ధన త్రయోదశి ప్రత్యేకత ఏమిటి..?
రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి.
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు.
సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
ధనత్రయోదశి కధ:- పూర్వం హిమ అనే పేరుగల రాజు ఉండేవాడు. అతనికి ఒకడే కుమారుడు. ఆ కొడుకుని చిన్నప్పటి నుంచి అలారుముద్దుగా పెంచారు. క్షత్రియుడు కనుక కత్తిసాము మొదలైన క్షత్రియ విద్యలన్నీ నేర్పించారు. కానీ ఈ రాకుమారుడు జాతకరీత్యా అతనకి వివాహం జరిగిన నాలుగో రొజుకు మరణిస్తాడని పురోహితులు చెప్తారు. అయినా, ఓ రాకుమారి అతడిని ఇష్టపడి పెళ్ళి చేసుకుంటుంది. తన పసుపు కుంకాలను తానే కాపాడుకుంటానని శపధం చేస్తుంది. నాలుగవ రోజు రాకుమారుడి గది ముందు ఆభరణాలు రాసులుగా పోస్తుంది. దేదీప్యమానంగా దీపాలను వెలిగిస్తుంది. రంగురంగుల రంగవల్లులు దిద్దుతుంది. తన ఆరాధ్య దేవతయైన లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతుంది.
రాకుమారుడి ప్రాణాలు తీసుకువెళ్ళడానికి యమధర్మ రాజు పాము రూపం ధరించి వస్తాడు. బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి, ఆ గదంతా వెలుగు విరజిమ్ముతున్నాయి. ఆ నెరుపు తళుకులకు ఈ పాము చూపు మందగిస్తుంది. ఆదుగు ముందుకు వేయలేకపోతాడు. ఈ యువరాణి సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి, ఆమె సంగీతం వింటూ ఉంటాడు. ఇంతలోనే తెల్లారిపోతుంది. యమ ఘడియలు దాటిపోవడంతో, ఖాళీ చేతులతో వెళ్ళిపోతాడు. అందువల్ల ఈ రోజు యముడికి ప్రీతికరంగా యమదీపం వెలిగిస్తారు. ఉత్తరాదిలో ఈ రోజు సాయంత్రం ఆరుబయట, అన్నాన్ని రాశిగా పోసి యమదీపం వెలిగిస్తారు.
ఆశ్వయుజ బహుళ త్రయోదశి (అంటే నరక చతుర్దశికి ముందు వచ్చే తిధి). దీన్నే "ధన త్రయోదశి" అంటారు. ఈనాటి రాత్రి అపమృత్యువు నివారణకై నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి, పూజించి, ఇంటి ముందు ఉంచాలి. దీనికి "యమ దీపం" అని పేరు. యముని అనుగ్రహం పొందడం కోసం ఈ దీపాన్ని వెలిగించాలి.
ధనత్రయోదశి పూజ :- ధనత్రయోదశినాడు లక్ష్మీ అమ్మవారిని ప్రతిష్ట చేసి త్రయోదశి, చతుర్ధశి, అమావాస్యలలో మహాలక్ష్మీ పూజను అఖండ శ్రీసూక్త పారాయణంతో అమావాస్యనాడు లక్ష్మీపూజనముతో మూడు రోజుల వ్రతం ముగుస్తుంది. ఈ వ్రతము పద్మ, స్కాంద, బ్రహ్మాండ పురాణ ప్రోక్తం. ఈ వ్రతమును ఆశ్వయుజ కృష్ణ అష్టమి నాటి నుంచి ప్రారంభించే ఆచారం కూడా ఉంది. పురాణ సముచ్ఛయానుసారం భాద్రపద కృష్ణ అష్టమి నుండి ఆశ్వయుజ కృష్ణ అష్టమి వరకు లక్ష్మీఆరాధన చేయాలి. అలాగే కన్యాసంక్రమణానికి ముందే ఈ వ్రతాన్ని ముగించాలని పౌరాణికుల అభిప్రాయం.
