Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ సిద్ధాంతకర్త , ఉద్యమ స్ఫూర్తి ప్రదాత ప్రొఫెసర్ జయశంకర్‌ జయంతి

విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కొత్తపల్లి జయశంకర్‌ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట అనే గ్రామంలో తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావు గారు  అనే పుణ్యదంపతులకు 6 ఆగష్టు1934 జన్మించారు.

Telangana legend, proffesor jaya shanakar birth anniversary
Author
Hyderabad, First Published Aug 6, 2020, 11:38 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Telangana legend, proffesor jaya shanakar birth anniversary

తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 86 వ జయంతి ఈ రోజు . రాష్ట్ర వ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెలంగాణ సిద్ధాంతకర్తగా, ఉద్యమ స్ఫూర్తి ప్రధాతగా తెలంగాణ ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోయిన ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్. ప్ర‌త్యేక రాష్ట్ర సాధ‌న‌ కోసం ప్రొఫెసర్ జయశంకర్ చేసిన నిరంతర కృషిని, ఆయ‌న ధృడ సంక‌ల్పాన్ని తెలంగాణ రాష్ట్రం ఎప్పటికీ మరచిపోదు. 

తెలంగాణ ఉద్యమంలో జయశంకర్ పాత్ర మరువలేనిది. తెలంగాణ చరిత్రలో ఎప్పటికీ గుర్తిండిపోయే వ్యక్తి జయశంకర్ సార్. ఉద్యమకారుడి నుండి మహోపాధ్యాయుడి దాకా ఆయన తెలంగాణకు దిక్సూచిగా నిలిచారు. తెలంగాణ భావజాల వ్యాప్తికి జీవితాంతం కృషి చేసిన ప్రొఫెసర్ జయశంకర్ సేవ‌ల‌ను తెలంగాణ ప్రజలు, భవిష్యత్ తరాలు గుర్తుంచుకునే విధంగా వారి సంకల్ప బలం రాష్ట్ర సాధనకు చేసిన నిర్విరామ కృషి అంచ లంచలుగా ఆశయ ఆలోచనలకు పడును పెడుతూ, రాష్ట్ర సాధనకు ఆయువుపట్టు అయినారు. అందరి హృదయాలలో నిలిచారు.

విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన కొత్తపల్లి జయశంకర్‌ వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని అక్కంపేట అనే గ్రామంలో తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంత్‌రావు గారు  అనే పుణ్యదంపతులకు 6 ఆగష్టు1934 జన్మించారు. ఆయనకు ముగ్గురు అన్నదమ్ములు, ముగ్గురు అక్కచెల్లెళ్లు ఉన్నారు. జయశంకర్‌ తల్లిదండ్రులకు రెండో సంతానం. సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయాడు.

తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డి పట్టా పొంది, ప్రిన్సిపాల్‌గా, రిజిష్ట్రార్‌గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్-ఛాన్సలర్ వరకు ఉన్నత పదవులు పొందారు. 1969 తెలంగాణ ఉద్యమంలోనూ, అంతకు ముందు నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్- ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో కె.చంద్రశేఖరరావుకు సలహాదారుగా, మార్గదర్శిగా వెన్నంటి నిలిచారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలు రచించారు. 

ఉద్యోగ జీవితం:- బెనారస్‌, అలీగఢ్‌ విశ్వవిద్యాలయాలనుంచి ఆర్థికశాస్త్రంలో పట్టా అందుకున్న జయశంకర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ చేశాడు. 1975 నుంచి 1979 వరకు వరంగల్‌ లోని సీకేఎం కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశాడు. 1979 నుండి1981 వరకు కాకతీయ విశ్వవిద్యాలయం రిజస్ట్రార్‌గా, 1982 నుంచి 1991 వరకు సీఫెల్‌ రిజిస్ట్రార్‌గా, 1991 నుంచి 1994 వరకు అదే యూనివర్శిటీకి ఉపకులపతిగా పనిచేశాడు.

అధ్యాపకుడిగా:- అధ్యాపకుడిగా ఆయన ఎంతో మందికి మార్గనిర్దేశం చేశారు. వృత్తిపట్ల నిబద్ధతను, తెలంగాణ ఉద్యమం పట్ల చిత్తశుద్ధిని వారిలో నూరిపోశారు. ఎమ్జన్సీ కాలంలో ఆయన సీకేఎం కళాశాలకు ప్రిన్సిపల్‌గా పనిచేశారు. సీకేఎం కళాశాల అంటేనే జిల్లాలో విప్లవ విద్యార్థి ఉద్యమానికి కేంద్రంగా అప్పట్లో పేరుండేంది. విప్లవకవి వరవరరావు లాంటి వాళ్లు ఆ కాలేజీలో అధ్యాపకులుగా వ్యవహరించారు. ఎమ్జన్సీ గడ్డురోజుల్లో ఆయన కళాశాలను నడిపి ఎంతో మంది విద్యార్థుల్ని, అధ్యాపకుల్ని ఆయన నిర్బంధం నుండి కాపాడారు. ఆయన అధ్యాపకుడిగా హన్మకొండలోని మల్టీపర్సస్ స్కూల్లో మొదట తెలుగు బోధించారు. ఒక అధ్యాపకున్ని విద్యార్థులు గుర్తుపెట్టుకోవడం సర్వసాధారణమే కానీ ఒక అధ్యాపకుడే తన విద్యార్థుల్ని గుర్తుపెట్టుకొని పేరుపెట్టి పిలవడం ఒక్క జయశంకర్ కే సాధ్యం. జయశంకర్ సార్ విద్యార్థుల్లో అనేక మంది దేశవిదేశాల్లో ప్రస్తుతం ప్రముఖ స్థానంలో ఉన్నారు. వీరిలో కేయూ మాజీ ప్రొఫెసర్ ఎన్. లింగమూర్తి, ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ, ప్రొఫెసర్ కే. సీతారామావు తదితరులు అనేక మందికి ఆదర్శ గురువు జయశంకర్ సార్.

