పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆరాధనోత్సవాలు

బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కులమతాలకు అతీతంగా వ్యవహరించి దివ్యపురుషుడు. స్వామి వారి గురించి తెలియని వారు అంటూ ఉండరు. 

Sri Pothuluri Veera Brahmendra Swamy

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

Sri Pothuluri Veera Brahmendra Swamy

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి 17వ శతాబ్దానికి  చెందినవారు. క్రీ.శ 1608 -1693 మధ్యకాలానికి చెందినవాడు. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞాన తత్వాలను బోధించిన యోగి, హేతువాది, సంఘ సంస్కర్త , సాక్షాత్ దైవ స్వరూపుడు, బ్రహ్మం గారు తన కాలజ్ఞానములో భవిష్యత్తు గురించి చెప్పిన చాలా విషయాలు నిజమయ్యాయి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి కులమతాలకు అతీతంగా వ్యవహరించి దివ్యపురుషుడు. స్వామి వారి గురించి తెలియని వారు అంటూ ఉండరు. స్వామి వారి ఆరాధనోత్సవం తేది 2 - మే - 2020 శనివారం రోజున ఉన్నందున నా వ్యాసం ద్వార వీరి గురించి సంక్షిప్తంగా పరిచయం చేస్తాను  

జననం:-  శ్రీ శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు సరస్వతి నదీతీరంలో అత్రి మహాముని ఆశ్రమ సమీపంలో శ్రీ విశ్వకర్మ వంశస్థుడు, పరమ గురువు అయిన తండ్రి పోతులూరి పరిపూర్ణాచార్యులు, తల్లి పోతులూరి ప్రకృతాంబ అను విశ్వబ్రాహ్మణ పుణ్య దంపతులకు క్రీస్తు శకం 1608లో జన్మించారని చరిత్రకారుల ద్వార తెలుస్తుంది. పరిపూర్ణాచార్యుల దంపతులకు బ్రహ్మ తేజస్సుతో విరాజిల్లే  నగుమోము గలరూపంతో ఆజానుబాహుడు, అవతారపురుషుడు అయిన 'శ్రీమన్నారాయణుడు' మగ శిశువు రూపంలో జన్మించాడు. పుణ్య దంపతులు పుత్రున్ని కాని శివసాయుజ్యం చెంది నందువలన సమీపంలో ఉన్న అత్రి మహర్షి ఆ బాలున్ని తీసుకుని వీరపాపమాంబ, వీరాచార్య దంపతులకు పెంచుకోమ్మని ఇస్తాడు. ఆ శిశువునకు వీరభట్టయ్య అనే పేరుతో 14 సంవత్సరాలు వీరపాపమాంబ వద్ద పెరిగి స్వామి దేశాటనకు బయలు దేరి పుణ్యక్షేత్రాలు దర్శించు కుంటూ బనగానపల్లె చేరుకున్నారు.

గరిమిరెడ్డి అచ్చమ్మ గారి ఇంట వీరప్పయాచార్యులుగా గోవుల కాపరిగా కుదురుకున్నాడు. గోవులను కాస్తూ రవ్వలకొండ గుహాల్లో కూర్చొని గుల్జారీముల్లుతో తాటాకు పత్రాలపై కాలజ్ఞానాన్ని  వ్రాసారు. అక్కడి నుండి దేశాటన చేసుకుంటూ ఆయా ప్రాంతాలలో కాలజ్ఞానాన్ని భోదిస్తూ, పెదకొమర్ల గ్రామానికి చేరుకొని అక్కడ శివ కోటయ్య గారి కుమార్తె గోవిందమ్మను వివాహం చేసుకున్నారు. వీరికి ఐదుగురు బిడ్డలు జన్మించారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు చిన్న వయస్సులోనే ఆపార జ్ఞానంతో వెలుగొందాడు. ఎక్కువ ఆత్మచింతన మితభాషణం అలవడింది. 

తల్లికి చేసిన జ్ఞానబోధ:- బ్రహ్మం గారికి జగద్గురువు ఆదిశంకరాచార్యుల వలె దేశాటన ద్వారా జ్ఞాన సంపాదన చేసి దానిని ప్రజల వద్దకు చేర్చడం అంటే మక్కువ ఎక్కువ. తన మొదటి జ్ఞానబోధ తల్లితో ప్రారంభించాడు. శరీరం పాంచభౌతికమని ఆకాశం, గాలి, అగ్ని, పృధ్వి, నీరు అనే అయిదు అంశాలతో చేయబడిందని సమస్త ప్రకృతితో కన్ను, ముక్కు, చెవి, నోరు, చర్మము అనే జ్ఞానేంద్రియాలద్వారా సంబంధం ఏర్పరచుకొని జ్ఞానం సంపాదిస్తామని, వీటి ద్వారా 'నేను' అనే అహం జనిస్తుందని, ఆత్మ సాక్షిగా మాత్రమే ఉంటుందని, బుద్ధి జీవుని నడిపిస్తుందనీ, బుద్ధిని కర్మ నడిపిస్తుందని, దానిని తప్పించడం ఎవరికీ సాధ్యపడదనీ, ఈ విషయాన్ని గ్రహించి ఎవరు పరబ్రహ్మను ధ్యానిస్తారో వారు మోక్షాన్ని పొందుతారని బోధించి ఆమె వద్ద సెలవు తీసుకుని దేశాటనకు బయలుదేరాడు.

అచ్చమాంబకు జ్ఞానబోధ :- బ్రహ్మంగారు తల్లిని వదిలి పుణ్యక్షేత్రాలు చూసేందుకై తిరుగుతూ బనగానపల్లెకు వచ్చి పగలంతా తిరిగి రాత్రికి ఒక ఇంటి అరుగు మీద విశ్రమించి అక్కడే నిద్రకు ఉపక్రమించాడు. తెల్లవారిన తరువాత ఇంటి యజమానురాలైన అచ్చమ్మ అతనును ప్రశ్నించి, ఏ దైనా పని కోసం వచ్చానని చెప్పటంతో ఆమె స్వామి వారికి  పశువులను కాచే పనిని అప్పగించింది. పశువులను కాచే నిమిత్తం రవ్వలకొండ చేరిన అతను అక్కడి ప్రశాంత వాతావరణంచే ఆకర్షించబడి అక్కడే ఉన్న ఒక గుహను నివాసయోగ్యం చేసుకుని కాలజ్ఞానం వ్రాయడం మొదలు పెట్టాడు.

ఆ సమయంలో అతను గోవులకు ఒక వలయం ఏర్పరిచి దానిని దాట వద్దని ఆజ్ఞాపించడంతో అవి ఆ వలయం దాటకుండా మేత మేస్తూ వచ్చాయి. ఒక రోజు స్వామి వారిని అనుసరిస్తూ వచ్చిన అచ్చమాంబ శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు ఏకాగ్రతగా వ్రాయడం, పశువుల ప్రవర్తన గమనించి, తను ఒక జ్ఞాని అని గ్రహించింది. అచ్చమ్మ ఇన్ని రోజులు ఇది గ్రహించకుండా తన చేత సేవలు చేయించుకున్నందుకు మన్నించమని వేడగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు అంటారు నాకు దూషణ, భూషణలు ఒకటేనని నీవు అయినా తల్లి అయినా తనకు ఒకటేనని ప్రంపంచంలోని జీవులన్నీ తనకు ఒకటేనని చెప్పాడు. ఆ తరువాత అచ్చమ్మ తనకు జ్ఞానబోధ చేయమని కోరగా ఆమెకు యాగంటిలో జ్ఞానబోధ చేసాడు. అచ్చమ్మతో మాట్లాడిన ప్రదేశాన్ని ఇప్పుడు ఆ ప్రదేశాన్ని ముచ్చట్ల గుట్ట అని పిలుస్తారు.

బనగానపల్లె నవాబుకు జ్ఞానబోధ :- బనగానపల్లె నవాబు బ్రహ్మంగారి గురించి విని అతను నిజంగా మహిమాన్వితుడో కాదోనని స్వయంగా తెలుసుకోవాలని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని తన వద్దకు పిలిపించాడు. స్వామి రాగానే స్వయంగా స్వాగతంచెప్పి ఆసీనులను చేసాడు. స్వామి వారికి ఫలహారాలు తీసుకురమ్మని సేవకుని ఆజ్ఞాపించాడు. బ్రహ్మం గారికి తినడానికి మాంసాహారం తీసుకురమ్మని సేవకునికి ముందుగానే సూచన చేసాడు. నవాబు ఆదేశానుసారం సేవకుడు మాంసాహారం నింపిన పళ్లాన్ని బ్రహ్మంగారి ముందు ఉంచాడు. పళ్ళెం పైనున్న వస్త్రాన్ని తొలగిస్తే ఫలహారం స్వీకరిస్తానని చెప్పగా సేవకుడు అలాగే చేసాడు. 

ఆపళ్ళెంలోని మాంసాహారం పుష్పాలుగా మారటం అక్కడి వారిని ఆశ్చర్యచకితులను చేసింది. ఈ సంఘటనతో నవాబుకు అతను మహిమలపై విశ్వాసంకుదిరి, అతనను పలువిధాల ప్రశంసించాడు. ఆ సందర్భంలో బ్రహ్మంగారు నవాబు సమక్షంలో కొన్ని కాలజ్ఞాన విశేషాలు చెప్పాడు. ఆ తరువాత నవాబు అతనుకు డెబ్బై ఎకరాల భూమిని దానంచేసి దానిని మఠం నిర్వహణకు ఉపయోగించవలసినదిగా కోరి స్వామి వారిని ఘనమైన మర్యాదలతో సత్కరించి సాగనంపాడు.

