Asianet News TeluguAsianet News Telugu

మొదటి దశలో డాంబికాలు: లాక్ డౌన్ ఓ తప్పుడు నిర్ణయం

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల్లో  మన ముందున్న కర్తవ్యంపై సామాజిక విశ్లేషకులు ముఖేష్ సామల విశ్లేషణ.

Samala Mukhesh says lockdown was a wrong step during coronavirus
Author
Hyderabad, First Published Apr 29, 2021, 8:24 AM IST

2019 లో కరోనా అనే ప్రమాదకర వైరస్ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపిన మాట వాస్తవమే కానీ, గత సంవత్సరపు చేదు అనుభవం భారత దేశ పాలకులను  మేల్కొల్పక పోగా మూఢత్వంవైపు మళ్లించింది.  కోవిడ్ అనే వ్యాది దేశంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల లాక్ డౌన్ అటు పిమ్మట దాని ప్రభావం తగ్గగానే ప్రభుత్వాలు భవిష్యత్ ప్రజారోగ్యం పై దృష్టి సారించి ఇంతకంటే ఎక్కువ ఉపద్రవం ముంచుకొచ్చినా సంసిద్ధంగా ఉండే ప్రణాళికలు చేపట్టకుండా, ధార్మిక సంస్థల ఏజెంట్లుగా మత ప్రచారాలకు, ఎన్నికల రాజకీయాలకు ప్రాధాన్యమిస్తూ, ప్రజల మధ్య మత, ప్రాంతీయ పరమైన విద్వేషాలను రెచ్చగొడుతూ పబ్బం గడిపాయి.  దీని ఫలితంగా మనం నేడు అనుభవిస్తున్న కోవిడ్ సెకండ్ వేవ్ భీబోత్సం!. ఇది కేవలం ప్రభుత్వ వైఫల్యమా? లేక ప్రజలు అజ్ఞానంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయమా?? అనేది విపులంగా పునరాలోచించాల్సిన తరుణమిది.

కిందటి ఏడాది అత్యంత అనాలోచితాంగా, అకస్మాత్తుగా విధించిన లాక్ డౌన్ పొట్ట చేత పట్టుకొని వలసలు వెళ్లిన కార్మికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేసిన పాపం కేంద్రానిదే.!  దాని ఫలితంగా కుబేరులైంది మాత్రం గుప్పెడు మంది కార్పొరేటర్లన్న సంగతి యావత్ దేశానికి తెలిసిన వాస్తవం.  సామాజిక సంపద కొద్దిమంది చేతిలో కేంద్రీకృతమై ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతినకుండా చూడాలని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 39(సి) చెప్తున్నా, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దేశాన్ని పాలిస్తున్నారు.  బతకడానికి అవసరమైన వేతనం, గౌరవప్రదమైన జీవితాన్ని కల్పించే పని పరిస్థితులు, సామాజిక సాంస్కృతిక అవకాశాలు కార్మికులందరికి కల్పించాలని ఆర్టికల్ 43 చెప్తున్నప్పటికి, ప్రభుత్వం కార్మిక చట్టాల్లో మార్పులు చేసిన తీరు చూస్తే పాలకులు కార్మికుల పక్షం కాదనే వాస్తవం తేటతెల్లమైంది.  రోజురోజుకు పెరిగిన నిరుద్యోగం, ఊడిపోయిన ఉద్యోగుల వెతలు, ఉపాధిని కోల్పోయిన అసంఘటిత కార్మికులు, కొనుగోలు శక్తి తగ్గి మందగించిన ఆర్ధిక వ్యవస్థ, పేదల పిల్లలు విద్యకు దూరమై, తినడానికి తిండి గింజ కరువై ఆకలి కేకలు, ఆర్తనాదాలు ప్రభుత్వాలకు వినపడుతున్నా కనని పాలకులు, ఆర్ధిక సంస్కరణల పేరిట బడా కార్పొరేట్ల రుణ మాఫీలు, దాని ఫలితంగా అప్పుల ఊబిలో చిక్కుకొని దివాళా తీసిన బ్యాంకుల ప్రయివేటికరణ, ప్రభుత్వ రంగ సంస్థలను నష్టాల పేరు చెప్పి ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తూ, ప్రజా ఆస్తులను విధ్వంసం చేసి,  దేశ ఆర్థిక రంగాన్ని కుదేలు చేయడంలో ప్రభుత్వం సఫలం అయ్యింది.  పీఎం కేర్స్ పేరిట వసూలు చేసిన లెక్కల్లో పారదర్శకత లేదు.

