Asianet News TeluguAsianet News Telugu

తులసి ద్వాదశి ప్రత్యేకత ఏంటి..?

మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. 

Significance of Tulasi Dwadasi
Author
Hyderabad, First Published Nov 16, 2021, 2:16 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

                యన్మూలే సర్వ తీర్థాని యన్మథ్యే సర్వ దేవతాయై
                యదగ్రే సర్వ వేదాశ్చ తులసి త్వాం నమామ్యహమ్
                నమస్తులసి కళ్యాణి నమో విష్ణుప్రియే శుభే
                నమో మోక్షప్రదే దేవి నమః సంపత్ప్రదాయిని


16 నవంబర్ 2021 మంగళవారం రోజు ఉసిరికొమ్మను విష్ణు స్వరూపంగా భావించి.. లక్ష్మీ స్వరూపమైన తులసికోటలో అలంకరించి లక్ష్మీ నారాయణులు నెలవైఉండే తులసి, ఉసిరికి వివాహం జరుపుతారు. ఆషాడ శుద్ధ ఏకాదశి రోజున పాలకడలిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కొంటాడని పురాణ కథనం. అలా యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీహరి ద్వాదశి రోజు లక్ష్మీదేవిని పరిణయమాడారు.
 
మాసాలలో అత్యంత పవిత్రమైనది కార్తీకం. అందులోనూ అతి విశిష్టమైనది క్షీరాబ్ది ద్వాదశి. కార్తీకమాసం శుక్షపక్ష ద్వాదశే క్షీరాబ్ది ద్వాదశి. అమృత‌ం కోసం దేవతలు క్షీరసాగరాన్ని మథించిన పర్వదినం. క్షీరాబ్ది ద్వాదశికి పావన ద్వాదశి, చిలుకు ద్వాదశి, యోగీశ్వర ద్వాదశి అనే పేర్లు ఉన్నాయి. పుణ్యప్రదమైనది కాబట్టి పావన ద్వాదశి అని, ఈ శుభదినాన్నే క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అనీ, యోగులు, మునులు తమ చాతుర్మాస దీక్షను విరమించే పవిత్ర తిథి కాబట్టి యోగీశ్వర ద్వాదశిగానూ ప్రాచుర్యం పొందింది. 

ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీమహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశినాడు మేల్కొంటాడు. మర్నాడు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీహరి లక్ష్మీసమేతుడై, బ్రహ్మాది దేవతలతో బృందావనానికి వస్తాడు కాబట్టి ఆ రోజుని ‘బృందావని ద్వాదశి’గా పిలుస్తారు. చిలుకు ద్వాదశి రోజున అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా తీరాన కాశీక్షేత్రంలో కోటిమందికి అన్నదానం చేసినంత పుణ్యఫలం లభిస్తుందని పురాణాలలో తెలిపారు. పాల సముద్రం నుంచి సకల సిరులతో ఆవిర్భవించిన లక్ష్మీదేవిని శ్రీహరి పరిణయమాడిన శుభ తిథి. ఈ కారణంగానే క్షీరాబ్ది ద్వాదశి సాయంత్రం ముత్తైదువులు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి, శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవికి వివాహం జరిపిస్తారు. తులసీని శ్రీలక్ష్మీగానూ, ఉసిరి చెట్టును శ్రీమన్నారాయణునిగాను భావించి వివాహం జరిపించి పునీతులవుతారు. సాయంత్రం దీపాలతో అలంకరిస్తారు. సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోతే వచ్చే దోషం ఈ రోజు దీపారాధన చేయడంవల్ల పరిహారమౌతుంది.

క్షీరాబ్ది ద్వాదశి మహత్మ్యాన్ని భాగవతంలోని అంబరీషుని కథ తెలియజేస్తుంది. శక్తి సామర్ధ్యాలతో పాలిస్తూ సిరిసంపదలకు ఏమాత్రం పొంగిపోక కేవలం విష్ణు పాదచరణమే శాశ్వతమని భావించే అంబరీష చక్రవర్తి... ద్వాదశి వ్రతాన్ని అత్యంత నియమ నిష్ఠలతో ఆచరించాడు. కాళిందీ నదీలో పుణ్యస్నానం చేసి మధువనంలో శ్రీహరికి అభిషేకాన్ని నిర్వహించి మహిమాన్వితమైన ఆరువేల కోట్ల పాడిగోవులను బ్రాహ్మణులకు దానం చేశాడు. బ్రాహ్మణులకు మృష్టాన్న భోజనం వడ్డించి, తాను కూడా వ్రతదీక్షను సంపన్నం చేసి భోజనానికి సిద్ధపడుతున్న సమయంలో దూర్వాస మహార్షి అక్కడికి విచ్చేసాడు.

దివ్యమైన ఆ సమయంలో దుర్వాసుని రాకను పవిత్రంగా భావించిన అంబరీషుడు ఆయనను తన ఆతిథ్యం స్వీకరించమని అర్థించాడు. అందుకు దుర్వాసుడు తాను కాళిందిలో స్నానం చేసి వస్తానని చెప్పి శిష్యబృందంతో సహా వెళ్లాడు. నదిలో స్నానం చేస్తూ పరావశ్యంతో దూర్వాసుడు పరధ్యానంలోకి వెళ్లిపోయాడు. ద్వాదశి ఘడియలలో భుజిస్తే గాని వ్రత ఫలం దక్కదు కాబట్టి పండితులతో అంబరీషుడు సమాలోచలను సాగించాడు.

