పల్లెల్లో పడకేసిన ప్రజారోగ్యం
ప్రజారోగ్యం పట్ల మన ప్రభుత్వాల వైఖరి ఏవిధంగా ఉందో సామాజిక రాజకీయ ఆర్ధిక విశ్లేషకులు ముఖేష్ సామల అందిస్తున్న ఈ వ్యాసంలో చదవండి.
గాంధీ చెప్పినట్లు "భారత దేశానికి పల్లెలే పట్టు కొమ్మలు". పల్లె జనాభా గణాంకాలను, జనాభాకు తగినట్టు వైద్యాన్ని అందించలేని ప్రభుత్వాల వైపల్యాలను, లోతుగా లెక్కలతో సహా ఒక్కసారి నిశితంగా పరిశీలిద్దాం. 2021 ఫిబ్రవరిలో జరపాల్సిన 16వ జనాభా లెక్కల గణన కోవిడ్ pandamic దృష్ట్యా వాయిదా పడింది. కానీ, 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం దేశంలో 1210.2 మిలియన్ జనాభా ఉంటే, ఇందులో గ్రామీణ ప్రాంత జనాభా 833.1 మిలియన్లు, పట్టణాల్లో 377.1 మిలియన్ జనాభా ఉన్నారు. కొంత మేరకు గ్రామీణ జనాభా మునుపటి గణాంకాలతో పోల్చితే తగ్గినప్పటికీ సుమారు 70% మంది గ్రామాల్లో నివసిస్తున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి.
కోవిడ్ మొదటి వేవ్ ముఖ్యంగా పట్టణ జనాభాను మాత్రమే అతలాకుతలం చేసింది కానీ, రెండో వేవ్ ప్రభావము ఎక్కువ మొత్తంలో పల్లెలపైనే పడగ విప్పింది. మన దేశ పల్లెల్లో వైద్య వ్యవస్థ పటిష్టంగా లేదన్న విషయాన్ని మరోసారి నాయకులకు, ప్రభుత్వాలకు కరోనా గుర్తుచేసింది. పల్లెల్లో ప్రభుత్వాలకు సవాలుగా మారిన అపరిశుభ్రత, కలుషితమైన నీళ్లు, పౌష్టికాహారం, అంటువ్యాధుల పట్ల అప్రమత్తంగా లేకపోవడం, అజాగ్రత్తల వంటివి కోవిడ్ లాంటి పెను ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పు కలుగుతుంది.
కేంద్రం బడ్జెట్లో వైద్యానికి జీడీపీలో 1.8% మాత్రమే కేటాయించి, ప్రపంచంలోనే అత్యల్పంగా కేటాయించిన దేశంగా నిలిచింది. రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ ప్రకారం ప్రజారోగ్యం అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నప్పటికీ, హెల్త్ పాలసీలు రూపొందించడంలో, అమలు జరిపించడంలో కేంద్రం పాత్ర కీలకమైనది. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో 2021-22 వార్షిక బడ్జెట్లో హెల్త్ సెక్టార్ కి కేటాయించింది కేవలం Rs.6,295/- కోట్లు మాత్రమే. ఇది మొత్తం బడ్జెట్ Rs.2.30 లక్షల కోట్లలో 2.72% మాత్రమే. 2020-21 బడ్జెట్ లో Rs.6,186/- కోట్లు మాత్రమే కేటాయించి, కోవిడ్ ఫస్ట్ వేవ్ భయానక వాతావరణాన్ని చవిచూసిన తర్వాత కూడా, తదుపరి బడ్జెట్ 18 మార్చ్ 2021 నాడు ముందుచూపన్నదే లేకుండా, పెంచినది కేవలం Rs.109 కోట్లు మాత్రేమే.
మొన్నటికిమొన్న కేవలం ప్రచార ఆర్భాటం కోసం 10,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధమైనదని చెప్పుకోవడం ప్రకటనలకు మాత్రమే పరిమితం.! జిల్లాకో డయాగ్నిక్ సెంటర్ ఏర్పాటు స్వాగతించాల్సిన అంశమే అయినప్పటికీ, ప్రభుత్వ హాస్పిటలల్లో నాణ్యమైన వైద్యం అందించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైద్యానికి సుదూరంగా ఉన్న గ్రామీణ జనాభాకు సరిపడా అంబులెన్స్ లు లేకపోవడం విచారకరం. తెలంగాణలో ప్రతి అరవై వేల మందికి ఒక 108 అంబులెన్స్ మాత్రమే ఉందని ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి. కోవిడ్ ట్రీట్మెంట్ కు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని వందల ఫిర్యాదులు అందితే, ప్రజల ఆగ్రహావేశాలు చల్లార్చడానికి, కేవలం పదులసంఖ్యలో ఆసుపత్రులకు షోకాజు నోటీసులు ఇచ్చి, కొన్నింటికి లైసెన్సులు రద్దుచేసి చేతులు దులిపేసుకొని, అవే ఆసుపత్రులకు దొడ్డిదారిన మళ్ళీ అనుమతులు ఇచ్చింది. అధిక ఫీజులను వాపసు ఇప్పించాలని హైకోర్టు ఆదేశిస్తే, దండుకున్న వేలకోట్ల నుండి కేవలం 3 కోట్లు మాత్రమే ఇప్పించింది. ప్రజలపై, ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నది నగ్న సత్యం.