ఎప్పుడు విపత్తు సంభవించినా భావోద్వేగాలతో పబ్బం గడపి నాలుగు ఓట్లు రాల్చుకొని రాజకీయంగా స్థిరత్వంపై ఉన్న శ్రద్ధ, పేద ప్రజల భవిష్యత్తుకు భరోసా కల్పించలేని అసమర్థత స్పష్టం అవుతోంది.  పంచవర్ష ప్రణాళిక విధానాన్ని తొలగించి నీతి ఆయోగ్ లాంటి కొత్త పద ప్రయోగంతో ప్రయోజనం పెద్దగా లేకుండాపోయింది.  కేంద్ర ప్రభుత్వం వైద్యానికి 2020-21 బడ్జెట్లో చూపిస్తున్న లెక్కలు కాకిలెక్కలు గానే ఉన్నాయి.  మొత్తం జీడీపీ లో 1.8% శాతం వైద్యానికి గాను 2.23 లక్షల కోట్లను పోయిన ఏడాది కంటే 137% శాతం పెంచామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు గొప్పలు చెప్పినప్పటికీ, ప్రపంచంలోనే వైద్యానికి అత్యంత తక్కువగా కేటాయిస్తున్న దేశంగా భారతదేశం నిలిచింది.  నేషనల్ హెల్త్ పాలసీ ఆఫ్ ఇండియా 2017 వారు జీడీపీలో 2.5% వైద్యానికి 2025 కల్లా పెంచాలని,  ప్రణాళికా సంఘం వారు 2012 లొనే  హై లెవల్ ఎక్స్పర్ట్స్ గ్రూప్ వారి సూచనల ప్రకారం 2020 కల్లా జీడీపీ లో 2.5% శాతం కేటాయించాలని ముందస్తు సూచనలిచ్చినా చెవిన పెట్టక ప్రణాళిక సంఘం స్థానంలో నీతి ఆయోగ్ పేరుమీద కాలయాపన చేస్తూ నేటికి కేవలం 1.8% శాతం మాత్రమే కేటాయించి 137% పెంచామని డాంబికాలు పలుకుతూ ప్రజారోగ్యాన్ని గాలికి ఒదిలేసింది.  ప్రస్తుతం మనం నిత్యం మీడియాలో , సామాజిక మాధ్యమాల్లో చూస్తూ విస్తుపోతున్న దృశ్యాలైన ఆక్సిజన్ సిలిండర్ ల కొరతని,  రేమిడిసివర్ మందు కొరతని, ఆస్పత్రుల్లో ఐసీయూలో బెడ్లు కొరతని, చివరకు చనిపోయిన శవాలకు స్మశానవాటికల్లో జాగా దొరకని స్థితి, 80 దేశాలకు వ్యాక్సిన్ ను అందించామని ప్రచార ఆర్భాటాలకు పోయిన మనం నేడు మొదటి డోస్ తీసుకున్న వారికి కనీసం రెండో డోస్ అందుబాటులో లేని దుస్థితి, అయినా వ్యాక్సినేషన్ వయోపరిమితి తగ్గించి వ్యాక్సిన్ అందుబాటులో లేకున్నా, వ్యాక్సిన్ వారోత్సవాలు జరిపిన ఘనత మన ప్రభుత్వానిది.

