శ్రీలంక క్రికెటర్ అజంత మెండిస్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. శ్రీలంక క్రికెట్ బోర్డు తనను సరిగా పట్టించుకోలేదనే బాధతోనే అతను 34ఏళ్ల వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని బీసీసీ సింహళ అధికారికంగా ధ్రువీకరించింది. చివరిసారిగా అతను 2015 జాతీయ జట్టుకి ప్రాతినిద్యం వహించాడు. 

దేశవాళీ క్రికెట్ ఆడుతున్నప్పటికీ అతనికి అవకాశాలు రాలేదు. కావాలనే శ్రీలంక క్రికెట్ బోర్డు తనను పక్కనపెట్టేసిందని అతను నిరాశకు గురయ్యాడు. ఈ క్రమంలోనే రిటైర్మెంట్ ప్రకటించేశాడు. ఏడేళ్ల అంతర్జాతీయ కెరీర్ లో మెండిస్ 19 టెస్టులు, 87వన్డేలు, 39 టీ20 మ్యాచ్ లు ఆడాడు. ఎరుపు బంతి క్రికెట్ లో 70, పరిమిత ఓవర్ల క్రికెట్ లో 218 వికెట్లు తీశాడు.

తొలిరోజుల్లో అతని మిస్టరీ బౌలింగ్ చూసి ముత్తయ్య మురళీధరన్ స్థాయికి ఎదుగుతాడని అందరూ భావించారు. కానీ అతనికి కనీసం అవకాశాలు కూడా దక్కలేదు. అరంగేట్రం టెస్టులోనే మెండిస్ 8 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడడు. తొలి వన్డేలో 3, తొలి టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. ఐతే బౌలింగ్ శైలి రహస్యాన్ని కనిపెట్టిన బ్యాట్స్ మెన్ ఉచకోత కోయడం మొదలుపెట్టడంతో జాతీయ స్థాయిలో స్థానం కోల్పోయాడు. టీ20 క్రికెట్ లో రెండు సార్లు 6 వికెట్ల ఘనత సాధించిన వ్యక్తి మెండిస్ ఒక్కడే. కాగా.. అతని రిటైర్మెంట్ పట్ల పలువురు క్రికెటర్లు స్పందిస్తున్నారు. అతనికి భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.