నివాళి: మిస్టర్ తెలంగాణ
ఉద్యమం లేని సమయంలో కూడా దాన్ని దీపంలా నిలబెట్టింది ఆయనే.
తెలంగాణ కోసం కలవరించి పలవరించిన ప్రొఫెసర్ కేశవరావ్ జాదవ్ ఇక లేరంటే గుండె బరువెక్కుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. ఉద్యమం లేని సమయంలో కూడా దాన్ని దీపంలా నిలబెట్టింది ఆయనే.
తెలంగాణ జన పరిషత్ కన్వీనర్ గా ఆయన పని చేశారు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ కు మార్గదర్శకత్వం వహించారు. ముందు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గళమెత్తారు. 1953లో జరిగిన ముల్కీ వార్ లో పాల్గొన్నారు. ఆ సమయంలో ఆయన నిజాం కళాశాలలో చదువుతున్నారు. హైదరాబాదు పాతబస్తీలో పుట్టి పెరిగిన ఆయన తెలంగాణ ఊపిరిగా జీవించారు.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆంగ్ల విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసి పదవీ విరమణ చేశారు. 1960 దశకం తెలంగాణ ఉద్యమానికి రూపకల్పన చేసిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరు.
ఆయన ఏడవ తరగతి చదువుతున్న సమయంలో ‘తెహజీబ్’ (సంస్కృతి) అనే సంస్థను ఏర్పాటు చేశారు. 1947లో 14వ యేట ‘క్విట్ కాలేజి’ అంటూ ఏడాదిపాటు సాగించిన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు.
తెలంగాణ సాయుధ పోరాటం (1946-51), 1952 నాన్‌ముల్కీ గో బ్యాక్ ఉద్యమం, 1969 జై తెలంగాణ పోరాటం, 1995 నుంచి మలి దశ పోరాటాల్లో ఆయన పాలు పంచుకున్నారు. పౌర హక్కుల ఉద్యమంలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. పియుఎస్ఎల్ నిర్మాతల్లో ఆయన ఒకరు.
1969 తెలంగాణ ఉద్యమంలో తన అనుభవాలను గుర్తు చేసుకుంటూ జై తెలంగాణ నినాదం ఎలా పుట్టిందో ఆయన ఓ సందర్భంలో చెప్పారు. 1969 మే 1వ తేదీన తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలనే డిమాండుతో గవర్నర్ కు వినతిపత్రం ఇవ్వడానికి చార్మినార్ నుంచి రాజభవన్ వరకు మార్చ్ ప్రారంభమైంది. కేశవరావు జాదవ్ మార్చ్ లో ఉన్నారు.
"మేం మార్చ్ ప్రారంభిస్తున్న సమయంలో అరుణ అనే పదహారేళ్ల అమ్మాయి అకస్మాత్తుగా జై తెలంగాణ అని నినదించింది. పోలీసులు ఆమెపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో ఆమె మరణించింది. జై తెలంగాణ నినాదాన్ని మాకు అందించింది ఆమెనే" అని ఆయన చెప్పారు.
తెలంగాణనే తన శ్వాసగా జీవించిన కేశవ రావు జాదవ్ ఇక లేరనే విషయాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టమైన పనే. కానీ కేశవరావు జాదవ్ పేరు ప్రస్తావించకుండా తెలంగాణ ఉద్యమం లేదనే విషయం మాత్రం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.
- కె. నిశాంత్