవమానం తట్టుకోలేక సిగ్గుతో చచ్చిపోవాలని అనిపించేది. అర్ధరాత్రి వరకూ పనిచేసి, సండే కూడా పనికెళ్లిన రోజులు ఉన్నాయి. నేను ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకూ ట్రైయినింగ్ తీసుకునేవాడిని. ట్రైయినింగ్ అయ్యాక పనికి వెళ్లేవాడిని..

అయితే నా డైట్, నా ట్రైయినింగ్‌కి సరిపోయేది కాదు. తరుచూ గాయపడుతూ ఉండేవాడిని. నిద్ర ఉండేది కాదు, చేతిలో డబ్బులు లేవు. ఇవన్నింటికీ తోడు వెయిటర్‌గా పనిచేయడంతో నన్ను మనిషిగా కూడా చూసేవాళ్లు కాదు. మా నాన్న ఓ కూలీ. ఆయనకు పోలం లేదు. మా ఇంట్లో కరెంట్ కూడా ఉండేది కాదు. 2021లోనే మా ఇంటికి కరెంట్ సౌకర్యం వచ్చింది.

మా అమ్మ  4 కి.మీ.లు నడుచుకుంటూ పోయి, మాకు తాగడానికి నీళ్లు తీసుకురావాలి. చిన్నతనం నుంచి మా అమ్మ, జనాలు గుర్తించేలా ఏదైనా చేయమని చెబుతూ వచ్చింది. పేరు సంపాదించుకునేలా ఏదైనా చేయమని అనేది. నేను స్కూల్‌లో ఫుట్‌బాల్ ఆడేవాడిని. మిగిలిన పిల్లలు అలిసిపోయినా నేను చురుగ్గా పరుగెత్తేవాడిని.

‘Born to Run: భుదియా సింగ్’ అనే నాలుగేళ్ల పిల్లాడి బయోపిక్ మూవీ చూసినప్పుడే, నేను రేస్ వాకర్ కావాలని లక్ష్యంగా పెట్టుకున్నాను.  


మాజీ ఒలింపియన్ బసంత్ బహదూర్ రాణా, రామ్‌ బాబూని సహకరించాడు. క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ ద్వారా అతని ట్రైయినింగ్‌కి కావాల్సిన డబ్బులు సేకరించాడు. అయితే కరోనా కారణంగా ఈ క్యాంప్ మూతపడింది. ఇంటికి వెళ్లిపోయా. ట్రైయినింగ్ ఆగిపోయింది.

ఇంకేం చేయాలో తెలియక మా నాన్నతో కలిసి కరువు పనికి వెళ్లాను. అయితే నా ఫోన్‌లో రేస్ వాకింగ్ వీడియోలు చూసినప్పుడల్లా నా లక్ష్యం నాకు గుర్తుకు వచ్చేది. వాట్సాప్‌లో ట్రైయినింగ్ టిప్స్‌ని మా కోచ్ పంపేవారు. నేను ఫాలో అయ్యేవాడిని. అయితే జిమ్ కానీ స్విమ్మింగ్ ఫూల్ కానీ నాకు అందుబాటులో లేవు. 

ఎలాగోలా 2022లో రేసివాకింగ్ ఛాంపియన్‌షిప్‌లో సిల్వర్ మెడల్ గెలిచా. యూపీ ప్రభుత్వం రూ.6 లక్షల నజరానా ప్రకటించింది. ఆ తర్వాత నేషనల్ గేమ్స్ గెలిచినవారికి కూడా పారితోషికం ఇస్తామని ప్రకటించారు. అయితే రెండూ ఇప్పటిదాకా రాలేదు. గత ఏడాది ఆర్మీ ఉద్యోగం కోసం ప్రయత్నించాను, ఇప్పుడైనా వస్తుందేమో చూడాలి..’ అంటూ చెప్పుకొచ్చాడు 25 ఏళ్ల అథ్లెట్ రామ్ బాబూ.. 

Follow Us:
Download App:
  • android
  • ios