ముప్పులో మూడవ ప్రపంచ మహిళలు... అంతర్జాతీయ మహిళా దినోత్సవం స్పెషల్ వ్యాసం

ఇవాళ(మంగళవారం) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హన్మకొండకు చెందిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం బాధ్యులు అస్నాల శ్రీనివాస్ అందిస్తున్న ఆసక్తికరమైన వ్యాసం ఇక్కడ చదవండి.

international  womens day special 2022: asnala srinivas special essay

అడవులు ఏమి ఇస్తాయి.  అవి  నేలను, నీటిని, స్వచ్ఛమైన ప్రాణ వాయువును అందిస్తాయి.  భూమిని నిలబెట్టుకోవాడానికి కావల్సిన అన్నింటినీ ఇస్తాయి. అడవి దేవత "అరణ్యని" జీవితానికి, ఉత్పాదకత సారవంతానికి ప్రతీక. అడవి,మహిళలు రెండూ ఒకటే అనే తాత్వికతతో 300 సంవత్సరాల క్రితం రాజస్తాన్ బిష్ణోయి ప్రాంతం ఆదివాసీ ప్రజలు అమృతదేవి నాయకత్వంలో అడవి రక్షణ కోసం ఉద్యమించారు. జోద్పూర్ మహారాజు అభయ్ సింగ్ రాజ ప్రసాదం నిర్మించడం కోసం కేజ్రీ చెట్లను నరికించాడు.  ఎడారి రాజస్థాన్ లో కేజ్రీ చెట్లు ప్రజలకి జంతువులకి ఆహారంగా, ఏడారీకరణను తగ్గించే, అనేక రుగ్మతలను నయం చేసే మొక్కగా గుర్తింపు ఉంది. ప్రాణప్రదమైన ఈ చెట్లను రక్షించుకునేందుకు యుద్ధమే చేశారు. 363 మంది ప్రాణాలను అర్పించారు. 

హిమాలయ పర్వత సంపద చెట్లను నరికివేయకుండా, దోచుకోకుండా చెట్లను కౌగిలించుకుందాం. చెట్లను నరకడం వలన నీటి సంక్షోభం వస్తుందని మీరా బెన్, గౌరీ దేవిలు ప్రారంభించిన చిప్కో ఉద్యమం కొనసాగింది. మహిళల జీవితానికి, ఉపాధికి, ప్రకృతికి ఉండే సున్నిత సంబంధాన్ని ఇవి తెలియచేస్తున్నాయి.  చరిత్ర  బోధిస్తున్న గుణపాఠం ఏమిటంటే మానవుడు చరిత్ర నుండి ఏమీ నేర్చుకోవడం లేదని సుస్థిర భవిష్యత్ , మానవ సౌఖ్యం ప్రకృతిని పోషించడంలో, సంరక్షణలో ఉందని మరచిపోయి ప్రవర్తిస్తున్నారు.

ఐక్యరాజ్యసమితి మార్చి 8 ని "సుస్థిరమైన రేపటి కోసం ఈరోజు లింగ సమానత్వం" ఇతివృత్తంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకోవాలని పిలుపునిచ్చింది.  వాతావరణం మార్పు , విపత్తుల నష్ట నివారణ , సమానత్వ సాధన వంటి అంశాలు  21వ శతాబ్దానికి సవాలును విసురుతున్నాయి. ప్రపంచ పేదలలో అధిక సంఖ్యలో స్త్రీలు ఉన్నారు.   ప్రకృతిపై ఆధారపడి జీవించే ప్రజలలో స్త్రీలు అధికంగా ఉన్నారు. గనుల కోసం, పరిశ్రమల కోసం విచక్షణారహితంగా ప్రకృతిని విధ్వంసం చేయడం వల్ల స్త్రీల జీవితాలు సంక్షోభం అంచుకు చేరుకున్నాయి అని ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తం చేసింది.

ప్రకృతిలో స్త్రీలు అంతర్భాగం.  సారవంతతను ఉత్పాదకతను అడవి నుండి  పొలాల్లోకి జంతువులలోకి బదిలీ చేస్తారు. పశువుల పేడను ఎరువుగా మార్చి  పంట ఉత్పత్తులు, పశువుల దాణాగా మారుస్తారు. నీటిని అడవి నుండి తమ పంట క్షేత్రాలకు, ఇండ్లకు తరలించే విధిని నిర్వహిస్తారు. ఇలా ప్రకృతికి స్త్రీలకు మధ్య ఉండే భాగస్వామ్యము సుస్థిరతను కాపాడుకుంటూ వచ్చింది.

ఎప్పుడైతే  "అభివృద్ధి"  ప్రక్రియ మొదలైందో అది ప్రకృతిని మహిళలను భయపెట్టడం కొనసాగిస్తున్నది.  ద్రవ్య  ఆర్ధిక వ్యవస్థ, వనరులను వ్యాపారంగా మార్చడంతో సహజమైన ఆవరణ వ్యవస్థ వలయాలు దెబ్బ తిన్నాయి.  ప్రకృతి అంటే ముడి సరుకుల  గనిగా భావించే స్థితి ప్రబలింది.  జీవ వైవిధ్యతను, పరస్పర ఆధారితను , పర్యావరణ స్వభావాన్ని గుర్తించని అభివృద్ధితో విషమ స్థితులు ఏర్పడుతున్నాయి. నది నుండి అడవి, అడవి నుండి పొలాలు, జంతువులు వేరు పడ్డాయి.  విడివిడిగా వృద్ధి చెందడంతో పకృతి సహజమైన సమతుల్యత అనూహ్యంగా విచ్ఛిన్నమైంది.  మనం ఈ ప్రక్రియని ప్రగతి గా పిలుస్తున్నాం.