దేశాటనలో స్వామి వారి మహిమలు :-  అతనుకు దేశాటన చేయాలని కోరిక కలగటంతో శిష్యులకు నచ్చచెప్పి దేశాటనకు బయలుదేరాడు. కందిమల్లయపల్లె  చేరుకున్నాడు. ఆ ఊరు అతనను ఆకర్షించడంతో అక్కడ నివాసం ఏర్పరుచుకుని మామూలు వడ్రంగిలా జీవించడం ప్రారంభించారు. గ్రామంలో అమ్మవారి జాతర కొరకు చందా ఇవ్వమని పెద్దలు స్వామి వారిని కోరగా అందరి ముందు గుడి ముందు నిలబడి ఒక చుట్ట చేత పట్టుకుని అమ్మవారిని ఉద్దేశించి 'పోలేరు చుట్టకు నిప్పు పట్టుకునిరా' అని కోరగానే సాక్షాత్తు అమ్మవారు స్వామివారికి నిప్పు అందించగా ఊరివారు దిగ్భ్రాంతి చెంది ఆ క్షణం నుండి అమితంగా గౌరవించడం మొదలుపెట్టారు.స్వామివారు వారికి ధర్మబోధ చేసారు. ఇలా స్వామివారి గురించి చుట్టూ ఉండే ప్రదేశాలకు తెలిసి రావడంతో వారు స్వామి కోసం తరలి రావడం మొదలుపెట్టారు.

బ్రహ్మంగారు చేసిన మహిమలను విశ్వసించని కొందరు స్వామివారిని ఎగతాళి చేసే ఉద్దేశంతో సజీవంగా ఉన్న వ్యక్తిని పాడె మీద తీసుకు వచ్చి 'ఇతనికి ప్రాణం పోయండి 'అని వేడుకున్నారు. బ్రహ్మంగారు ధ్యానంలో నిజం తెలుసుకుని 'మరణించిన వ్యక్తికి ఎలా ప్రాణం పోయగలను' అని బదులిచ్చాడు. వెంటనే పాడె మీదున్న వ్యక్తి మరణించడం అందరిని ఆశ్చర్యచకితులను చేసింది. వారు బ్రహ్మంగారిని మన్నించమని వేడగా వారికి బుద్ధిచెప్పి మరణించిన వ్యక్తి తలని చేతితో స్పృజించి సజీవుని చేశారు. ఆ తరువాత అక్కడి ప్రజలు శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని దేవుడిలా కొలవసాగారు. 

సిద్దయ్య :- బ్రహ్మంగారు వైదిక మతావలంబీకులైనా కులమతాలకు అతీతంగా వ్యవహరించాడు. స్త్రీల పట్ల ఆదరణను ప్రదర్శిస్తూ తన భావాలను వెలిబుచ్చాడు. అలాగే దూదేకుల కులానికి చెందిన సైదులను తనశిష్యునిగా చేసుకున్నాడు. అతను ఉన్నత భావాలను భక్తి శ్రద్ధలను మెచ్చుకుని తన ప్రియశిష్యుని చేసుకుని అనేక ఉన్నత భోదలు చేసాడు. అతను జ్ఞానం లభించిన వాడని ప్రశంశించి జ్ఞానం సిద్దించింది కనుక సిద్దయ్యగా నామకరణం చేసాడు."సిద్ధా" అనే మకుటంతో కొన్ని పద్యాలను అసువుగా చెప్పాడు.

కక్కయ్య :- బ్రహ్మంగారు తనశిష్యుడు సిద్దయ్యకు యోగవిద్య కుండలినీశక్తి శరీరంలోని యోగచక్రాలు గురించి వివరిస్తూ శరీరం ఒకదేవాలయమని అందులో దేవతలుంటారని కుండలినీ శక్తిని జాగృతం చేయడం ద్వారా వారిని దర్శించవచ్చని వివరిస్తుండగా కక్కయ్య అనే వ్యక్తి ఇదంతా విన్నాడు. కక్కయ్య శరీరంలోని అద్భుతాలు చూడాలన్న ఆతురతతో ఇంటికి వెళ్ళాడు. ఇంట్లో అతని భార్య నింద్రించడం చూడగానే ఆమె శరీరంలో దేవతలను చూడాలని ఆమెను ముక్కలుగా నరికి వేశాడు. అయినా ఆమెశరీరంలో రక్తమాంసాలు తప్పఏమీ కనిపించకపోవడంతో తనను బ్రహ్మంగారి మాటలు మోసపుచ్చాయని విలపించాడు. తన మాటలు నమ్మి భార్యను నరికివేసానని బ్రహ్మంగారు దీనికంతా కారణమని తనేనని స్వామి దగ్గరకు వెళ్ళి జరిగినది చెప్పి స్వామి వారిని దూషించడం మొదలుపెట్టాడు. 

బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే 'కక్కా నేను చెప్పింది అసత్యం కాదు. నేను అసత్యం పలకను నిదర్శనంగా నీ భార్యను బ్రతికిస్తాను ' అనిచెప్పి అతని వెంట అతని ఇంటికి వెళ్ళి అతని భార్య శరీరంపై మంత్ర జలం చల్లగానే ఆమె నిద్ర నుంచి మేల్కొన్నట్లు లేచి కూర్చుంది. కక్కయ్య బ్రహ్మంగారి మహిమ తెలుసుకుని తనను మన్నించమని పలు విధాల వేడుకుని తనను శిష్యుడిగా చేర్చుకొనమని తాను వెంట నడుస్తానని బ్రహ్మంగారిని వేడుకుంటాడు. మాదిక కక్కయ్యను, దూదేకుల సిద్ధయ్యను చేరదీసి కులమత సామరస్యాన్ని అనుష్టించారు. 

బనగానపల్లె చింతచెట్టు :- బనగానపల్లెలో గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో బ్రహ్మంగారు తనచే వ్రాయబడిన కాలజ్ఞాన పత్రాలను పాతిపెట్టి దానిపై ఒక చింత చెట్టు నాటాడు. ఆ గ్రామంలో ఏవైనా ప్రమాదాలు, ఆపదలు కలిగే ముందు సూచనగా ఆ చింతచెట్టు పూలు అన్నీ రాలిపడతాయని చెప్పారు. ఆ చింతచెట్టుకు నిత్యదీపారాధన చేస్తూ ఉంటారు. 

శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి సజీవ సమాధి :- 1693 సంవత్సరంలో వైశాఖ శుద్ధ దశమి తిధి, శుక్రవారం రోజు పగలు రెండుగంటలకు   
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారు జీవసమాధి యందు ప్రవేశించారు. ఆ నాటి నుండి శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారిని ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ దశమి రోజు విశ్వబ్రాహ్మణులతో పాటు అన్ని కులాల వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ స్వామి వారు ఉపదేశించిన మూలా మంత్రం " ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రాహ్మణే నమ: " అను మూలా మంత్రాన్ని శక్త్యనుసారంగా జపించుకుంటారు. ఎంతో భక్తీ శ్రద్ధలతో పూజించి తరిస్తారు.     

సమాధి తర్వాత దర్శనం :-
సిద్దయ్యను పూలు తీసుకురమ్మని బనగాన పల్లెకు పంపి బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళాడు. సిద్ధయ్య తిరిగి వచ్చి గురువు కోసం విపరీతంగా విలపించ సాగాడు. బ్రహ్మంగారు శిష్యునిపై కరుణించి సమాధిపై రాతిని తొలగించమని ఆదేశించి రాతిని తొలగించిన తరువాత బయటికి వచ్చి సిద్ధయ్యను ఓదార్చాడు. ఆ పై సిద్దయ్య కోరికపై పరిపూర్ణంను బోధించాడు. ఆ తరువాత సిద్ధయ్యకు దండం, కమండలం, పాదుకలు, ముద్రికను ఇచ్చి తిరిగి సమాధిలో ప్రవేశించాడు.

లోక రక్షణార్ధం శ్రీమన్నారాయణుడు ధరించిన అవతారాలన్నింటిలో శ్రీ పోతులూరి బ్రహ్మేంద్రస్వామి అవతారం విశిష్టమైనది. స్వామి వారు స్వయంగా చెప్పిన మాటలు కలియుగం 5000 వేల సంవత్సరాల అనంతరం లోక సంరక్షణ కొరకు శ్రీ వీరభోగవసంతరాయలుగా  అవతరిస్తానని తెలియజేసారు. ఎంతో మహిమాన్వితులైన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి వారి పటాన్ని ప్రతి ఇంట్లో పెట్టుకుని స్వామి వారికి రోజు దీప, దూప, నైవేద్యాలతో భక్తీ శ్రద్ధలతో ఎవరు పూజిస్తారో వారికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ఏకకాలంలో పూజించిన పుణ్యఫలం దక్కి స్వామి వారి అనుగ్రహానికి పాత్రులై ఆయురారోగ్య, అష్ట ఐశ్వరములతో జీవిస్తూ వంశాభి వృద్దికి పొందుతూ సన్మార్గంలో నడుస్తూ అంత్యమందు మోక్షాన్ని పొందుతారు.    


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios