కాలుష్య నియంత్రణ - సామాజిక బాధ్యత
పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక మరియు సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ మరియు నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి మరియు వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి అది సహాయపడుతుంది.
కాలుష్య నియంత్రణ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరికీ గుర్తు చేస్తూ తెలంగాణ ఎకనామిక్ ఫోరం సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక అధ్యక్షులు నేదునూరి కనకయ్య మరియు సొసైటీ ఫర్ ది రీసెర్చ్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ జాలిగామ రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.
పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక మరియు సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ మరియు నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి మరియు వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి అది సహాయపడుతుంది.
కాలుష్య కారకాలను వాతావరణంలో ప్రవేశపెట్టడాన్ని కాలుష్యం అని అంటారు. పర్యావరణ కాలుష్యం ప్రధానంగా వాయు కాలుష్యం, నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, ఉష్ణ కాలుష్యం, నేల కాలుష్యం. అంతే కాదు వ్యవసాయ, గృహ నిర్మాణాలు అటవీ నిర్మూలనకు దారితీస్తున్నాయి. అటవీ నిర్మూలన కూడా పర్యావరణ కాలుష్యానికి మరో కారణం. ఈ విధంగా జీవవులకు జీవించుటకు అత్యవసర వనరులైన గాలి, నీరు కాలుష్యానికి గురి అవుతున్నాయి.
ఆధునిక పట్టణీకరణ ప్రపంచీకరణ పారిశ్రామికీకరణ మరియు ఆధునిక సైన్స్ అండ్ టెక్నాలజీ యుగంలో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థికాభివృద్ధి పేరుతో పరిశ్రమలను ప్రోత్సహిస్తున్నారు. మరోవైపు ప్రపంచ ధనిక దేశాలు ధనార్జనే ధ్యేయంగా పేద దేశాల యొక్క సహజ వనరులు వినియోగించుకొని పారిశ్రామిక కార్యకలాపాలు కొనసాగించి ఐశ్వర్యాన్ని పెంచుకోవడంలో పోటీ పడి అభివృద్ధి చెందునుతున్నాయి. తద్వారా పర్యావరణ సమతుల్యతకు భంగం కలిగిస్తున్నాయి.
పర్యావరణ కాలుష్యం ఎక్కువై ప్రపంచ మానవాళి పలు అనారోగ్య సమస్యల వలయంలో చిక్కుకొవటమే కాకుండా మార్కెట్లో మానవ వనరుల కొరతకు దారి తీస్తుంది. పారిశ్రామిక వ్యర్థాలనుఇబ్బడి ముబ్బడిగా పడేయడం వల్ల సిరులు పండే నేల మరియు జీవాధారమైన నీరు కాలుష్యమౌతుంది. వాహనాలు, పరిశ్రమలు వదిలే పొగ గాలి కాలుష్యాన్ని తద్వారా ఉత్పన్నమయ్యే వేడి సమీప ప్రాంతాల జలాశయాల ఉష్ణోగ్రతను పెంచడం ద్వారా ఉష్ణ కాలుష్యo జరుగుతోంది. ఈ విధంగా మానవడి అనేక కార్యకలాపాల వల్ల కార్బన్ ఉద్గారం ఎక్కువ కావడంతో వాయు కాలుష్యం ఏర్పడి వాతావరణంలో మార్పులు జరుగుతున్నాయి.
వాయు కాలుష్యం వల్ల శ్వాస కోశ వ్యాధులు మరియు వివిధ రకాల మెదడు, గుండె సమస్యలు పెరుగుతున్నాయి. వాయు కాలుష్యం పెరిగి తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధులు, ఉబ్బసం, మెదడులో రక్తం గడ్డ కట్టడం, కంటి చూపు మందగించడం లాంటిరుగ్మతలు ఎక్కువ అవుతున్నాయని అనేక ఆరోగ్య సర్వేలు వెల్లడించాయి. నేడు మనం నిత్యం వాడే పాలు పండ్లు కూరగాయలు కలుషితమౌతున్నాయి. కాలుష్యం ఫలితంగా ప్రపంచంలో మానవ జాతి నయం చేయలేని భయంకర రోగాలబారిన పడి వైద్య ఆరోగ్య రంగానికి సవాల్ గా పరిణమించడం శోచనీయం.
శబ్ద కాలుష్యo వినికిడి లేదా శ్రవణ జ్ఞాన సంభంద అవయవాలపై ప్రతికూల ప్రభావాలను కలిగించటంవల్ల చెవుడు, అలసట మరియు మానసిక ఒత్తిడి అధికమై పలు మానసిక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. అణు పరీక్షలు, పరిశ్రమలు, ఆటోమొబైల్స్ ఇతర వాహనాలద్వారా వదిలివేయబడిన పొగ, సింథటిక్ డిటర్జెంట్లు, నత్రజని ఎరువులు, అధిక దిగుబడుల పేరు మీద వ్యవసాయ రంగములో , పాడి పంటల ఉత్పత్తిలో విచ్చల విడిగా వాడుతున్న పురుగు మందుల వినియోగం వలన భూమి ఉత్పత్తి సామర్ధ్యం క్షీణించి ఇది భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తుంది.