అంతే కాదు మొదటి వేవ్ లో మర్కజ్ సమావేశాల వల్లనే కరోనా దేశానికి వచ్చిందని మైనార్టీలను ముద్దాయిలుగా ప్రజల ముందు నిలబెట్టి కోర్టుల్లో కేసులు వేస్తే నిర్దోషులుగా తీర్పు వెల్లడైంది. ముస్లింలను భయబ్రాంతులకు గురిచేసి రాజకీయంగా మలుచుకోవడంలో ప్రభుత్వం సక్సెస్ అయ్యింది.  అదే నేడు జరిగిన కుంభమేళాకు ప్రభుత్వం బహిరంగంగా  అనుమతి ఇచ్చి సెకండ్ వేవ్ ఉదృతికి ప్రభుత్వం పరోక్షంగా కారణమైంది.  ఇవన్నీ ఎట్లా ఉన్నా ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేక,  ప్రవేటు ఆసుపత్రుల్లోకి వెళితే అక్కడ యాజమాన్యాలు అధికార పార్టీల్లోని ప్రజాప్రతినిధులకు వాటాలుగా ఉండి సామాన్య ప్రజానీకాన్ని జెనిగళ్ళా పీడిస్తూ ఆర్ధిక దోపిడీకి పాల్పడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు కలిచివేస్తుంది.  ఆశ్రిత పెట్టుబడిదారి విధానం (క్రోని క్యాపిటలిజం) ప్రభుత్వాలను నడిపిస్తుంటే పాపం  ప్రజలు అమాయకంగా మోస పోవడం, విధిని తిట్టుకోవడమో తప్ప ఏమీ చేయలేని దుస్థితి.   "ఒక ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేస్తే ఆ వ్యవస్థలోని పై స్థాయి వ్యక్తులకే దాని ఫలితాలు అందుతాయి.  కింది స్థాయి వారికి ఒరిగేదేమీ ఉండదు. వారి బతుకులు ఇంకా దుర్భరమవడం తప్ప-" జాన్ పెర్కిన్ అన్నది నిజమేనెమో అన్న సందేహం రాకమానదు.

ప్రపంచ దేశాలన్నీ కరోనా కట్టడిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడి ప్రజలకు అవగాహన కల్పిస్తే, మన దేశంలో రింగ్ టోన్ లతో చెప్పిందే చెప్పి, మూర్ఖంగా చప్పట్లు కొట్టమని, పళ్లాలను శబ్దం చేయించి, సెల్ ఫోన్ లలో లైట్ లను వెలిగించి "గో కరోనా" వంటి అమాయకత్వపు అరుపులను ప్రోత్సహించడం, కషాయాలను తాగి రోగ నిరోధక శక్తిని పెంచుకోమనే ఉచిత సలహాలు సూచనలు చేశారు.  చైనా లొనే వైరస్ పుట్టిందని దేశ ప్రజలందరికీ చైనాపై వైరాన్ని పెంచి మన దేశం ఏమి సాంధించగలిగింది అనేది ఇప్పటికీ అంతు చిక్కని మిలియన్ డాలర్ల ప్రశ్న??? చివరగా పరిస్థితి అదుపు తప్పిపోయిన నిస్సహాయ స్థితిలో కరోనా కట్టడిలో రాష్ట్రలకే పూర్తి అధికారులు ఇస్తున్నామని, ఇంకా ముందుకెళ్లి వైద్యం రాష్ట్ర పాలనా అంశమని చేతులు దులుపుకున్న కేంద్ర ప్రభుత్వం.!  అందుకే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ నిర్ణయాలు తీసుకోగలగాలి, లెనిన్ అన్నట్లుగా "సకల నైతిక మత, రాజకీయ సామాజిక పదాల సందున, ప్రకటనల వెనుక, వాగ్దానాల మాటున ఏదో ఒక వర్గ ప్రయోజనాలు ఉంటాయని గ్రహించనంతవరకు ప్రజలు రాజకీయాల్లో వంచనకీ, ఆత్మ వంచనకీ గురవుతూనే ఉంటారు". బెనారస్ యూనివర్సిటీలో భూత వైద్య కోర్సును ప్రవేశపెట్టి ఏదో సాధించామని ప్రచారాలు చేసుకున్న ప్రభుత్వం, మూఢత్వాన్ని వీడి శాస్త్రీయ, సాంకేతిక రంగాల అభివృద్ధికై ఇప్పటికైనా విద్య, వైద్యంపై ఎక్కువ నిధులను కేటాయించి కరోనా కంటే ఇంకా ప్రమాదకరమైన విపత్తులు వచ్చినా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలి.

Follow Us:
Download App:
  • android
  • ios