ఫేస్ బుక్ ఫ్రెండ్: గదిలో బంధించి అమ్మాయిపై నాలుగు రోజులు రేప్

School girl kidnapped, raped by Facebook friend
Highlights

కోట పాఠశాల విద్యార్థినిని అపహరించి, గదిలో బంధించి ఓ వ్యక్తి ఆమెపై నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు.

కోట: కోట పాఠశాల విద్యార్థినిని అపహరించి, గదిలో బంధించి ఓ వ్యక్తి ఆమెపై నాలుగు రోజుల పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫేస్ బుక్ ద్వారా పరిచయం పెంచుకుని, స్నేహం చేసి ఆ ఘాతుకానికి పాల్పడ్డాడు. అతని మిత్రుడు అందుకు సహకరించాడు.

ఇద్దరిని పోలీసులు అరెస్టు చేసి సోమవారంనాడు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. కోర్టు వారికి మే 15వ తేదీ వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది.

పదహారేళ్ల వయస్సు గల బాధితురాలు ఓ ప్రైవేట్ స్కూల్లో 11వ తరగతి చదువుతోంది. నిందితులను పంకజ్ ధోపీ (22), దినేష్ లోధ (25)లుగా గుర్తించారు. కోటలోని మహావీర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో గల రంగ్ బడికి చెందినవారు. 

కీలక నిందితుడు పంకజ్ బిఎ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అమ్మాయితో అతను ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసుకుని, ఫోన్ లో మాట్లాడుతూ వచ్చాడని ఆర్కె పురం పోలీసు స్టేషన్ ఎస్సై ప్రతాప్ రావు చెప్పారు. ఏప్రిల్ 24వ తేదీన పాఠశాలకు వెళ్తుండగా స్కూటర్ పై దించుతానని అమ్మాయిని నమ్మించాడు. 

ఆమెను నగరమంతా తిప్పి తన మిత్రుడు దినేష్ ఏర్పాటు చేసిన గదికి తీసుకుని వెళ్లాడు. ఆ గదిలో ఆమెను బంధించి నాలుగు రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశాడు. 

శనివారంనాడు వారి నుంచి తప్పించుకుని బాలిక ఇంటికి చేరుకుంది. తల్లిదండ్రులకు విషయమంతా చెప్పింది. వారు ఆర్కె పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనలో మరింత మంది పాత్ర ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.

loader