దూర్వాసుడు నా అతిథి అతనికి మర్యాదలు చేయడం నా విద్యుక్త ధర్మం. మహర్షి భుజించకుండా నేను భోజనం చేస్తే అతని ఆగ్రహానికి, శాపానికి గురి అవుతాను. అయితే ద్వాదశ ఘడియలలో నేను పారాయణం చేయకపోతే వ్రతఫలం దక్కదు విష్ణువు కృప వర్షించదు. శాపం కంటే ఆయన అనుగ్రహమే ముఖ్యం కాబట్టి ద్వాదశ ఘడియలలో శుద్ధ జలాన్ని సేవించి ఉపవాస దీక్ష ముగిసినట్టు అవుతుంది. అతిథినీ గౌరవించినట్లవుతుంది. ఒకవేళ అప్పటికీ ఆయన ఆగ్రహించి శపిస్తే అది పూర్వజన్మల ఫలంగా భావించి భరిస్తానని తన మనసులో శ్రీహరిని త్రికరణ శుద్ధిగా ధ్యానించి కేవలం జలాన్ని సేవించి ముని రాకకోసం ఎదురు చూస్తున్నాడు.

ఇంతలో నదీస్నానం ముగించుకుని వచ్చిన దూర్వాసుడు జరిగింది దివ్యదృష్టితో గ్రహించి రాజు చేసిందని మహాపరాధంగా భావించాడు. తనకు ఘోరమైన అవమానం జరిగిందని కోపోద్రిక్తుడై, జటాజూటం నుంచి ఒక కృత్యని సృష్టించి అతనిపై ప్రయోగించాడు. ఈ పరిణామానికి భయపడిన అంబరీషుడు శ్రీమహావిష్ణువును శరణు వేడాడు. భక్తవత్సలుడైన శ్రీహరి రాక్షసులకు మృత్యుసూచకమైన ధూమకేతువు, ధర్మసేతువు అయిన తన సుదర్శన చక్రాన్ని ఆ కృత్యపై ప్రయోగించాడు.


ఆ సుదర్శన చక్రం క్షణాల్లో దూర్వాసుడు సృష్టించిన కృత్యను దహించి, దురహంకారియైన దూర్వాసుని వెంబడించింది. సుదర్శన చక్ర జ్వాలల నుంచి దూర్వాసుని రక్షించడం ఎవరి తరం కాలేదు. తనను రక్షించమని బ్రహ్మను దుర్వాసుడు ప్రార్ధించగా.. దుర్దాంత మహాదురితాలను మర్దించే సుదర్శన చక్రం నుంచి రక్షించబడాలంటే కేవలం విష్ణుమూర్తికే సాధ్యమని, అయననే శరణువేడటం మంచిదని విధాత సూచించాడు.

దీంతో శ్రీహరి చెంతకు చేరుకున్న దూర్వాసుడు తన అపరాధాన్ని మన్నించి రక్షించమని వేడుకున్నాడు. దీనికి శ్రీహరి.. నేను భక్తులకు సదా దాసుడను. తమ భక్తి పాశాలతో నన్ను భక్తులు వారి హృదయాలలో బంధించి ఉంచుతారు. భక్తుల నిష్ఠలు చెరపబడటం చేతనే సుదర్శన చక్రం నిన్ను వెంటాడింది. నిన్ను ఈ సమయంలో రక్షించగలిగిన వ్యక్తి అంబరీషుడు మాత్రమే అని తెలిపాడు. శ్రీహరి సూచనతో దూర్వాసుడు... అంబరీషుని వద్దకు వెళ్లి తనను మన్నించమని అడిగాడు. ప్రశస్తమైన క్షీరాబ్ధి ద్వాదశి దీక్షలో ఉన్న నిన్ను బాధించినందుకు నాకు తగిన శాస్తి జరిగిందని మహర్షి అనగానే దీనికి అంబరీషుడు... ఓ మహర్షీ.. ఈ రోజు జరిగినవన్నీ భగవత్సంకల్పాలేనని చెప్పి శ్రీహరి ప్రార్థించడంతో తిరిగి చక్రం విష్ణుసన్నిధికి చేరింది.

అంబరీషుని ఆతిథ్యానికి సంతుష్టుడైన దుర్వాసుడు.. ఈ రోజు లోకాలన్నింటికీ నీ భక్తి గొప్పదనం ఘనమైన రీతిలో వెల్లడైంది.. క్షీరాబ్ది ద్వాదశి పుణ్య తిథి రోజు నీ కథా శ్రవణం చేసిన వారు ద్వాదశి పుణ్యాన్ని, విష్ణు సాయుజ్యాన్ని పొందతారని అనుగ్రహించాడు. ఈ రోజున తులసిని పూజించాలి. తులసి కోట ముందు అయిదు పద్మాలు వేసి దానిపై దీపాలు వెలగించి తులసిని లక్ష్మీనారాయణ సమేతంగా పూజించాలి. అయిదు రకాల నైవేద్యాలు, అయిదు రకాల పండ్లు, తాంబూలాలను సమర్పించాలి.


 

Follow Us:
Download App:
  • android
  • ios