భోపాల్ లో డిసెంబర్ 3, 1984 సంవత్సరంలో జాతీయ యూనియన్ కార్బైడ్ పురుగు మందుల తయారీ కర్మాగారం నుండి విషపూరితమైన మిథైల్ ఐసోసైనేట్ (MIC) వాయువు లీకేజీ ఫలితంగా ప్రపంచంలో పెద్ద పారిశ్రామిక పర్యావరణ కాలుష్య విషాదం సంభవించింది. స్త్రీలు మరియు పిల్లలతో సహా 2000 మందికి పైగా వ్యక్తులు మరణించారు మరియు 3000 మంది తీవ్రంగా అస్వస్థతకు గురయ్యారు.
మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతటా కాలుష్యానికి వ్యతిరేకంగా ఉద్యమాలు పోరాటాలు కొనసాగి నప్పటికీ, ప్రపంచ దేశాల అధికార యంత్రాంగాల్లో, ప్రజాప్రతినిధుల్లో పర్యావరణ పరిరక్షణ చట్టాల మీద పరిజ్ఞానం లేకపోవడం ఉదాసీనత వల్ల కాలుష్యం పెరిగి మానవ మనుగడకు సవాల్ గా పరిణమించింది. అభివృద్ధి పేరుతో ప్రతిరోజూ జరుగుతున్న విచక్షణారహిత ఉల్లంఘనలకు వ్యతిరేకంగా తీవ్ర నిరసన ఉద్యమాలు సాగుతున్నాయి.
పర్యావరణ కాలుష్య నివారణకు పరిష్కారంగా:
ఇప్పటికే ఉన్న కర్మాగారాలను జనావాస మండలానికి దూరంగా ఉన్న ప్రదేశానికి భౌతికంగా ఎత్తివేయడం సాధ్యం కాదు. అయితే, పర్యావరణ కాలుష్య సమస్యను పరిష్కరించడానికి భవిష్యత్తులో ప్రభుత్వాలు కర్మాగారాలను జనావాసాలకు సుదూర ప్రదేశంలో, టౌన్‌షిప్‌కు దూరంగా ఉన్న పారిశ్రామిక సముదాయంలో ఏర్పాటుకు చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలి. వాహనాల తనిఖీలు మరియు హానికరమైన వాయువు నివారణపై ప్రజలకు అవగాహన కలిగించాలి. తగిన సాంకేతిక పరిశోధనలు చేసి కాలుష్యం నివారణకు పరిష్కారం చూపాలి.
నిబంధనలు పాటించని పరిశ్రమలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు చేపట్టాలి మరియు పర్యావరణ కాలుష్యం కలిగించని పరిశ్రమలకు ప్రోత్సాహాలు అందించాలీ. నదీ జలాల మరియు జలాశయాల కాలుష్య నివారణకు ఫ్యాక్టరీ వ్యర్థాలను నీటిలో వదిలేయడాన్ని నిషేధించాలి. అడవుల నరికివేతను అరికట్టి అడవులను అభివృద్ధి చేయాలి. మనం ప్రస్తుతం పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో విఫలమైతే మానవులు భూ గ్రహం పైన నివసించుట అసాధ్యం అవుతుందని తెలుసుకోవాలి.
ప్రపంచ స్థాయిలో వాయు కాలుష్యాన్ని పర్యవేక్షించడానికి మరియు అధ్యయనం చేయడానికి మరియు సాధ్యమైన నివారణలను రూపొందించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను పరిశోధన అభివృద్ధి శిక్షణ సంస్థను ఏర్పాటు చేసింది. మిత్ర దేశాలను ఒకచోట చేర్చి 2050 నాటికి కార్బన్ ఉద్గారం జీరోకు చేరుకోవాలన్న లక్ష్యంతో జీరో 2019 ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది. ఈ దిశగా ప్రపంచ మానవాళి కాలుష్య రహిత సమాజ నిర్మాణంలో సంపూర్ణ భాగస్వాములు కావాలని ఆశిద్దాం.
ప్రజల సహకారం లేకపోయినట్లైతె ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు రూపొందించినా ప్రయోజనం అనుకున్నంత ఉండదు. పర్యావరణ సమతుల్యతను సంరక్షించుటకు ప్రజల సామాజిక బాధ్యత. నిరంతర ప్రజా చైతన్యం పర్యావరణ పరిరక్షణలో కాలుష్య రహిత సమాజం అభివృద్ధి సాధనలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రభుత్వం, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, యువజన మహిళా సంఘాలు, పర్యావరణ పరిరక్షణ కాలుష్య నివారణా చట్టాల పై అవగాహన శిబిరాలు చర్చలు నిరంతరం నిర్వహించాలి. మీడియా, ప్రసార సాధనాలు, ప్రకృతి రక్షణ కాలుష్య నియంత్రణ విధానాల పట్ల ప్రజలను చైతన్య పరిచేందుకు తోడ్పడాలి.