ఇలాంటి ప్రగతి ప్రధానంగా మధ్య, దిగువ ఆదాయాలు గల మూడవ ప్రపంచ దేశ మహిళల జీవనంలో అనేక కోణాలలో సంక్షోభాన్ని సృష్టించింది.  పకృతి తన సహజ ఆకృతిని కోల్పోయింది.  అవును తిరిగి సహజ ఆవాసాలలో అవసరాలు తీరక అక్కడి ప్రజలు చెల్లాచెదురవడం  ప్రారంభమైంది.  ఈ రకమైన విషమ అభివృద్ధి నానాటికి తీవ్రం కావడం వలన పకృతి వనరుల విధ్వంసం అంతే వేగంగా జరిగింది.  దీనితో వాతావరణ మార్పులు, కరువులు, వరదలు వంటి విపత్తులు, ఉష్ణోగ్రత పెరగడాలు సంభవిస్తున్నాయి.  అడవిని వ్యవసాయాన్ని నమ్ముకుని జీవిస్తున్న మహిళల జీవితం దుర్భర స్థితికి లోనవుతున్నాయి.  అకాల వర్షాలు, కరువుల కాలంలో వ్యవసాయ రంగంలో పనిచేసే స్త్రీలు ఆదాయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.  తల్లులకు సహాయపడటం కోసం బాలికలు బడి మానేస్తున్నారు. ఇవి బాల్య వివాహాలు, మానవ అక్రమ రవాణాకు కారణమవుతున్నాయి.

వాతావరణం మార్పు వలన ఉష్ణోగ్రతలు పెరగడం వలన చాలా మంది స్త్రీలలో శిశువులు గర్భంలోనే లేదా ప్రసవానంతరం చనిపోతున్నారు. హర్మోన్స్ సమతుల్యత లోపించి తక్కువ వయస్సులోనే  బాలికల్లో ముందుగానే ఋతుస్రావం, స్త్రీలలో మెనోపాజ్ లు కలుగుతున్నాయి. మలేరియా, డెంగ్యూ, జికా వైరస్ వంటి వ్యాధులు ప్రబులుతున్నాయి.  విపత్తుల కాలంలో సమాచార లోపం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో వైఫల్యం వలన స్త్రీలు ఎక్కువగా నష్టపోతున్నారు.   సహాయక చర్యలకు కూడా వెనుకబడి పోతున్నారు.

1972  స్టాక్ హోమ్  సదస్సు ,1992 రియో సదస్సులు అభివృద్ధి చెందుతున్న దేశాలలో పర్యావరణ క్షీణత స్త్రీల జీవితాన్నీ కష్టాల్లోకి నెట్టివేస్తున్నాయని తెలియచేసింది. ఐక్యరాజ్యసమితి సహస్ర అభివృద్ధి 17 లక్ష్యాలలో 2030 నాటికి సాధించాల్సిన వాటిలో లింగ సమానత్వం ఒకటి.  ఒక మానవ ప్రాథమిక హక్కుగా లింగ సమానత్వమును సాధిస్తే అది అన్ని సహస్ర అభివృద్ధి లక్ష్యాల గమ్యానికి సుళువుగా చేరడానికి బాటలు వేస్తుంది.  త్వరితగతిన ఇది సాధించాలంటే మూడవ ప్రపంచ దేశాల పాలకులు రాజకీయ ఇచ్చని కలిగి ఉండాలి.  చట్ట సభలలో 50% సీట్లను స్త్రీలకు కేటాయించాలి.  విధానపరమైన నిర్ణయాల్లో భాగస్వామ్యం చేయాలి.  స్త్రీలు ఆహార ఉత్పత్తి దారులని వారే ప్రపంచాన్నే పోషిస్తున్నారని ప్రపంచ ఆహార సంస్థ పేర్కొంది.  జీవ వైవిధ్య పంటలను పెంచడంలో స్త్రీలు అగ్రగాములుగా ఉన్నారని తెలిపింది. ప్రపంచ ప్రజలు తీసుకునే ఆహారంలో 75% 12 జాతుల మొక్కలు,  జంతువులు ప్రధాన స్థానాన్ని ఆక్రమిస్తున్నాయి.  అధిక దిగుబడి జాతుల సాగు జరిగినప్పుడు అవి మంచినీటి వనరులను విపరీతంగా ఉపయోగించుకుంటున్నాయి.  మూడో ప్రపంచ దేశాల మహిళలు జీవ వైవిధ్యం పంటల నిర్వహణలో సిద్ధహస్తులు.  భూ యాజమాన్య హక్కులను, వ్యవసాయ నిర్వహణను అప్పగించినప్పుడు వారు వందలాది జీవవైవిధ్య పంట మొక్కలను పెంచుతూ ప్రతి ఏటా 20 నుండి 30 శాతం ఆహారపు దిగుబడిని పెంచుతున్నారు.  నీటిని పొదుపు చేస్తారు. 150 మిలియన్ల ప్రజల ఆకలి తీర్చితే  ప్రపంచ ఆకలి 15 శాతం తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.  విధాన నిర్ణయాలలో , వనరుల నిర్వహణలో,  పనులలో స్త్రీలకు సముచిత ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ప్రకృతికి మానవునికి ఉండే సహజీవన బంధం ఏర్పడి ఆకలి, పేదరికం లేని నవ సమాజం సాకారం అవుతుంది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios