సబ్బు అవసరమే లేదు.. డ్రెస్ లపై మరకలు పోవాలంటే ఇలా చేస్తే సరిపోతుంది
నూనె మరకలు, కూరల మరకలు డ్రెస్ లపై అస్సలు పోనే పోవు. ఇవి పోవడానికని సర్ఫులో నానబెట్టి సబ్బుతో రుద్ది ఉతుకుతుంటారు. అయినా ఈ మరకలు పోనే పోవు. కానీ సబ్బు అవసరమే లేకుండా ఈ మరకలను చాలా సింపుల్ గా పోగొట్టొచ్చు.
సాధారణంగా మనం బట్టలను ఉతకడానికి డిటర్జెంట్ పౌడర్, సబ్బును వాడుతాం. ఈ రెండింటిని వాడినా కొన్ని కొన్ని సార్లు వైట్ డ్రెస్, ఇతర రంగుల దుస్తులపై పడిన కొన్ని కొన్ని మరకలు అస్సలు పోనే పోవు. ఈ మరకలు పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయిన వారు కూడా చాలా మందే ఉంటారు.
నిజానికి సబ్బు, సర్ఫు అవసరం లేకుండా కూడా మొండిమరకలను చాలా ఈజీగా పోగొట్టొచ్చు. జస్ట్ వంటింట్లో ఉండే కొన్ని పదార్థాలతో డ్రెస్ లపై జిడ్డును, మరకలు పోగొటొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మకాయ, బేకింగ్ సోడా
నిమ్మకాయ మనకు ఆరోగ్య పరంగానే కాకుండా.. క్లీనింగ్ పరంగా కూడా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడాను, నిమ్మకాయను ఉపయోగించి డ్రెస్ లకు అంటిన మొండి మరకలను చాలా సులువుగా పోగొట్టొచ్చు. నిజానికి మీరు సబ్బు లేకుండా కేవలం నిమ్మకాయ, బేకింగ్ సోడాను ఉపయోగించి బట్టలను ఉతకొచ్చు.
ఇందుకోసం ఒక గిన్నెలో ఒక నిమ్మకాయ రసాన్ని పిండండి. దీంట్లో బేకింగ్ సోడాను వేసి కలపండి. దీన్ని మరకలపై అప్లై చేయండి. ఆ తర్వాత బట్టలను రెగ్యలర్ గా ఎలా ఉతుకుతారో అలాగే ఉతకండి. అయితే ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే.. బట్టలపై మొండి మరకలు ఉన్న చోట నిమ్మకాయ, బేకింగ్ సోడా ద్రావణాన్ని అప్లై చేయండి.
ఆ తర్వాత చేతులతో పాత టూత్ బ్రష్ తో రుద్ది క్లీన్ చేయండి. బ్రష్ తో క్లీన్ చేసిన తర్వాత దుస్తులను నీళ్లలో అప్పుడే అద్దకుండా 5 నిమిషాలు అలాగే ఉంచండి. ఆ తర్వాతే రెగ్యులర్ గా ఎలా వాష్ చేస్తారో అలా దుస్తులను క్లీన్ చేయండి. దీనివల్ల మొండి మరకలు కూడా పూర్తిగా పోతాయి.
బేకింగ్ సోడా, వెనిగర్
ఈ బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ లో సాధారణంగా ప్రతి ఇంట్లో ఉంటాయి. అయితే ఈ రెండింటితో కూడా మీరు మురికి బట్టలను సబ్బు, డిటర్జెంట్ పౌడర్ లేకుండా ఈజీగా క్లీన్ చేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో వైట్ వెనిగర్ ను, బేకింగ్ సోడాను సమానంగా వేయండి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి డిటర్జెంట్ గా వాడండి. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్ ను ఉపయోగించి డ్రెస్ లపై ఉన్న మురికి మరకలు పూర్తిగా పోతాయి. అలాగే డ్రెస్ ల నుంచి దుర్వాసనను కూడా తొలగిస్తుంది.