తెలంగాణా ఉద్యమంలో:- 1969 తెలంగాణా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 1952 లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నాడు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి నాయకుడిగా ఆయన 1954 లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చాడు. కె.సి.ఆర్‌కు సలహాదారుగా, మార్గదర్శిగా తోడ్పాటు అందించాడు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై ఆయన పుస్తకాలు రాసాడు. తెలంగాణలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాల్లో, విదేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేసాడు. జయశంకర్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ కోసం అంకితం చేశాడు. "అబ్ తొ ఏక్ హీ ఖ్వాయిష్ హై, వొ తెలంగాణ దేఖ్‌నా ఔర్ మర్‌జానా" ( ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలి, తర్వాత మరణించాలి ) అని అనేవాడు.

విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీదాకా, ఢిల్లీ నుండి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిది. విద్యార్థి దశ నుండే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుండే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేశారు. 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఉరికి ఆనాటి నుండి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954 విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్. అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుండి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసాడు. తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. ఆయన తిరగని ప్రాంతం అంటూ లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణ నినాదాన్ని వినిపించిన పోరాట శీలి.

ఉస్మానియా విద్యార్థుల గురించి సార్ ఆలోచనలు:- ఉస్మానియా విద్యార్థుల గురించి ‘ఉస్మానియాను తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంతో ఛాతి ఉబ్బుతుంది. ఎన్నెన్ని పోరాటాలకు, ఆరాటాలకు అది వేదికైంది. అందరికీ ఉస్మానియా యూనివర్శిటీ అంటే చెట్లు కనిపిస్తాయి. కానీ మొన్నటికి మొన్న తెలంగాణ కోసం అమరులైన అనేక మంది విద్యార్థులు ఆ చెట్ల సాక్షిగా నాకు కళ్లముందే కదుల్తు కనిపిస్తారు... వారు గుర్తుకొస్తే దు:ఖమొస్తది అనేవారు. అయితే నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచే అదృష్టం ఎంతమందికి దక్కుతుంది. వాళ్లకు మరణం లేదు. అదే ఉస్మానియాలో డిసెంబర్ 9 ప్రకటన తర్వాత పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం. కానీ వారి భవిష్యత్ కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని… వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయనాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా’ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్ష గురించి మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుండి  శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి అనే వారు.


వీరి రచనలు:-

* తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్‌

* తెలంగాణలో ఏం జరుగుతోంది

* వక్రీకరణలు - వాస్తవాలు

* తల్లడిల్లుతున్న తెలంగాణ (వ్యాస సంపుటి)

* 'తెలంగాణ' (ఆంగ్లంలో)

అస్తమయం:- 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరడానికి కారణమైన వ్యక్తి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్. తెలంగాణ ఉద్యమం గురించి మాట్లాడుకున్నా, రాష్ట్ర సాధన గురించి చెప్పుకున్నా... ఆయన ప్రస్తావన లేకుండా ఉండదు. తొలిదశ ఉద్యమం నాటి నుండి... 60 ఏళ్ల ఆకాంక్ష నెరవేరే వరకూ ..తెలంగాణ ఉద్యమ ప్రతి అడుగులో సార్ ముద్ర కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్ళారా చూడాలని తరుచుగా చెప్పే జయశంకర్ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందే మరణించారు. అంతటి మహనీయుడు అనారోగ్య సమస్యతో రెండేళ్లపాటు గొంతు క్యాన్సర్‌తో బాధపడి 2011 జూన్ 21 మంగళవారం ఉదయం 11.30 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. తెలంగాణా సిద్ధాంతకర్త , తెలంగాణా పితామహుడు జయశంకర్ సార్ జయంతి సందర్భంగా విశ్వబ్రాహ్మణ సమాజం, మరియు తెలంగాణ జాతి యావత్తు వారి చిరస్మరనీయమైన స్మృతులను తలచుకుంటూ ఈ రోజు జయంతిని ఘనంగా జరుపుకుంటుంది.


 

Follow Us:
Download App:
  • android
  • ios