ఆంద్రప్రదేశ్ 2020-21 వార్షిక బడ్జెట్లో హెల్త్ సెక్టార్కు Rs.11,419.48 కోట్లు కేటాయించింది. మే 20 తారీఖు 2021 నాడు ప్రవేశపెట్టిన 2021-22 వార్షిక బడ్జెట్లో, కోవిడ్ ఉధృతిని దృష్టిలో పెట్టుకొని హెల్త్ సెక్టార్ కు క్రిందటి ఏడాది కంటే ఎక్కువగా, మొత్తం బడ్జెట్లో 21.11 శాతంను అనగా Rs.13,830.44 కోట్లను కేటాయించింది.
కేరళలో పినరన్ విజయ్ రెండవసారి ప్రభుత్వం ఏర్పాటు చేశాక, మొన్నటికి మొన్న 2021 జూన్ 4వ తేదీన బడ్జెట్ సమావేశాల్లో హెల్త్ సెక్టార్ ని ప్రాముఖ్యతగా తీసుకొని 20,000 కోట్ల కోవిడ్ ప్రత్యేక ప్యాకేజిని ప్రవేశ పెట్టారు. క్రిందటి బడ్జెట్లో కూడా ఎక్కువగా హెల్త్ సెక్టర్ కి నిధులు కేటాయించి కరోనాను ఎదురు కొనడంలో ప్రపంచంతో పోటీ పడ్డారు. అందుకే మునుపటి కేరళ ఆరోగ్య మంత్రి కే. కే. శైలజ గారు ఐక్య రాజ్య సమితి చేత ప్రత్యేక గుర్తింపును పొందారు. అంతేకాదు, మేము గనుక కేంద్రంలో అధికారంలో ఉండి ఉంటే వైద్యాన్ని జాతీయం చేశేవారమన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం 35,000 కోట్లు ఫ్రీ వ్యాక్సినేషన్ కోసం కేటాయించామని ప్రచారంలో ఉన్న చిత్తశుద్ధి ఆచరణలో లేదన్న సంగతి, ప్రదానమంత్రి "టీకా ఉత్సవ్" ప్రకటించగానే ప్రజలకు అర్ధమయ్యింది. కరోనా థర్డ్ వేవ్, బ్లాక్ ఫంగస్ వంటి రాబోయే ప్రమాదాలను 'ప్రపంచ ఆరోగ్య సంస్థ' ముందుగానే హెచ్చరిస్తున్నప్పటికి పెడచెవిన పెడుతున్న భారత ప్రభుత్వం, పేద ప్రజల ఆరోగ్యాలను గాలికి వదిలేసిందనడంలో సందేహమే లేదు.
కేరళ, ఆంద్రప్రదేశ్ రాష్ట్రాలు అనుసరించే వైద్య విధానాలు, అధిక మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తున్న పద్ధతులు మిగతా రాష్ట్రాలు మరియు కేంద్ర ప్రభుత్వం సైతం ఆదర్శంగా తీసుకోవాల్సిన అంశం.
షుం పీటర్ అనే రాజకీయార్థిక నిపుణుడు అన్నట్లుగా "రాజకీయ నిర్ణయాలు తీసుకోవడానికి ఏర్పడిన సంస్థాగత ఏర్పాటు, ప్రజల లక్ష్యాలను తెలుసుకొని, ఆ లక్ష్యాలను నెరవేర్చేందుకు ఎన్నికల ద్వారా ప్రజాప్రతినిధులను సమావేశాలకు పంపి నిర్ణయాలు తీసుకోవడమే ప్రజాస్వామ్యం". కానీ నేడు ప్రజాస్వామ్య దేశమనే భారత దేశంలో ప్రజాప్రతినిధుల కొనుగోలు, రాబోయే ఎలక్షన్లలో ఎలా గెలవాలనే దానిపైన ఉన్న వ్యూహ ప్రతివ్యూహాలు, ప్రజా ఆరోగ్యం, ప్రజల అవసరాలపై జరగాల్సినంత చర్చలు చట్టసభల్లో జరగడం లేదనేది ఒప్పుకోక తప్పని పరిస్థితి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాథమిక హక్కులలోని 'జీవించే హక్కు'లో భాగమైన నాణ్యమైన వైద్యాన్ని అందించే బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది.