వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ కి న్యాయం దక్కింది. న్యాయపోరాటంలో ఆయన గెలిచారు. పరువు నష్టం కేసులో క్రిస్ గేల్ కి న్యాయస్థానం అనుకూలంగా తీర్పు వెల్లడించింది. అంతేకాదు.. గేల్ కి ఫెయిర్ ఫ్యాక్స్ మీడియా మూడు లక్షల డాలర్లు( సుమారు రూ.కోటీ 45లక్షలు) పరిహారంగా చెల్లించాలని కోర్టు తీర్పు వెల్లడించింది.

ఇంతకీ మ్యాటరేంటంటే... 2015 వన్డే ప్రపంచకప్ సమయంలో గేల్ ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని.. ఆమె ముందు నగ్నంగా నిలబడ్డాడని ఓ పత్రికలో వరస కథనాలు వెలువడ్డాయి.  కాగా... ఆ పత్రికలో వచ్చిన ఆరోపణలను సవాలు చేస్తూ గేల్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై అసత్య ఆరోపణలు  చేశారని.. తన ప్రతిష్టకు భంగం కలిగేలా ఇలాంటి కథనాలు ప్రచురించారని గేల్ పేర్కొన్నాడు. కాగా.. గేల్ పై కథనాలు రాసిన ఫెయిర్ ఫ్యాక్స్... ఆ వార్తలకు తగిన ఆధారాలు చూపించలేకపోయింది. దీంతో.. న్యాయస్థానం గేల్ కి అనుకూలంగా తీర్పు వెల్లడించింది. గేల్ కి పరిహారం చెల్లించాలని సదరు పత్రికా యాజమాన్యాన్ని ఆదేశించింది.