ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు కాలం చెల్లు!
ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్ పెట్టేందుకు గాము మూడు చట్ట సవరణలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది.
ఎన్ఆర్ఐ భర్తల ఆగడాలకు చెక్ పెట్టేందుకు గాము మూడు చట్ట సవరణలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనకు కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపింది. ఎన్ఆర్ఐ భర్తలు, వివాహాల విషయంలో వివాహ చట్టం, పాస్‌పోర్టు చట్టం, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ)లలో మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వచ్చేవారం జరగనున్న కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చనున్నాయి.
ఎన్ఆర్ఐ పెళ్లిళ్లకు సంబంధించి, వివాహం జరిగిన వారం రోజులలోపే రిజిస్ట్రేషన్ చేయించడం తప్పనిసరి చేసేలా వివాహ చట్టంలో మార్పులను అలాగే, వివాహ ధ్రువీకరణ పత్రం అందించని వారి పాస్‌పోర్టును రద్దు చేసేలా పాస్‌పోర్టు చట్టంలో మార్పులను మరియు భారత్‌లో నమోదయ్యే కేసులకు సంబంధించి ఎన్ఆర్ఐ భర్తల వివరాలను విదేశీ వ్యవహారాల శాఖ వెబ్‌సైట్‌లో సమన్లను అప్‌లోడ్ చేసి ఆ సమన్లను బాధ్యులు వాటిని స్వీకరించినట్లుగా పరిగణించి ఒకవేళ వారి నుంచి సమాధానం రాకున్నట్లయితే వారిని పరారీలో ఉన్న నిందితులుగా గుర్తించేలా సీఆర్పీసీలో చట్ట సవరణలు తీసుకురావాలని ఈ బిల్లులో ప్రతిపాదించినట్లు మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాకేశ్ శ్రీవాస్తవ చెప్పారు.
విదేశాల్లో ఉంటూ, తమ విలాసవంతమైన జీవనశైలితో ఇక్కడి వారిని ఆకట్టుకుని పెళ్లి చేసుకున్న తర్వాత జీవితభాగస్వామిని వదిలివేయటం లేదా వారిని వేధించడం వంటి పలు ఉదంతాలు రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఎన్ఆర్ఐ భర్తలు తమను వేధిస్తున్నారంటూ వస్తున్న ఫిర్యాదులు నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో, ఈ సమస్యల పరిష్కారానికి కేంద్రం ఒక కమిటీని నియమించింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి మనేకా గాంధీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ల ఆధ్వర్యంలో ఈ కమిటీ నియామకమైంది.