త్రేతాయుగంలో మదనబిల్వుడు అను మహారాజు లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీదేవిని ప్రతిష్టించి, మూడు రోజులు ఆరాధించాడని ప్రసిద్ధి. ఈ పూజను బిల్వమూలములో చేయాలనే విశేష నియమాన్నివిధించారు.
బిల్వ పత్రై: యదేత్ దేవీం
తదాజాతి ప్రసూన కై
నానా బిష్టక నైవేద్యై:
ధూప దీపై: మనో కరైతి
అని లక్ష్మీ అమ్మవారిని బిల్వపత్రములతో, జాజిపూలతో, బహు విధములైన పిండి వంటలతో ధూప, దీప, సుగంధ ద్రవ్యములతో ఆరాధించవలెనని నియమం.
ధనత్రయోదశి అనగా ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు, ప్రకృతి, మహాతత్త్వము, అహంకారము అను పదమూడు లీలావిభూతికి ధనముగా అభివర్ణిస్తారు. ప్రత్యేకించి ఈనాడు ప్రకృతి వనురులతో లక్ష్మీనారాయణులను ఆరాధించి మూడు దినములు జాగారముతో లక్ష్మీస్తవం చేస్తూ శ్రీసూక్తం, లీలాసూక్తం పారాయణాలతో లక్ష్మీదేవిని ఆరాధించాలి.
ధనత్రయోదశి నాడు బంగారం కొని దాచుకోవడం పరిపాటి కాని దీనికి ఎటువంటి శాస్త్రప్రమాణం లేదు. ధనత్రయోదశినాడు పండితులకు, బ్రాహ్మణులకు వస్త్రదానం, సువర్ణదానం, ఆభరణదానం చేయడం వలన విశేష ఫలితం లభిస్తుంది. ”సర్వ దైవత్యం వైవాస:” అనగా దేవతలు వస్త్రమునందు అధివసించి ఉందురని అర్థం. అలాగే సువర్ణము లక్ష్మీదేవి ప్రతిరూపం, ఆభరణములు నారాయణుని ప్రతిరూపం కావున వస్త్రము, సువర్ణము, సువర్ణాభరణములు విరివిగా దానం చేసి లక్ష్మీనారాయణుల అనుగ్రహం పొందాలి.
కాగా ఈ మధ్యకాలంలో ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారం మొదలైంది. కానీ అటువంటి నియమం ఏమీ లేదు. ప్రపంచీకరణ నేపధ్యంలో దేశంలోకి బహుళజాతి సంస్థలు వ్యాపారం కోసం వచ్చాయి, లాభలు ఆర్జించడమే ధ్యేయంగా ఉన్న సంస్థలు వ్యాపారం చేసుకోవడం కోసం అక్షయతృతీయ, ధనత్రయోదశి రోజున బంగారం కొనాలనే ప్రచారాన్ని మొదలుపెట్టాయి. అసలు ఇటువంటి ఆచారం మన బామ్మలకు, అమ్మమ్మలకే తెలియదట. వాళ్ళకే ఇది వింతగా ఉందంటే అసలు విషయం ఏంటో అర్దం చేసుకోవచ్చు.
భారతదేశంలో పండుగ రోజంటూ ఏదైనా ఉందంటే అది దానం చేసిన రోజే. సంపదలు దాచుకోవడం కాకుండా, ఉన్న సంపదను పుణ్యంగా మార్చుకుని, వచ్చే జన్మలకు ఉపయోగించుకోవడం భారతీయుల విధానం. ధన త్రయోదశి రోజున చేసే దానం, పూజ, జపం అధికఫలాన్ని ఇస్తాయి. మునుపు బంగారాన్ని ఎప్పుడు ప్రత్యేకించి ధనత్రయోదశి నాడు కొనగోలు చేయలేదు. వచ్చిన అతిధులకు బంగారం దానం చేసిన సంస్కృతి మనది.